32.3 C
Hyderabad
May 26, 2020 01: 46 AM
Slider ప్రత్యేకం

ఉద్యోగుల జీతాల భారం దించుకోవడానికి ఉత్తమ మార్గం

banks in India

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తూ జీవితాలు అతలాకుతలం చేస్తున్న సమయంలో ఆర్ధిక సంక్షోభం మాటు వేసి ఉంది. మన దేశానికో, మన రాష్ట్రానికో కాకుండా ప్రపంచం మొత్తం ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయి ఉన్నాయి. కరోనా ప్రారంభమైన తొలి నెల జీతాన్నే రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వలేకపోయాయి.

ఇదే మరో రెండు మూడు నెలలు కొనసాగితే? ఊహించేందుకు కూడా భయం కలిగించే ఈ అంశానికి పరిష్కారం లేదా? ప్రపంచ ఆర్ధిక మాంద్యాన్ని తొలగించేందుకు లేదా దేశ ఆర్ధిక మాంద్యాన్ని తొలగించేందుకు చిట్కాలు లేవు కానీ రెండు తెలుగు రాష్ట్రాలు ఈ సంక్షోభంలో కొద్ది మేరకు ఉపశమనం పొందేందుకు వీలుంది.

ఇది పెద్ద కష్టమైన విషయం కూడా కాదు. రెండు రాష్ట్రాలలో ఆపరేట్ చేస్తున్న ప్రయివేటు, ప్రభుత్వ రంగ బ్యాంకులను సమన్వయం చేసుకుంటే పరిష్కారం దొరుకుతుంది. ప్రభుత్వాలకు జీతాల భారం ఒక్కటే అతిపెద్ద కమిట్ మెంట్. మిగిలిన ఖర్చులు ఏ విధంగానైనా పొదుపు చేయవచ్చు కానీ జీతాలు పొదుపు చేయడం కుదరదు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్ దారులకు జీతాల్లో కోత పెట్టిన నేపథ్యంలో కొద్ది మేరకు వెసులుబాటు కల్పించేందుకు బ్యాంకులు ముందుకు రావచ్చు. ఈ రెండు రాష్ట్రాల  ప్రభుత్వాల నుంచి ప్రతిపాదనలు వస్తే బ్యాంకులు ముందుకు వచ్చే అవకాశం ఉంది.

రెండు తెలుగు రాష్ట్రాలలోని బ్యాంకుల వద్ద మూలధనం ఉంది. కరోనా నేపథ్యంలో ఏ వినియోగదారుడూ రుణాలు తీసుకోవడానికి ముందుకు రాకపోవచ్చు. వచ్చినా వారు తీర్చే శక్తి చాలా కాలం వరకూ ఉండకపోవచ్చు. పాత రుణాలపైనే మారటోరియం విధించాలనే డిమాండ్ నేపథ్యంలో బ్యాంకులు కొత్త రుణాలు ఇచ్చే అవకాశం చాలా తక్కువ.

 అయితే బ్యాంకులు కూడా వ్యాపారం చేసుకోవాలి కదా? అందుకే ఈ మధ్యే మార్గం అనుసరిస్తే అటు ప్రభుత్వాలకు ఇటు బ్యాంకర్లకు పూర్తి రక్షణ ఉంటుంది. అంతే కాదు లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబాలు ఆనందంగా ఉంటాయి. ప్రభుత్వం జీతాలు చెల్లించే భారం తప్పించుకుంటే ఆర్ధికంగా ఎంతో వెసులు బాటు కలుగుతుంది.

జీతాలు చెల్లించే భారం నుంచి తప్పుకుంటే ఉద్యోగులు ఆకలికేకలు వేస్తారు అంతే కాకుండా ప్రభుత్వ యంత్రాంగం పని చేయని పరిస్థితులు తలెత్తితే ఇక దేశం కోలుకోవడం కష్టమౌతుంది. ఈ నేపథ్యంలో బ్యాంకుల నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు జీతం చెల్లించేలా చేసుకోవడం మంచి పరిష్కారం అవుతుంది.

బ్యాంకులు చెల్లించడం అంటే ఊరికనే ఇచ్చేయడం కాదు. ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాంకులు వారి వారి జీతం మొత్తాన్ని రుణంగా మంజూరు చేయాలి. ఒక నెలో లేదా రెండు, మూడు నెలలో బ్యాంకులు కన్సార్షియంగా ఏర్పడి ప్రభుత్వ ఉద్యోగస్థులకు జీతాలు చెల్లించే ఏర్పాటు చేసుకోవాలి.

