ఖాళీగా ఉన్న ప్రయివేటు స్థలాలను ఎట్టి పరిస్థితుల్లో ఆక్రమించుకుంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. అదే ప్రకారం దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్న సంఘటనలు కూడా జరుగుతున్నాయి. ఇదంతా ఎక్కడో కాదు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కడప జిల్లాలోనే జరుగుతున్నది.
కడప జిల్లా రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలోనైతే అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలు పెచ్చుమీరాయి. మాకు రాజకీయాలతో సంబంధం లేదు, మా జోలికి ఎందుకు వస్తారు అని మొత్తుకుంటున్నా వారు వినడం లేదు. గత రెండు మూడు రోజులుగా రాజంపేట ప్రాంతంలోని చెన్నయ్యగారిపల్లిలో నైతే దౌర్జన్యాలు పెచ్చుమీరిపోయాయని స్థానికులు చెబుతున్నారు. స్థానిక శాసనసభ్యుడు మేడా మల్లికార్జున రెడ్డి అనుచరులుగా చెప్పుకుంటూ వారు చేస్తున్న దౌర్జన్యాలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే మరింతగా తమపై వత్తిడి పెంచుతారని భయంతో అక్కడి ప్రజలు మౌనంగా ఉంటున్నారు.
గత రెండు రోజులుగా లక్ష్మీనారాయణ అనే వ్యక్తి తాను మేడా మల్లికార్జున రెడ్డి అనుచరుడుగా చెప్పుకుంటూ చేస్తున్న దౌర్జన్యాలు పెరిగిపోయాయి. స్థానికంగా ఒక ముఠాను నిర్వహించే లక్ష్మీనారాయణ తమను హింసిస్తున్నాడని స్థానికులు వాపోతున్నారు. పోలీసు ఉన్నతాధికారులు నేరుగా జోక్యం చేసుకుని తమను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.