40.2 C
Hyderabad
April 29, 2024 16: 51 PM
Slider సంపాదకీయం

ఏపీలో ఏమీ జరగడం లేదు… అంతా ఎల్లోమీడియా ప్రచారమే

#YSJaganmohanReddy

తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ నాయకురాలు, పంచాయితీ ఎన్నికల అభ్యర్థి పుష్పవతి భర్త శ్రీనివాస్‌రెడ్డి మరణం, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్టు, తెలుగుదేశం నాయకుడు పట్టాభి ఇంటిపై దాడి….. పంచాయితీ ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్.ఎన్.రమేష్ కుమార్ కఠిన చర్యలు తీసుకుంటున్నా…. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాను ఏం చేయాలనుకుంటున్నదో అదే చేస్తున్నది.

 పోలీసులు ఇంకా చాలా మంది రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఏం చెబితే అదే చేస్తున్నారు. ఇవన్నీ ఎల్లోమీడియా చేస్తున్న ప్రచారాలు మాత్రమే, రాష్ట్రంలో ఎక్కడా ఏం జరగడం లేదు, అంతా ప్రశాంతంగా ఉంది… పైగా తెలుగుదేశం పార్టీ వారే దాడులు చేసి నింద మాపై వేస్తున్నారు అంటే ఎవరూ ఏం చేయలేరు.

అన్ని పంచాయితీలలో  ఏకగ్రీవాలు జరగాలని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శతవిధాలా ప్రయత్నం చేసింది. తొలివిడత నామినేషన్లు వేసిన 4 వేల పంచాయితీలలో 95 వరకూ మాత్రమే ఏకగ్రీవాలు అయ్యాయి. మిగిలిన చోట్ల అభ్యర్ధులు రంగంలో ఉన్నారు.

వారిని ఉపసంహరణ లోపు బెదిరించి ఉపసంహరించి ఏకగ్రీవాలు చేసుకుంటే మనం ఏం చెప్పలేం కానీ రాష్ట్రాన్ని పాలిస్తున్న వారి మనోభిష్టానికి భిన్నంగా పంచాయితీ ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్రాన్ని పాలిస్తున్న వారి అభీష్టానికి ప్రజలు అనుకుంటున్నదానికి తేడా ఉన్నట్లు స్పష్టం అవుతున్నది.

ఈ ఒక్క విషయం తోనే నిర్ణయానికి ఎలా వస్తారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, జగన్ రెడ్డి అభిమానులు ప్రశ్నించవచ్చు. అదీ కరెక్టే. తొలి విడత నామినేషన్ల పర్వం చూసిన తర్వాత దానికి విరుగుడు ఆలోచించి ఏకగ్రీవాలు ఎక్కువ చేసుకునే ప్రయత్నం చేయవచ్చు… లేదా ఈ స్ఫూర్తితో మరిన్ని చోట్ల పోటీ కూడా పెరగవచ్చు.

నాలుగు వేల పంచాయితీలలో 34 వేల నామినేషన్లు దాఖలు కావడానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్.ఎన్.రమేష్ కుమార్ ను అభినందించి తీరాల్సిందే. పార్టీ రహితంగా జరుగుతున్న ఎన్నికలలో పార్టీ పరమైన ఆలోచన చేయడం రాజ్యాంగ విరుద్ధం అని కొందరు వాదించవచ్చు.

అంతా గోప్యం అంటే ఎప్పటికైనా ప్రమాదమే

అన్నీ రాజ్యాంగ పరంగా జరుగుతున్నప్పుడు ఇలాంటి వాదన చేయవచ్చు కానీ రాజ్యాంగ విరుద్ధమైన చర్యలే ఎక్కువ జరుగుతున్న సమయంలో పార్టీ రహితంగా జరిగే ఎన్నికలలో పార్టీలు జోక్యం చేసుకోవడం పెద్ద తప్పేం కాదు. రాష్ట్రాన్ని లేదా దేశాన్ని పరిపాలించేవారు గుప్పెట మూసి ఉంచేందుకు ప్రయత్నించకూడదు.

అలా చేస్తే ప్రజలే ఆ గుప్పిటను తెరచి అందులో ఏముందో చూస్తారు. సాధ్యమైనంత వరకు పారదర్శకంగా ఉండగలిగితే పాలన చక్కగా సాగుతుంది. ప్రతిది రహశ్యంగా చేయాలనుకోవడం, కుట్రపూరితంగా వ్యవహరించడం చాలా కాలం పాటు సాగే అవకాశం ఉండదు. గ్రామ పంచాయితీలలో దాఖలైన నామినేషన్లు చేసిన తర్వాత ఇంతకు ముందు జెడ్ పి టి సి, ఎంపిటిసి ఎన్నికలలో జరిగిన ఏకగ్రీవాలపై చర్చ ఊపు అందుకుంది.

అందుకు కారణం అధికార వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరే అనడం లో సందేహం లేదు. పంచాయితీలలో ఏకగ్రీవాలపై ఇంత పట్టు పట్టి ఉండకపోతే గతంలో జరిగిన ఏకగ్రీవాలపై చర్చ జరిగి ఉండేది కాదు.. కానీ వారే చేతులారా చేసుకుంటున్నారు.

జెడ్ పి టిసి, ఎంపిటిసి లకు ఏకగ్రీవంగా జరిగిన ఎన్నికలను రద్దు చేయాలని ఇప్పుడు దాదాపుగా అన్ని పార్టీలూ కోరుతున్నాయి. పంచాయితీలలో వచ్చిన అనుభవం దృష్ట్యా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అన్ని పార్టీల డిమాండ్ కు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నా తీసుకోవచ్చు. చెప్పలేం.

Related posts

తిష్టవేసుకుని కదలని తిరుపతి రెవెన్యూ ఉద్యోగులు

Satyam NEWS

స‌మ‌గ్ర వ్య‌వ‌సాయ ప్ర‌ణాళిక త‌యారుచేయాలి

Satyam NEWS

వనపర్తి నియోజకవర్గంలో వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు:మేఘారెడ్డి

Bhavani

Leave a Comment