40.2 C
Hyderabad
April 29, 2024 17: 24 PM
Slider ప్రత్యేకం

రాష్ట్రపతికి లేఖ: మానసిక స్థితి సరిగా లేని వ్యక్తిలా ప్రవర్తిస్తున్న జగన్

#chandrababu

2019 లో వైఎస్ జగన్ సిఎం అయిన తరవాత రాష్ట్రంలో జరుగుతున్న హింస, నిరంకుశ పాలన, అరాచకాలు, మానవ హక్కుల ఉల్లంఘనలు, రాజ్యాంగ సంస్థలు, వ్యవస్థల విధ్వంసం, న్యాయ వ్యవస్థ, కేంద్ర సంస్థలపై జరుగుతున్న దాడులని వివరిస్తూ రాష్ట్రప్రతి ద్రౌపదిముర్ము, ప్రధాని నరేంద్ర మోదీలకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ప్రతిపక్షాలపై అక్రమ కేసులు, ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ తీసుకుంటున్న నిర్ణయాలు, అధికార దుర్వినియోగం వంటి అంశాలను 9 పేజీల లేఖలో వివరించారు.

మతిస్థిమితం లేని వ్యక్తిగా సిఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రాన్ని అధోగతి పాలుచేశాయని తీవ్రంగా విమర్శించారు. 9 పేజీల లేఖతో పాటు ఆయా ఘటనలకు సంబంధించిన వివరాలతో 75 పేజీల డాక్యుమెంట్ ను, వీడియోలను కూడా చంద్రబాబు నాయుడు జతచేశారు.

తాజాగా చిత్తూరు జిల్లాలో తనపైనే హత్యాయత్నం చేసి తిరిగి తనపైనే హత్యాయత్నం కేసు పెట్టడాన్ని లేఖలో సవివరంగా తెలిపారు. 2019 ఆగస్టు నుంచి మొన్నటి అంగల్లు ఘటన వరకు తనపై జరిగిన దాడులు, నిబంధనలకు విరుద్దంగా ప్రభుత్వం అనుసరించిన విధానాలను వివరించారు. ప్రణాళిక ప్రకారం, ప్రభుత్వం ప్రోత్సాహంతో తనపై జరుగుతున్న దాడుల విషయంలో సిబిఐ విచారణ జరిపించాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న విపరీత పరిస్థితుల కారణంగా తనకున్న విశేషాధికారాలతో రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని లేఖలో కోరారు.

ప్రజావేదిక కూల్చివేత, రాజధాని విధ్వంసం, న్యాయ మూర్తులు, కోర్టులపై సోషల్ మీడియా ద్వారా దాడులు, ఎస్ఇసి, ఎపిపిఎస్సి చైర్మన్ లపై వేధింపులు, దేవాలయాలపై దాడులు, శాంతి భద్రతలు, గంజాయి అమ్మకాలు, దొంగ ఓట్ల రాజకీయాలు, మహిళలు, దళిత గిరిజన మైనారిటీ బలహీన వర్గాలపై దాడులు, అక్రమ కేసులు, మీడియాపై దాడులు వంటి పలు అంశాలను లేఖలో ప్రస్తావించారు.

లేఖలో అంశాలు…

5 కోట్ల మంది తెలుగు ప్రజలు 2019 నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అప్రజాస్వామిక, రాజ్యంగ వ్యతిరేక పాలనలో ఎదుర్కొంటున్న సమస్యలను వివరించేందుకు ప్రతిపక్ష నేతగా నేను ఈ లేఖ రాస్తున్నాను. ప్రజాస్వామ్య ప్రయోజనాల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యున్నత స్థాయి మాల్-గవర్నెన్స్‌పై మీ దృష్టిని తేలవాలని ఈ లేఖ రాస్తున్నాను.

