29.7 C
Hyderabad
April 29, 2024 10: 05 AM
Slider ముఖ్యంశాలు

Analysis: గవర్నర్ వ్యవస్థ బరువు కాదు బాధ్యత

#Tamilsai Soundararajan 1

రాజ్ భవన్ లో ప్రజాదర్బార్ నిర్వహణ, సభలు, సమావేశాలలో పాల్గొని ప్రజలతో మమేకం కావడం, ప్రైవేటు యూనివర్సిటీల కు మద్దతుగా మాట్లాడడం, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలను ప్రశంసించడం వంటి అంశాలు గవర్నర్ డా.తమిళసై సౌందర్య రాజన్ పనితీరుకు అద్దం పడుతున్నాయి. పరిపాలనలో గవర్నర్ ప్రమేయం పై తెరాస ప్రభుత్వానికి సహజంగానే రుచించలేదు.

కానీ… రాజ్యాంగ బద్ధంగా నియమితులైన గవర్నర్ కు  రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా ఉండాల్సిన ఆవశ్యకత కారణంగా ముఖ్యమంత్రి  కేసీఆర్ తనదైన శైలితో సామరస్య ధోరణి తోనే వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా విజృభిస్తున్న నేపథ్యంలో చేపడుతున్న కార్యాచరణను ముఖ్యమంత్రి గవర్నర్ కు తెలియపరచి, సలహాలు తీసుకోవడం కొన్నిరోజులుగా గమనిస్తున్నాం.

అయితే…. ఇటీవల కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం సత్వర నియంత్రణ చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తోందని బీజేపీ, కాంగ్రెస్,  ఇతర ప్రజాసంఘాలు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. దీనికి తోడు ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా వ్యాధిగ్రస్తులకు ఎదురవుతున్న చేదు అనుభవాలు గవర్నర్ దృష్టికి చేరడం …వాటిపై స్పందించిన గవర్నర్  సీఎస్ సోమేశ్ కుమార్, వైద్యఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ని చర్చకు పిలవడం వెనువెంటనే చోటుచేసుకున్నాయి.

ప్రయివేటు ఆసుపత్రులు మెరుగైన వైద్యం అందివ్వాలి

ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో గవర్నర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో అనేక అంశాలు చర్చకు వచ్చాయి. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ఒక్కరికీ వైద్యం నిరకరించొద్దని, కరోనా బాధితులకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని హితవు పలికారు. ప్రభుత్వ- ప్రైవేట్ సమన్వయం తో అందరికీ వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రభుత్వం కూడా కరోనా సంక్షోభాన్ని బాధ్యతగా, సమర్ధవంతంగా ఎదుర్కోవాలని సూచించారు.

ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులకు మార్గదర్శకాలకు అనుగుణంగా ఆసుపత్రులు మానవతా దృక్పథంతో పనిచేయాలని గవర్నర్ ఆకాంక్షించారు. కరోనా సంక్షోభానికి ముందున్న పరిస్థితులు గమనిస్తే….కేంద్రప్రభుత్వ నిర్ణయాలకు కేసీఆర్ తలూపిన సందర్భాలు అరుదుగా కనిపిస్తాయి.

కేంద్రంతో దాగుడుమూతలు

కీలకమైన ఆర్టికల్ 370 రద్దు వంటి అంశాలలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. కానీ….వివాదాస్పద సి ఏ ఏ, ఎన్ పీ ఆర్, ఎన్ ఆర్ సీ చట్టాల అమలును తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారు. తాజాగా కేంద్రం తలపెట్టిన విద్యుత్ బిల్లుల సవరణను సైతం ఆమోదించేదిలేదని నిర్ద్వంద్వంగా ప్రకటించారు.

ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తే కేంద్రానికి మద్దతు ఇవ్వబోమని కేసీఆర్ తన మొండివైఖరిని స్పష్టం చేశారు. రాష్టానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, గ్రాంటులు, సబ్సిడీల విషయం లోనూ కేసీఆర్ పట్టుదలగా ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో….తెలంగాణా రాష్ట్రంలో బీజేపీ బలడడానికి అవసరమైన కార్యాచరణకు బీజేపీ కేంద్ర నాయకత్వం పావులు కదుపుతోంది.

రాష్ట్రంలో టీ ఆర్ ఎస్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది.. రాజకీయ ఎత్తుగడలను అవలంబిస్తూనే గవర్నర్ వ్యవస్థనూ ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నాలకు కేంద్రం, బీజేపీ అధి నాయకత్వం సాహసిస్తోంది.

రానున్న రోజులలో రాజకీయ పరిణామాలు ఎలా ఉండగలవన్నది రాజకీయ వర్గాలలో వేడి పుట్టిస్తోంది. కరోనా సంక్షోభం నుంచి గట్టెక్కే దిశగా తక్షణమే చర్యలు చేపట్టాలని గవర్నర్ సూచించడం ఏ మేరకు ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలిస్తుందో వేచి చూడాలి.

పొలమరశెట్టి కృష్ణారావు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విశ్రాంత ఉన్నతాధికారి

Related posts

సర్పంచ్ భర్తపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల డిమాండ్

Satyam NEWS

అగ్ని ప్రమాదంలో తండ్రీ కొడుకులు సజీవదహనం

Murali Krishna

నెలకుర్రు గొల్లపాలెం గ్రామంలో శ్రీకృష్ణ శిలావిగ్రహ ప్రతిష్టాపన

Bhavani

Leave a Comment