రాష్ట్రంలో ఎక్కడా కరోనా వైరస్ లేదని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు చంద్రబాబు వైరస్ సోకిందని మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. మచిలీపట్నం లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ దారుణ వ్యాఖ్య చేశారు. ఎన్నికల సంఘానికి వైరస్ సోకడం వల్లే ఐదు రోజుల్లో పూర్తి కాబోతున్న ఎన్నికలను కావాలని ఆరు వారాల పాటు వాయిదా వేశారని అన్నారు.
ఎన్నికల కమిషన్ కి చంద్రబాబు వైరస్ సోకినట్టుందని అందుకే ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి ఆరోపించారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పూర్తిగా చంద్రబాబు మనిషి అని, ఆయన బంధువని సీఎం జగన్ మోహన్ రెడ్డి కి చెప్పామని, కానీ ఐ ఏ ఎస్ అధికారులు అలా ఉండరని కొట్టి పారేశారని మంత్రి అన్నారు.
రాష్ట్రాన్ని అస్థిరపరచాలని జరుగుతున్న కుట్రలో భాగంగా ఇది జరిగిందని మంత్రి అన్నారు. నెలాఖరులో ఎన్నికల ప్రక్రియ పూర్తి అయి ఉంటే బడ్జెట్ సమావేశాలు సకాలంలో జరిగేవి. కేంద్రం నుంచి వచ్చే 4 వేల కోట్ల రూపాయలు వచ్చేవి. రాష్ట్రంలో ఏదో జరిగి పోతుందని కావాలని హడావుడి చేస్తున్నారని మంత్రి అన్నారు.
ఏకగ్రీవాలు అనేవి ప్రతి సారి జరుగుతాయి. చంద్రబాబు హయాంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలు జరగలేదా? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ఒకే ఒక్క కరోనా కేసు నమోదైతే దాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నికలు వాయిదా వేయడం అన్యాయం, కుట్ర పూరితం అని మంత్రి అన్నారు.