35.2 C
Hyderabad
April 27, 2024 14: 45 PM
Slider ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకం

ప్రవీణ్ ప్రకాశ్ కు షోకాజ్ నోటీసు జారీ చేసిన ఎల్ వి

pjimage (15)

పాలనా నిబంధనలు తరచూ ఉల్లంఘిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ కు నేడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రహ్మణ్యం షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో నిబంధనల ప్రకారం కాకుండా ఇష్టారీతిన తనకు తోచిన విధంగా అంశాలను ప్రతిపాదించడంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రహ్మణ్యం ఈ షోకాజ్ నోటీసు ఇచ్చారు. ఇటీవలి కాలంలో ప్రవీణ్ ప్రకాశ్ ఇచ్చిన పలు జీవోలు వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. ప్రభుత్వ పాలనా నిబంధనలకు విరుద్ధంగా ఆయన చేస్తున్న పనులు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులలో సైతం తికమక కలిగిస్తున్నాయి. దీనిపై ఐదుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది. పాలనాయంత్రాంగంలో కన్ఫ్యూజన్ సృష్టిస్తున్న ప్రవీణ్ ప్రకాశ్ ఆదేశాలు ఏ మాత్రం ఆచరణ యోగ్యం కాదని సీనియర్ ఐఏఎస్ అధికారులు ముఖ్యమంత్రికి చెప్పినట్లుగా తెలిసింది. ప్రవీణ్ ప్రకాశ్ ఇటీవల ఇచ్చిన జీవోలన్నీ కూడా వివాదాస్పదమే అయ్యాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సంబంధం లేకుండా ఏ శాఖ అధికారి ఆ శాఖకు చెందిన సబ్జెక్టులపై జీవోలు ఇచ్చుకోవచ్చుననే విధంగా ప్రవీణ్ ప్రకాశ్ గత నెల 25న జీవో ఎంఎస్ నెం.128 ను ప్రవీణ్ ప్రకాశ్ జారీ చేశారు. ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలు తక్షణమే అమలు అయ్యే విధంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన ఆ జీవోలో పేర్కొన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రహ్మణ్యం తీవ్ర మనస్తాపం చెందిన విషయం సత్యం న్యూస్ వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఇదే కాకుండా ప్రవీణ్ ప్రకాశ్ చొరవతో జారీ అయిన జీవోలు అన్నీ కూడా వివాదాస్పదం అయ్యాయి. ప్రవీణ్ ప్రకాశ్ తన కన్నా సీనియర్ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసే విధంగా ప్రవర్తిస్తున్నారని పలు ఫిర్యాదులు ఉన్నాయి. ఈ విషయాలన్నీ ముఖ్యమంత్రి వరకు చేరడంతో విషయం సీరియస్ అయింది. మంత్రి వర్గ సమావేశంలో ఏ విషయాలపై చర్చ జరపాలనే ఎజెండాను వివిధ శాఖల అధిపతుల నుంచి సమాచారం సేకరించి ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపితే దానిపై ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకుని తదుపరి ఆదేశాలు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశిస్తారు. అందుకు భిన్నంగా ప్రవీణ్ ప్రకాశ్ ప్రధాన కార్యదర్శికి తెలియచేయకుండా తనంత తానుగానే సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి హోదాలో ఎజెండా తయారు చేశారని తెలిసింది. ఇలా ఏ అధికారి కూడా స్వతంత్రించి క్యాబినెట్ ఎజెండా రూపొందించే వీలు లేదు. లేని అధికారాలను దఖలు పరుచుకుని చర్యలు తీసుకున్నందున ప్రవీణ్ ప్రకాశ్ కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రహ్మణ్యం నేడు షోకాజ్ నోటీసు జారీ చేశారు.

Related posts

బ్లాక్ ఫంగస్ భయంతో ఒక మహిళ ఆత్మహత్య

Satyam NEWS

కోవిడ్ ఎలర్ట్: మీడియా పాయింట్ వద్ద నో ఎంట్రీ

Satyam NEWS

దళితబంధు లబ్దిదారునికి టాటా ఏస్ గూడ్స్ వాహనం అందజేత

Satyam NEWS

Leave a Comment