ప్రజా ఆస్తి అయిన ‘ప్రజా వేదిక’ని కూల్చివేసి తన అసంబద్ధమైన మనస్తత్వాన్ని తెలియజేశాడు.భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన రాజధాని అమరావతిని వినాశకర నిర్ణయాలతో నాశనం చేశాడు.జగన్ నిర్ణయాల కారణంగా రాష్ట్రం ఏర్పడి దశాబ్దం రావస్తున్నా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు వారి సొంత రాజధాని నగరం లేదు. మూడు రాజధానులు అనే వాదంతో….తన పంతం కోసం ముఖ్యమంత్రి శాసన మండలి రద్దుకు ఉపక్రమించే స్థాయికి వెళ్లారు.

రాజధాని నగరానికి సంబంధించి సుప్రీంకోర్టు, హైకోర్టుల తీర్పులను గౌరవించే బదులు వివిధ మార్గాల ద్వారా తీర్పులను తప్పించుకుంటున్నాడు. ప్రజల ప్రయోజనాలకు విరుద్దంగా రాజధాని విషయంలో కోర్టు వాజ్యాల కోసం కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని జగన్ ఖర్చు చేస్తున్నారు. న్యాయవ్యవస్థను, న్యాయమూర్తులను భయపెట్టడానికి తన పార్టీ క్యాడర్‌ ద్వారా వారిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారానికి దిగారు. దీంతో స్వయంగా న్యాయవ్యవస్థ దీనిపై సుమోటోగా విచారణ చేపట్టి సీబీఐని విచారణకు ఆదేశించింది.

ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కడం…

ప్రస్తుత YSRCP నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్‌పర్సన్‌ను, రాష్ట్రానికి డిప్యూటేషన్‌లో కొనసాగుతున్న అనేక మంది కేంద్ర అధికారులను తీవ్రంగా వేటాడింది. దీంతో కోర్టులు పలు సందర్భాల్లో బాధిత అధికారలుకు అండగా నిలిచాయి.

అప్పటి రాష్ట్ర ఎన్నికల కమీషనర్ (SEC) తన భద్రత కోసం భారత ప్రభుత్వాన్ని సంప్రదించవలసిన పరిస్థితి నాడు కలిగింది. ఎన్నికల ప్రక్రియలను అణగదొక్కేందుకు జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు నియంతల నిర్ణయాలను దాటిపోయాయి.

ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడానికి నిరక్షరాస్యులను సైతం పట్టభద్రులుగా నమోదు చేసుకున్న తీరు ప్రజాస్వామ్యాన్ని ముఖ్యమంత్రి ఏ స్థాయిలో వక్రీకరిస్తారనడానికి ఉదాహరణ.

ఓటర్ల నమోదులో నిమగ్నమైన ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేస్తూ ఎన్నికల ప్రక్రియను తారుమారు చేస్తూనే ఉన్నాడు. ఈ తప్పుడు పనులు చేయడానికి ‘వాలంటీర్లను’ సైతం వాడుకున్నారు.

గ్రామం/వార్డు వాలంటీర్ల ద్వారా పౌరుల హక్కులు, గోప్యతకు భంగం కలిగించే విధంగా రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి వ్యక్తిగత డేటాను సేకరించారు.

ఎన్నికల సమయంలో బెదిరింపులు, బ్లాక్‌మెయిల్ కోసం, తన పార్టీకి ఓటు వేయమని బలవంతం చేయడం కోసం వ్యక్తిగత డేటాను ఉపయోగించుకునే అవకాశం ఉంది.

ప్రార్థనా స్థలాలపై దాడులు…

హిందువులకు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిపై ఎనలేని విశ్వాసం. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) బోర్డు చైర్మన్ గా హిందూయేతర మతాన్ని విశ్వసించే వారిని సిఎం జగన్ పలుమార్లు నియమించారు. హిందూయేతరులు తిరుమల ఆలయాన్ని సందర్శించినప్పుడు వేంకటేశ్వర స్వామిపై తమకున్న విశ్వాసాన్ని తప్పనిసరిగా తెలియజేయాలి అనే నిబంధనను కూడా సిఎం పక్కన పెట్టాడు.

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరవాత రాష్ట్రంలో 250 కుపైగా దేవాలయాల పై దాడులు జరిగాయి

రాష్ట్రంలో వక్ఫ్ బోర్డుకు చెందిన ఆస్తులు,చర్చి ఆస్తులు అన్యాక్రాంతం సర్వసాధారణం అయ్యింది.

