ఆలయ భూముల ఆక్రమణదారులను ఉపేక్షించేది లేదని, కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ మంత్రి ఎన్.ఇంద్రకరణ్ రెడ్డి అధికారులకు ఆదేశాలిచ్చారు. శుక్రవారం హైదరాబాద్ బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, అదనపు కమిషనర్ శ్రీనివాస రావు, జాయింట్ కమిషనర్ కృష్ణవేణి, డిప్యూటీ కమిషనర్లు పాల్గొన్నారు.
సమావేశంలో ఆలయ భూముల రక్షణకు తీసుకుంటున్న చర్యలను అధికారులు మంత్రికి వివరించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో స్పెషల్ డ్రైవ్ ద్వారా 2676 ఎకరాల ఆలయ భూములను గుర్తించి, 181 ఆలయ భూములకు రక్షణ సరిహద్దు బోర్డులు ఏర్పాటు చేశామని తెలిపారు. హైదరాబాద్ జిల్లాలోని నిరుపయోగంగా ఉన్న ఆలయ భూముల్లో రూ.5 కోట్లతో వాణిజ్య సమూదాయాలను నిర్మించే ప్రతిపాదనలకు మంత్రి ఆమోదం తెలిపారు.
సమావేశంలో మంత్రి మాట్లాడుతూ దేవాదాయ శాఖ భూములు పరాధీనం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో దేవాదాయ శాఖ చేపట్టిన స్పెషల్ డ్రైవ్ సత్ఫాలితాల్ని ఇచ్చిందని, దీన్ని మరింత విస్తృతం చేయాలని అధికారులకు సూచించారు. ఆలయ భూముల రక్షణకు సంబంధించి దేవాదాయశాఖ అధికారులు సరిహద్దు బోర్డులను ఏర్పాటు చేయాలని, అవసరమైతే పోలీసు,రెవెన్యూ అధికారుల సహాకారం తీసుకోవాలని సూచించారు.
దేవుడి భూముల లెక్కలు పక్కాగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిరుపయోగంగా ఉన్నఆలయ భూములను గుర్తించి, వాటి ద్వారా ఆదాయం పొందే మార్గాలపై దృష్టి పెట్టాలని దిశానిర్ధేశం చేశారు. దేవాదాయ శాఖ భూముల వేలం ప్రక్రియలలో పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. లీజు గడువు ముగిసిన వెంటనే ప్రస్తుత మార్కెట్ రేట్ ప్రకారం లీజ్ ను పొడిగించడం కానీ, తిరిగి వేలం ద్వారా లీజ్ లు ఇవ్వాలని తెలిపారు. దేవుని మాన్యం భూములను ఆక్రమించి, గృహ, వాణిజ్య భవనాలు నిర్మిస్తే వాటిని ప్రొహిబిటేడ్ లిస్ట్ లో చేర్చి కరెంట్, తాగునీరు కనెక్షన్ ఇవ్వకుండా సంబంధిత శాఖలను కోరాలని అధికారులకు మంత్రి సూచించారు.
ఆలయ భూముల రక్షణ విషయంలో దేవాదాయ శాఖ అధికారులు అలసత్వం వీడాలని మంత్రి స్పష్టం చేశారు. దేవుని మాన్యం వ్యవహరంలో కొంతమంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహారించడంపై మంత్రి ఆగ్రహాం వ్యక్తం చేశారు. పెండింగ్ కేసుల్లో త్వరితగతిన కౌంటర్ దాఖలు చేయాలన్నారు.
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై శాఖ పరైన చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ కమిషనర్ ను ఆదేశించారు. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన దేవాదాయ శాఖ అధికారులకు ప్రోత్సహాకాలు ఇవ్వాలని సూచించారు.