37.2 C
Hyderabad
April 26, 2024 20: 39 PM
Slider సంపాదకీయం

ఏపి పాలిటిక్స్: కేంద్ర బిజెపికి తెలిసి వస్తున్న నొప్పి

j p nadda

రాజ్యసభలో వైసిపికి ఉన్న సభ్యులు అవసరం అయితే ఉపయోగపడతారని చూసి చూడనట్లు వెళుతున్న భారతీయ జనతా పార్టీ కేంద్ర కమిటీకి ఇటీవల ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు చుక్కలు చూపిస్తున్నాయి. ఎన్ పీ ఆర్ ను అమలు చేయరాదని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయంతో ఒక్క సారిగా బిజెపి అధిష్టానం కంగుతిన్నది.

వాస్తవంగా ఎన్ పీ ఆర్ పై రాష్ట్రాలకు అధికారంలేదు. అయినా సరే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ముస్లింలను మచ్చిక చేసుకోవడం కోసం వై ఎస్ జగన్ ఈ రాజకీయ పాచిక వేశారు. రాజకీయంగా బలపడేందుకు జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలనే ఉపయోగించుకోవడంతో బిజెపి పెద్దలకు ఇక్కడ జరుగుతున్నదేమిటో అర్ధం అయింది.

ఎన్ పీ ఆర్ కు వ్యతిరేకంగా ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్ణయం తీసుకున్నారు. అదే బాటలో జగన్ నడుస్తుండటంతో రాజకీయ పరమైన నిర్ణయాలు మరింత కఠినంగా లేకపోతే తమ ఆంధ్రప్రదేశ్ పార్టీ విభాగం మరింత కష్టాల్లో కూరుకుపోతుందని కేంద్రం గ్రహించింది.

సింహాచలం దేవస్థానం ట్రస్టు బోర్డు చైర్మన్ గా బిజెపి అధికార ప్రతినిధి అయిన సంచయితా రాజును ఎవరిని అడగకుండా నియమించేయడం కూడా బిజెపి అధిష్టానవర్గానికి వాస్తవం తెలిసి వచ్చేలా చేసింది. బిజెపి జాతీయ కమిటీతో అన్ని విషయాలూ చర్చించిన తర్వాత రాష్ట్ర బిజెపి సంచియిత విషయంలో తీవ్రంగా స్పందించింది కూడా ఇందుకే. ఇప్పటి వరకూ వైసిపి నిర్ణయాలకు వంతపాడుతున్న బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కు ఈ విషయాలపై బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా వివరణ కోరినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

ఇప్పటి వరకూ వైసిపిని జీవీఎల్ వెనకేసుకువచ్చారు. రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని ఆయన చెప్పినట్లే పార్లమెంటులో సమాధానం వచ్చింది. మరో వైపు ప్రధాని నరేంద్రమోడీకి అన్ని విషయాలూ చెప్పిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటున్నామని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బృందం పబ్లిక్ గా చెబుతున్నది.

దాంతో ఏపి ప్రజల మనోభావాలు బిజెపి పట్ల తీవ్ర వ్యతిరేకతతో నిండిపోతున్నాయి. జనసేనతో కలిసి పని చేస్తే బలపడాల్సిన బిజెపి ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకూ బలహీనం అవుతున్నది. జనసేన పార్టీ కూడా బిజెపితో కలవడం వల్ల తన బలాన్ని కోల్పోతున్నట్లు కనిపిస్తున్నది. ఈ పరిస్థితుల దృష్ట్యా వై ఎస్ జగన్ తో రాజకీయంగా పోరాడాల్సిన అవసరాన్ని బిజెపి నాయకులు గుర్తిస్తున్నారు. ఇప్పటి వరకూ జీవిఎల్ చెప్పినట్లు విన్న బిజెపి కేంద్ర కమిటీ ఇప్పుడు జగన్ తీసుకున్న ఈ రెండు నిర్ణయాలతో పునరాలోచనలో పడిపోయింది.

Related posts

ఓ పాలకులారా… ఈ గ్రామాన్ని చూసి సిగ్గుపడండి

Satyam NEWS

వి.ఎస్.యు లో ముగిసిన సుసంపన్న వృత్తి నైపుణ్య శిక్షణ తరగతులు

Satyam NEWS

కమిషన్ల కోసం కక్కుర్తి పడి ఏడుసార్లు విద్యుత్ ఛార్జిల పెంపు

Satyam NEWS

Leave a Comment