ప్రాథమిక హక్కులు లేకపోవడం…

జగన్ పాలనలో వ్యక్తుల జీవితాలు, ఆస్తులు సురక్షితంగా లేవు. అధికార పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యుని భార్య, కొడుకు  కిడ్నాప్ జరిగిన రెండు రోజుల తర్వాత కూడా ఘటన వెలుగులోకి రాలేదు.

బాపట్ల జిల్లాలో 14 ఏళ్ల పాఠశాల బాలుడు యు.అమర్‌నాథ్ తన సోదరిని గూండాలు లైంగికంగా వేధించడాన్ని ప్రశ్నించినందుకు సంఘ వ్యతిరేక వ్యక్తులు పట్టపగలు ఆ విద్యార్థిని సజీవ దహనం చేశారు.

వైసీపీ శాసన మండలి సభ్యుడు అనంత్ బాబు తన కారు డ్రైవర్‌ను హత్య చేసి, డ్రైవర్ మృతదేహాన్ని మృతుని ఇంటి గుమ్మం వద్ద పడేసి వెళ్లాడు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘లా అండ్ ఆర్డర్’ అనేది ఎక్కడా కనిపించడం లేదు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, మైనారిటీ వర్గాల వారు రాష్ట్ర ప్రభుత్వ క్రూరత్వానికి బలి అవుతున్నారు.

అసమ్మతి స్వరాలపై దాడి…

నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో సీనియర్ ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ సుధాకర్‌ను వేటాడి, చిత్రహింసలు పెట్టి, వేధింపులకు గురిచేయడం చివరకు అతని మరణానికి దారితీసింది. కోవిడ్ మహమ్మారి సమయంలో డాక్టర్ సుధాకర్ రక్షణ సామగ్రి (PPE) కిట్‌లను అడగడమే నేరం అయ్యింది. పోలీసులు సుధాకర్ ను అరెస్టు చేయడమే కాకుండా బలవంతంగా రోగి అంటూ మానసిక ఆసుపత్రిలో చేర్చారు. వేధింపులు, చిత్రహింసలు చివరకు డాక్టర్ సుధాకర్ అకాల మరణానికి దారితీశాయి.

జగన్ ను వ్యతిరేకించే వారు అతని హింసాత్మక పరంపరకు బాధితులుగా మారుతున్నారు. తన సొంత పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యుడు రఘు రామ కృష్ణంరాజును పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారు. ఎంపిపై ఆ అమానవీయమైన హింసను వీడియో కాల్ ద్వారా సిఎం ప్రత్యక్షంగా చూశాడు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కె. అచ్చెన్నాయుడు శస్త్రచికిత్స చేయించుకుని కోలుకోక ముందే అక్రమ అరెస్టుతో, పోలీసు వాహనంలో వందల కిలోమీరట్లు తరలించారు. అంతకు కొద్దిరోజుల ముందే శస్త్ర చికిత్స జరిగి ఉండడం వల్ల ఆ దారుణమైన ప్రయాణం కారణంగా విపరీతమైన రక్తస్రావం జరిగింది.

చిత్ర సీమలోని నటులపైనా జగన్ ప్రోత్సాహంతో దాడి జరిగింది. చిత్ర సీమ ఎదుర్కొంటున్న సమస్యలను గురించి ప్రస్తావించిన పద్మభూషన్ చిరంజీవి, హైదరాబాద్ అభివృద్ది కి చంద్రబాబు నాయుడు కారణం అని చెప్పిన రజనీ కాంత్ పై వైసీపీ దారుణమైన మాటల దాడిచేసింది. వారి క్యారెక్టర్ పై సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేశారు.

తమను ప్రశ్నించిన వారిపై సామాజిక మాధ్యమాల ద్వారా, ప్రభుత్వ యంత్రాంగం ద్వారా  ప్రభుత్వం తీవ్రమైన వేధింపులకు పాల్పడుతుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా గొంతు పెంచితే, YSRCP సైబర్ గూండాలు అత్యంత దారుణంగా దుర్భాషలాడుతూ సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తారు.

