42.2 C
Hyderabad
April 26, 2024 18: 37 PM
Slider సంపాదకీయం

చిన్న పత్రికలుగా మారిపోయిన పెద్ద పత్రికలు

newspapers

పెద్ద పత్రికలలో పని చేసే జర్నలిస్టులు చిన్న, మధ్య తరగతి పత్రికల్లో పని చేసే జర్నలిస్టులను చిన్న చూపు చూస్తుంటారు. ప్రస్తుతం చిన్న మధ్య తరగతి పత్రికల్లో పని చేసే జర్నలిస్టుల్లో దాదాపు 80 శాతం మంది పూర్వాశ్రమంలో పెద్ద పత్రికలలో పని చేసి ఉంటారు.

జర్నలిస్టు అంటే సమాచారాన్ని సేకరించి హృద్యంగా రాయడం. అంతే. పత్రిక చిన్నదా పెద్దాదా అనేది యాజమాన్యాలకు సంబంధించినది. ఈ చిన్న లాజిక్కును ‘పేద్ద’ జర్నలిస్టులు మర్చిపోతుంటారు. కాలం గడిచే కొద్దీ వారిని పెద్ద పత్రికలు తీసేస్తే వారు చేసేది కూడా ఇదే. అయితే భవిష్యత్తు వారికి తెలియదు కాబట్టి ఇది చెప్పాల్సి వస్తున్నది.

ఇంతకూ ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే ముందు చిన్న, మధ్య తరగతి పత్రికల గురించి చెబుతా. చిన్న పత్రికలకు తగిన మూల ధనం ఉండదు. పత్రికా ప్రకటనలు రాకపోవడం వల్ల ఆదాయం ఉండదు. అందువల్ల ప్రకటనలను బతిమిలాడి తెచ్చుకోవాల్సి వస్తుంది.

న్యూస్ ప్రింట్ కొనే స్తోమతు ఉండదు. పెద్ద సంఖ్యలో పత్రికలు అచ్చువేయించే పరిస్థితి ఉండదు. పెద్ద పత్రికల లాగా పత్రికలను పంచి పెట్టే సొంత వ్యవస్థ ఉండదు. డెస్క్ జర్నలిస్టులు తక్కువ మంది ఉంటారు. ఫీల్డ్ లో కూడా తక్కువ మందే ఉంటారు.

వీరంతా జర్నలిజం పై మమకారంతోనే కాలం వెళ్లబుచ్చుతుంటారు అర్ధాకలితో. ఆర్ధికంగా ఏ మాత్రం ప్రయోజనం లేకపోయినా సమాజాన్ని ఏదో ఉద్ధరిస్తున్నామన్న ఫీలింగ్ లో బతుకుతుంటారు. ఇప్పుడు తాజా పరిస్థితి ఏమిటో తెలుసా? సో కాల్డ్ పెద్ద పత్రికలకు న్యూస్ ప్రింట్ లేదు.

కొనే స్తోమతు పోయింది. ఎందుకంటే ప్రకటనలు రావడం లేదు. ఆదాయం జీరో కు వచ్చింది. బతిమాలినా ప్రకటనలు రావడం లేదు. ఆంధ్రాబ్యాంకు యూనియన్ బ్యాంకులో విలీనం చేసే సమయంలో ఒక ఫుల్ పేజీ యాడ్ ఇచ్చినట్లే ఇచ్చి ఆఖరు నిమిషంలో రద్దు చేశారు. అదీ పరిస్థితి.

కేవలం ఒక్క 15 రోజుల పాటు ఆదాయం లేకపోతేనే ‘పేద్ద’ పత్రికలు సర్క్యులేషన్ తగ్గించుకున్నాయి. స్టాఫ్ ను తీసేశాయి. డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ ను నిర్వహించ లేక చేతులు ఎత్తేశాయి. ఒక్క 15 రోజులు ఆదాయం లేకపోతేనే దిక్కులు చూస్తున్న‘‘ పేద్ద పత్రిక’’ల్లో పని చేసే జర్నలిస్టులారా ఇప్పుడైనా గుర్తించారా?

పెద్ద చిన్న అనేది జర్నలిస్టుల్లో ఉండదు. ఒక్కొక్కరి టైమ్ అంతే. ఇప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి పత్రికల టైమ్ వచ్చింది. అవి చిన్న పత్రికలు గా మారిపోయాయి. స్టాఫ్ ను తీసేశారు. సర్క్యులేషన్ వేలల్లోకి వచ్చేసింది. న్యూస్ ప్రింట్ కొనే స్తోమతు పోయింది.

సర్క్యులేషన్ వ్యవస్థ లేదు. పెద్ద పత్రికల జర్నలిస్టుల బతుకు తెల్లారి నందుకు చిన్న పత్రికల జర్నలిస్టులు సంతోష పడలేదు. బాధతో నే ఈ విషయాన్ని అందరికి పంచుకున్నారు. పేద్ద జర్నలిస్టులారా మీకు సంఘీభావం తెలిపింది ఈ ‘చిన్న’ పత్రికల జర్నలిస్టులే. గుర్తించండి. ఇక ముందు పెద్ద పేపర్ చిన్న పేపర్, పెద్ద టీవీ చిన్న టీవీ అని తేడాలు చూపించవద్దు. బుద్ధి తెచ్చుకోండి.

సత్యమూర్తి పులిపాక, చీఫ్ ఎడిటర్, సత్యం న్యూస్

(వ్యాసకర్త ఈనాడు, ఆంధ్రభూమి, వార్త దినపత్రికల్లో ప్రధాన భూమిక పోషించాడు. సూర్య దినపత్రిక వ్యవస్థాపక ఎడిటర్, మనం, నేడు పత్రికల వ్యవస్థాపక ఎడిటర్, ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్ అసోసియేట్ ఎడిటర్, ఈఎమ్ఎస్, ఆదాబ్ హైదరాబాద్ లాంటి పత్రికల్లో ఎడిటర్ గా పని చేశాడు. విజయక్రాంతి దిన పత్రిక చీఫ్ ఎడ్వయిజర్ గానూ మరెన్నో న్యూస్ మీడియాలకు హెడ్ గా పని చేశాడు)  

Related posts

తిరుమల బోర్డులో తెలంగాణకు పెద్దపీట

Satyam NEWS

స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేసిన విద్యార్ధులు

Satyam NEWS

బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో ధన్వంతరి హోమం

Satyam NEWS

Leave a Comment