40.2 C
Hyderabad
April 29, 2024 18: 08 PM
Slider కడప

మోడీ ,కార్పొరేట్ల కబంధ హస్తాల నుండి దేశాన్ని రక్షించుకోవాలి

#CPIKadapa

ఆనాటి త్యాగధనుల పోరాట ఫలితంగా సాధించుకున్న స్వాతంత్ర్యాన్ని నేడు మోడీ సారథ్యంలో బిజెపి, ఆర్ ఎస్ ఎస్ ప్రభుత్వం స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు తాకట్టు పెడుతోందని, భగత్ సింగ్  స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తితో దేశాన్ని రక్షించుకోవడానికి ప్రజలందరూ సన్నద్ధం కావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జి.ఈశ్వరయ్య పేర్కొన్నారు.

మంగళవారం కడప పట్టణంలో సిపిఐ నగర సమితి నేతృత్వంలో ఎర్రముక్కపల్లి సర్కిల్ లో భగత్ సింగ్, రాజ గురు, సుఖ్ దేవ్ ల 90 వ వర్ధంతి కార్యక్రమం చేపట్టారు. భగత్ సింగ్ చిత్రపటానికి సిపిఐ జిల్లా కార్యదర్శి జి. ఈశ్వరయ్య, తదితర నాయకులు పూలమాలవేసి  నివాళలర్పించారు. ఇంక్విలాబ్ జిందాబాద్, భగత్ సింగ్ అమర్ హై మోడీ, కార్పొరేట్ల బారినుండి దేశాన్ని రక్షించండి , అప్ అప్ సోషలిజం డౌన్ డౌన్, క్యాపిటలిజం సేవ్ డెమోక్రసీ- సేవ్ ఇండియా అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

భగత్ సింగ్ ఉద్యమస్ఫూర్తితో నవతరం

ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ నేటి దేశ వ్యాప్త రైతాంగ ఉద్యమం, విశాఖ, కడప ఉక్కు  పోరాటపథంలో నడిపించడానికి  భగత్ సింగ్ ఉద్యమస్ఫూర్తితో నవతరం  ముందుకు వెళ్లాలని,విప్లవ వీర కిశోరాలు  సర్దార్ భగత్ సింగ్ ,రాజ్ గురు, సుఖ్ దేవ్ లు దేశ స్వాతంత్రం, సోషలిజం లక్ష్యం కోసం నూనూగు మీసాల వయసులోనే చేసిన పోరాటం ఎప్పటికీ మరవ లేనిదన్నారు.

పెళ్లి, పెళ్లి కూతురు వద్దు దేశమే ముద్దంటూ  స్వాతంత్ర పోరాటానికి అంకితమై ఉరికొయ్య ను ముద్దాడిన భగత్ సింగ్ త్యాగాలు వృధా కానీయబోమన్నారు. బ్రిటిష్ పార్లమెంట్ లో  పొగబాంబులు వేసి  తప్పించుకునే అవకాశం ఉన్నా కూడా  తన వాదనను దేశమంతా వినిపించడానికి  భగత్ సింగ్, ఆయన సహచరులు పట్టు పడ్డారని, క్షమాభిక్షకు అవకాశమున్నా, దేశం కోసం ప్రాణాలర్పిస్తామని శపథం చేసి ఉరికొయ్యలను ముద్దాడిన వీరకిశోరుల  పోరాట స్ఫూర్తిని నేటితరం ముందుకు తీసుకెళ్లాలన్నారు.

భగత్ సింగ్ కలగన్న  స్వాతంత్రం ఫలాలు ఇప్పటికీ ప్రజలకు అందలేదన్నారు.నేడు పరిపాలిస్తున్న  పాలకులు మతాలు, కులాలు పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే లబ్ధి పొందాలని చూస్తున్నారని వారందరికీ తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయని వారు పేర్కొన్నారు. సంక్షోభంలో ఉన్న కార్పొరేట్ వ్యవస్థ లాభాల కోసం వ్యవసాయంపై కన్నేసిందని, స్వేచ్ఛ పేరుతో రైతులను మభ్యపెట్టి భూములు లాక్కొoటున్నారని, సకాలంలో మేలుకొన్న రైతాంగం జూలు విదిల్చి కదన రంగంలోకి దిగారని, తమ తక్షణ సమస్యల పై కాకుండా, దీర్ఘకాలిక ప్రభావం చూపే విధానాలపై పోరాడటం స్వాతంత్ర్యనంతరం ఇదే మొదటిసారని వారు వివరించారు.

రైతాంగ పోరాటానికి నాటి స్వాతంత్ర్య పోరాటమే స్ఫూర్తి

ఈ రైతాంగ పోరాటానికి నాటి స్వాతంత్ర్య పోరాటమే స్ఫూర్తి అన్నారు. మోడీ-షా పుణ్యమా అంటూ ఒంటరిగా ఉన్న రైతులకు కార్మిక లోకం తోడయిందని, కార్మిక కర్షక ఐక్యతకు పాలకుల మొండివైఖరే తోడ్పడిందని, తన గోతిని తానే బిజెపి త్రవ్వుకుంటున్నదని వారు పేర్కొన్నారు. స్వాతంత్రానంతరం సాధించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను, సహజ సంపదను కార్పొరేట్ లకు అప్పజెప్పే మోడీ నయవంచక విధానాలను ఎండగట్టేందుకు, రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు రద్దు అయ్యేందుకు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆలోచన విరమించేందుకు కడప ఉక్కు ఫ్యాక్టరీ ప్రభుత్వ రంగంలో నిర్మించేందుకు, కార్మిక వ్యతిరేక చట్టాలు రద్దు అయ్యేందుకు,నిత్యావసర వస్తువుల ధరలు ప్రజలకు అందుబాటులో ఉండేoదుకు ఈనెల 26వ తేదీన జరిగే భారత్ బంద్  లో అన్ని వర్గాల ప్రజానీకం స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.

సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు ‘షాహిద్ దివస్’ పేరుతో ప్రజా చైతన్య, మోడీ కార్పొరేట్ వ్యతిరేక ఈ కార్యక్రమాల నిర్వహణకు శ్రీకారం చుట్టినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లోక్ సత్తా నాయకులు దేవర శ్రీకృష్ణ, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పి కృష్ణమూర్తి, ఎల్ నాగ సుబ్బారెడ్డి, సి సుబ్రహ్మణ్యం, నగర కార్యదర్శి యన్. వెంకట శివ, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు జి వేణుగోపాల్, నాయకులు సావంత్ సుధాకర్, నాగరాజు, బ్రహ్మం, ఆర్ బాబు, జయరామయ్య, దస్తగిరి, కె. మునయ్య, పగడపూల మల్లికార్జున, పి బాలు, గుజ్జుల ఓబులేసు, వడ్ల భాగ్యలక్ష్మి,బి. ఝాన్సీ, వేదాంతం, నారాయణ, రామ్మోహన్ రెడ్డి, ఓబులయ్య, పవన్, మాలకొండయ్య, వెంకటేష్, సంజీవ్, ఎల్లారెడ్డి,అక్షయ తదితరులు పాల్గొన్నారు.

Related posts

పొలిటికల్ కార్నర్: కార్ల పై ఉన్న సోకు ప్రాంతంపై లేదు

Satyam NEWS

కేసిఆర్ గొప్ప నాయకుడు

Sub Editor

దేశం కోరింది-బిజెపి ఇచ్చింది-ఏమిటి? ఎందుకు??

Satyam NEWS

Leave a Comment