2020లో LG పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనపై ప్రభుత్వ ప్రతిస్పందన గురించి సోషల్ మీడియాలో ప్రశ్నలు అడిగిన 60 ఏళ్ల రంగనాయకి పై IPC, IT చట్టంలోని వివిధ సెక్షన్ల కింద అభియోగాలు మోపి అరెస్టు చేశారు.

ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్‌కు, నేరస్థులకు కేంద్రం…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేడు మాదకద్రవ్యాల అతిపెద్ద కేంద్రంగా అవతరించింది. మాదకద్రవ్యాల వ్యాపారం రాష్ట్రంలో నేరాలను పెంచుతోంది. రాష్ట్రంలో గంజాయి గ్యాంగ్‌లు, బ్లేడ్ గ్యాంగ్‌లు అభివృద్ధి చెందుతున్నాయి.

టీడీపీ ఈ అంశాన్ని ఎత్తిచూపడంతో… పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ) కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న మంగళగిరిలోని తెలుగు దేశం పార్టీ (టీడీపీ) కేంద్ర కార్యాలయంపై వైసీపీ గూండాలు దాడి చేశారు. కార్యాలయం ధ్వంసం చేశారు. అయినా చర్యలు తీసుకోలేదు

డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్‌ఐ) విడుదల చేసిన ‘స్మగ్లింగ్ ఇన్ ఇండియా’ 2021-22 నివేదికలో డ్రగ్స్‌కు సంబంధించి భారతదేశంలో అగ్రగామి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని స్పష్టంగా పేర్కొంది. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 18,267 కేజీల మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయని తేల్చి చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వ అమర్ రాజా, లులు గ్రూప్, KIA మోటార్స్ వంటి వ్యాపార సంస్థలను వేధించింది.

ఒక నేరస్థుని పాలనా పద్ధతి…

మాజీ ఎంపీ, మాజీ మంత్రి వై ఎస్ వివేకానంద రెడ్డి 2019 మార్చిలో పులివెందులలోని తన ఇంట్లో దారుణ హత్యకు గురయ్యారు. జగన్ కుటుంబ యాజమాన్యంలోని మీడియా సాక్షి టీవీ ఆ హత్యను గుండెపోటుగా కప్పిపుచ్చడానికి ప్రయత్నించారు. తరువాత రాజకీయ ప్రత్యర్థులపై హత్యను నెట్టివేయడానికి ప్రయత్నించారు. జగన్ మోహన్ రెడ్డి కుటుంబంలో హత్యకు లింక్ ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. ఈ కేసులో జగన్ బంధువు, ఎంపీఅవినాష్ రెడ్డి, అతని తండ్రి  భాస్కర్ రెడ్డిని సీబీఐ నిందితులుగా నిర్ధారించింది.

15-03-2019 తెల్లవారుజామున ఎవరికి తెలియక ముందే వైయస్ వివేకానంద రెడ్డి మరణం గురించి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి సమాచారం అందించినట్లు తదుపరి దర్యాప్తులో వెల్లడైంది. వై ఎస్ వివేకానంద రెడ్డి మరణవార్త గురించి ఎం వి కృష్ణారెడ్డి ఉదయం 06:15 గంటల సమయంలో సమాచారం ఇవ్వకముందే…. వివేకానంద రెడ్డి మరణాన్ని వైయస్ జగన్ మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డి తెలియజేశారు. ఈ కారణంగా హత్యలో జగన్ పాత్రను దర్యాప్తు చేయవలసి ఉంది.

ఈ కేసు విషయంలో దర్యాప్తు చేపడుతున్న సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం అనేక ఆటంకాలు కల్పించింది. విచారణకు అడ్డుతుగులున్న వైఎస్సార్సీపీ మద్దతుదారుల గుంపుపై కర్నూల్ లో  నాడు చర్య తీసుకోవద్దని జగన్ రాష్ట్ర పోలీసు బలగాలను ఆదేశించారు. దీంతో ఆసుపత్రిలో దాక్కున్న అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకుండా సిబిఐని వైఎస్సార్సీపీ గుంపు అడ్డుకుంది. కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ తన బాధ్యతను నిర్వర్తించకుండా అడ్డుకున్నారు.