ఇప్పుడు బ్యాంకులు వేరే వారికి రుణాలు ఇవ్వలేవు. ఇచ్చినా తిరిగి రావు. అందుకోసం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలను రుణాలుగా ఇవ్వాలి. దీనికి ప్రభుత్వం ఆయా బ్యాంకులకు ష్యూరిటీ ఇవ్వాలి. ఒక అంచనా ప్రకారం మూడు నుంచి నాలుగు నెలల వరకూ ప్రభుత్వ ఉద్యోగులకు ఈ విధంగా జీతాలు చెల్లించవచ్చు.

ప్రభుత్వ ఉద్యోగి జీతం బ్యాంకు విడుదల చేసిన తర్వాత యధా విధిగా సంబంధిత బ్యాంకులకు గతంలో తీసుకున్న రుణాలకు సంబంధించిన ఈఎంఐ లు ఉంటే మినహాయించుకుంటారు. అందు వల్ల బ్యాంకులు గతంలో ఇచ్చిన రుణాలను కూడా ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వసూలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

ప్రభుత్వ ఉద్యోగికి జీతం గ్యారెంటీ కాబట్టి చక్కగా పని చేస్తాడు. ఈ విధంగా బ్యాంకు నుంచి రుణంగా తాను తీసుకున్న జీతాన్ని ఆ తర్వాతి కాలంలో పరిస్థితి చక్కబడ్డ తర్వాత సాధారణ వడ్డీతో తిరిగి చెల్లించవచ్చు. లేదా వడ్డీని ప్రభుత్వం భరిస్తే ఉద్యోగులు అసలు మొత్తాన్ని చెల్లించవచ్చు.

లేదా తమ వద్ద నిల్వ ధనం ఉన్న ఉద్యోగులు తమ జీతాన్ని బ్యాంకు రుణంగా ఇచ్చే సౌకర్యాన్ని వాడుకోకుండా అలాగే ఉంచేసుకోవచ్చు కూడా. ఇలా ప్రభుత్వానికి పెద్ద వెసులు బాటు. అలాగే ఉద్యోగులకు కూడా వెసులు బాటే. బ్యాంకులకు రిటైల్ లోన్స్ బాగా పెరుగుతాయి.

9 % వడ్డీతో షార్ట్ టర్మ్ లోన్స్ ఇస్తేవారికి లాభమే. అలాగే టీచర్స్ అందరికి ఇవ్వ వచ్చు. వడ్డీ మాత్రం ప్రభుత్వమే ఇవ్వాలి. ఇలా బ్యాంకులు ఇచ్చిన రుణ జీతాన్ని ఓ ఏడాది లో ప్రతి నెలా ప్రభుత్వమే వసూలు చేయాలి. ఇతర రిస్క్ ఫాక్టర్స్ బ్యాంకు వారు చూసుకోవాలి.

వాటిలో అప్పు తీసుకొన్న వ్యక్తి రిటైర్మెంట్, మరణము, ఇతర క్రమ శిక్షణ చర్య అన్ని కూడా పొందు పరచుకోవాలి. వీటన్నింటికి ప్రభుత్వం హామీ ఉండాలి.

ఈ బ్యాంకుల వాళ్ళు నువ్వా నువ్వా అంటూ కనిపించిన వాడిని అందరిని అప్పు తీసుకో అని వెంటబడే కన్నా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలను అప్పుగా ఇచ్చి ప్రభుత్వానికి వెసులు బాటు కలిగించ వచ్చు కదా.

ప్రభుత్వమూ కొంచం బాధ్యత తీసుకుని రికవరీ చేసి పెట్టవచ్చు. ఇలా చేయడం వల్ల మిగిలే నిధులను ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు వినియోగించుకోవచ్చు. బ్యాంకులు తమ వద్ద ఉన్న నిల్వలను సెక్యూర్డు లోన్లుగా మార్చుకుని వడ్డీ ఆదాయం సంపాదించవచ్చు.

ఉద్యోగులు రెగ్యులర్ గా జీతాలు అందుకుని చక్కగా పని చేయవచ్చు.

అబ్బరాజు భాస్కరరావు, రిటైర్డ్ బ్యాంకర్  

Related posts

ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి

Satyam NEWS

నర్సింహన్ కు నామినేటెడ్ పోస్టా? ఏందది?

Satyam NEWS

ప్రకంపనలు సృష్టిస్తున్న మెగాస్టార్ సైరా ట్రైలర్

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!