పులివెందుల పట్టణంలోని సిబిఐ విచారణ అధికారులపై వైఎస్‌ఆర్‌సిపి అనుచరులు తప్పుడు కేసులు పెట్టారు. వారిని పట్టణం విడిచి వెళ్లమని బెదిరించారు.

విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్‌ మోహన్‌రెడ్డిపై చిన్న కత్తితో దాడి లో ఎలాంటి కుట్ర లేదని ఎన్‌ఐఏ తేల్చింది.

ప్రతిపక్ష నేతపై దాడులు..

ప్రతిపక్ష నాయకుడైన నాపై పలుమార్లు భౌతిక దాడి, నేరపూరిత కుట్ర జరిగింది. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే, నా భద్రతను భారీగా తగ్గించారు. చివరకు హైకోర్టు సూచనలతో కొంత భద్రత  కొనసాగించారు. DSP ర్యాంక్‌లోని ఇద్దరు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్లు (CSOలు) నా భద్రతకు ఉండవలసి ఉంది. అయితే ప్రభుత్వం ఒక్క డిఎస్పి స్థాయి వారినే భద్రతకు కేటాయించింది.

గుంటూరు జిల్లా ఉండవల్లిలోని నా నివాసంపై 2019 ఆగస్టులో డ్రోన్‌లు ఎగరవేశారు. డ్రోన్‌లను ఎగురవేసిన వ్యక్తులను భద్రతాధికారులు పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు, కానీ నేటికీ ఎలాంటి చర్యలు లేవు. 2021 సెప్టెంబర్ లో వైసీపీ ఎమ్మెల్యే , ప్రస్తుత మంత్రి  జోగి రమేష్ తన అనుచరులతో కలిసి కర్రలు, రాళ్లు, ఇనుప రాడ్‌లతో నన్ను చంపుతామని బెదిరిస్తూ నా నివాసంపై దాడి చేశారు. గుంపుతో నా ఇంటిపైకి దాడికి వచ్చినా ఇప్పటికీ చర్యలు లేవు. జోగి రమేష్‌పై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా అతనికి మంత్రి పదవిని బహుమతిగా ఇచ్చారు.

నేను రాష్ట్రం లో పర్యటనకు వెళ్లిన ప్రతిసారీ, ప్రజల్లోనూ నాపై దాడి చేశారు. పోలీసుల పర్యవేక్షణలోనే YSRCP గుంపు నాపై రాళ్లు రువ్వుతుంది. మా పార్టీ సమావేశాలకు హాజరయ్యే వ్యక్తులపై కర్రలు, రాడ్లతో దాడి చేస్తుంది.

తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గానికి ఉప ఎన్నికల సందర్భంగా ప్రచారంలో నాపై రాళ్లు రువ్వారు. ఫిబ్రవరి 2023లో, అనపర్తిలో టూర్ షెడ్యూల్‌ను చాలా ముందుగానే ఇచ్చినప్పటికీ ఆంక్షల పేరుతో పోలీసులు నన్ను చీకట్లో 7 కిలోమీటర్లు నడిచి వెళ్లేలా చేశారు.

గతంలో నందిగామ, యర్రగొండపాలెంలో కూడా నాపై ఇలాంటి దాడులు జరిగాయి. జగన్ మోహన్ రెడ్డి పాలనలో సామాన్య ప్రజలతో పాటు నా పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరంతరం దాడులకు గురవుతున్నారు. నందిగామ దాడి సమయంలో నా CSO గాయపడ్డారు, యర్రగొండపాలెం వద్ద జరిగిన దాడిలో నాకు భద్రత కల్పిస్తున్న NSG టీమ్ కమాండర్ గాయపడ్డారు.

జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని నీటిపారుదల ప్రాజెక్టులను నిలిపివేసి, నిర్లక్ష్యం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై స్థితిగతులను ప్రజలకు వివరించడానికి 10 రోజులపాటు రాష్ట్రంలో 2500 KM నేను పర్యటించాను.

పోలవరం ప్రాజెక్టు కోసం నేను చేసిన కృషి ని జగన్ నాశనం చేశారు.ప్రాజెక్టు సందర్శించినప్పుడు ప్రాజెక్ట్ సైట్ రాజధాని అమరావతిలోని నేటి శిథిలాల మాదిరిగానే కనిపించింది.

ప్రాజెక్ట్ లో ఈ పరిస్థితికి సిఎం జగన్ మానసిక స్థితి సరిగా లేకపోవడమే కారణం అనిపిస్తుంది. రాయలసీమ ప్రాంతంలోని ప్రభుత్వ ప్రాజెక్టుల కాంట్రాక్టులలో ఎక్కువ భాగం మంత్రి, కాంట్రాక్టర్ పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి అక్రమ మార్గాల ద్వారా దక్కించుకున్నారు. గాలేరు-నగరి సుజల స్రవంతి (GNSS) పేరుతో పూర్తిగా అనవసరమైన ప్రాజెక్ట్‌ను రూపొందించి మంత్రికి పనులు అప్పగించారు.

ఆవులపల్లి ప్రాజెక్ట్‌లో హరిత నిబంధనలు ఉల్లంఘించినందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ.100 కోట్ల జరిమానా విధించింది, అందులో ప్రభుత్వం రూ.25 కోట్లను ప్రభుత్వ ఖజానా నుండి చెల్లించింది. ఈ ప్రాజెక్టులలో మంత్రి దాదాపు రూ.8వేల కోట్ల అక్రమాలకు పాల్పడ్డారు.

జగన్ మోహన్ రెడ్డి, అతని గూండాలు, మంత్రులు చేస్తున్న నేరాలలో పోలీసులను భాగస్వాములుగా మారుస్తున్నారు. ప్రతిపక్ష నేతతో సహా ప్రతి పౌరునికి రక్షణ కల్పించడం ప్రభుత్వ కర్తవ్యం. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్‌కు ముఖ్యమంత్రిపై బాధ్యత ఉంది. నాకు రక్షణ కల్పించడానికి బదులుగా, అతను నాపై హత్యా దాడికి పాల్పడ్డాడు. పైగా నాపైనే హత్యాయత్నం ఆరోపణపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

నా భద్రతను పునరుద్ధరించిన హైకోర్టు పట్ల కూడా జగన్  తన పూర్తి ధిక్కారాన్ని ప్రదర్శించారని తాజాగా అతను చేసిన వ్యాఖ్యల ద్వారా అర్థం అవుతుంది. 10.08.2023న ఒక బహిరంగ కార్యక్రమంలో సిఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి  మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఉద్దేశ్యపూర్వకంగానే నా భద్రత తగ్గించినట్లు అర్థం అవుతున్నాయి. తన వ్యాఖ్యల ద్వారా తన ఉద్దేశ్యాన్ని జగన్ ప్రకటించారు.

ఈ అసాధారణ పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం, శ్రేయస్సు కోసం మీ అత్యున్నత అధికారాన్ని ఉపయోగించమని కోరుతున్నాను. నాపై పదే పదే జరుగుతున్న ప్రాణాంతక దాడులు, అటువంటి దాడుల వెనుక నేరపూరిత కుట్రను వెలికితీయడానికి సీబీఐ చేత విచారణకు ఆదేశించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

అంగల్లు, పుంగనూరు బైపాస్ వద్ద ఇటీవల నాపై జరిగిన దాడుల నేపథ్యంలో నాకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాపాడేందుకు మీరు చొరవ చూపాలని కోరుతున్నాను. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ గూండాల నిరంతర దాడి కి ప్రజాస్వామ్యం గురవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అశాంతి నుండి రక్షించడానికి తగు ఆదేశాలు జారీచేయాలని ఈ లేఖ ద్వారా కోరుతున్నాను.

Related posts

చార్ ధామ్ యాత్ర: తెరుచుకున్న కేదార్ నాధ్ ఆలయం

Satyam NEWS

రెండో మ్యాచ్‌లోనూ ఉతికారేసిన ఇండియా

Sub Editor

సాగుచట్టాల వ్యతిరేక ఉద్యమకారులకు కేసీఆర్ సాయం

Satyam NEWS

Leave a Comment