38.2 C
Hyderabad
May 1, 2024 20: 55 PM
Slider సంపాదకీయం

క్రాస్ ఓటింగ్ భయంతో రంగంలోకి గూఢచారులు

#jagan

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అధికార వైసీపీ తన ఎమ్మెల్యేలపై నిఘా పెంచింది. ఈ ఎన్నికలలో ప్రతి ఎమ్మెల్యే ఓటు కూడా కీలకమైనదే. 175 అసెంబ్లీ స్థానాలకు గాను మొత్తం ఏడుగురు ఎమ్మెల్సీలను ఎన్నుకోవాల్సి ఉంటుంది. మొత్తం 175 మంది శాసనసభ్యులు ఉన్నందున ఒక్కో అభ్యర్థి గెలుపుకోసం 22 మొదటి ప్రాధాన్యం ఓట్లు అవసరం.

ఏ ఇద్దరు అభ్యర్థులైనా 22 మొదటి ప్రాధాన్యం ఓట్లు పొందలేకపోతే అప్పుడు రెండవ ప్రాధాన్యం ఓట్లు కీలకం అవుతాయి. అధికార వైసీపీకి 151 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఇతర పార్టీల నుంచి వచ్చి అనధికారికంగా చేరిన వారితో కలిపి ఆ పార్టీ బలం మొత్తం 156కు చేరింది. అధికార వైసీపీకి అధికారికంగా ఉన్న 151 స్థానాలతో ఆరుగురు ఎమ్మెల్సీలను గెలుచుకునే అవకాశం స్పష్టంగా ఉన్నది.

ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి అధికారికంగా 23 స్థానాలు ఉండగా అందులో నుంచి నలుగురు ఎమ్మెల్యేలు అనధికారికంగా పార్టీ ఫిరాయించి అధికార వైసీపీలో చేరారు. జనసేన పార్టీ నుంచి గెలిచిన ఒక ఎమ్మెల్యే కూడా ఇప్పుడు వైసీపీ పంచన చేరి ఉన్నారు. ఫిరాయింపులు లేకపోతే తెలుగుదేశం పార్టీకి ఒక స్థానం సునాయాసంగా దక్కాల్సి ఉంది. అయితే అధికార వైసీపీ పంతానికి పోయి ఏడో అభ్యర్ధిని కూడా రంగంలో దించింది. అయితే అధికార వైకాపాను అసంతృప్తి ఎమ్మెల్యేల అంశం వేధిస్తోంది.

ఆ పార్టీ నుంచి గెలుపొందిన నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిలు గత కొంతకాలంగా ప్రభుత్వ విధానాలను తప్పుబడుతూ ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంతరాత్మ ప్రబోధానుసారం ఓటు వేస్తామని ఇద్దరూ బహిరంగంగానే స్పష్టం చేశారు. దీంతో అధికార వైకాపాలో అలజడి మొదలైంది.

ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు వైకాపాకు ఓటు వేయకుంటే ఆ పార్టీకి మిగిలే బలం 154. ఆ మొత్తం సభ్యులు కచ్చితంగా అధికార పార్టీ నిలబెట్టిన ఏడుగురు సభ్యులకు ఒక్కొక్కరూ 22 ఓట్లు వేసేందుకు సరిపోతుంది. అయితే విషయం అంత సులభంగా లేదు. అధికార పార్టీని క్రాస్ ఓటింగ్ భయం వెన్నాడుతోంది. ఈ క్రాస్ ఓటింగ్ భయంతో ఇప్పటికే 3 సార్లు మాక్‌ పోలింగ్‌ నిర్వహించినా 132 మందికి మించి వైకాపా సభ్యులు హాజరుకాలేదు.

హాజరైనా వారిలోనూ నలుగురు ఎమ్మెల్యేలు చెల్లని ఓట్లు వేయడం వంటి పరిణామాలు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. దీంతో 154 మంది వైకాపా ఎమ్మెల్యేలను ఏడు బృందాలుగా విభజించి ఒక్కో బృందానికి 22 మందిని కేటాయించి ప్రతి బృందానికి ఇద్దరు, ముగ్గురు మంత్రుల పర్యవేక్షణ ఉండేలా జాగ్రత్తపడుతోంది. అంతరాత్మ ప్రభోదానుసారం ఓటెయ్యాలంటూ తెదేపా ఇస్తున్న పిలుపునకు అనుగుణంగా పలువురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేస్తారనే అనుమానం అధికార పార్టీకి ఉంది.

ప్రతి ఓటూ కీలకమైనందున అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో కొందరి కదలికలను ఇంటెలిజెన్స్‌ సిబ్బందితో పర్యవేక్షిస్తున్నట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో టికెట్‌ కష్టం అనే పరిస్థితి ఉన్నవారు, పార్టీ అదనపు సమన్వయకర్తలను నియమించిన నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, పార్టీపై అసంతృప్తితో ఉన్నవారు, కొంతకాలంగా పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా ఉండని వారు.. ఇలా పలు కారణాలతో కొందరిపై వైకాపా అధిష్ఠానం దృష్టి సారించినట్లు చెబుతున్నారు.

ఎన్టీఆర్‌, కృష్ణా, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, గుంటూరు జిల్లాల్లో ఒక్కొక్కరు, ఉమ్మడి విశాఖ, ప్రకాశం జిల్లాల్లో ఒక్కో ఎమ్మెల్యే, ఇంకొందరు ఇంటెలిజెన్స్‌ పర్యవేక్షణలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 2019 ఎన్నికల్లో సైకిల్‌ గుర్తుపై గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాల గిరి, వాసుపల్లి గణేష్‌లు అనధికారికంగా తెలుగుదేశం నుంచి వైకాపాలో చేరారు.

వీరితో పాటు జనసేన నుంచి గెలిచిన రాపాక వరప్రసాద్‌ కూడా వైకాపాతోనే ఉన్నారు. దీంతో తమకు నైతికంగా 156 మంది సభ్యుల బలం ఉందని వైకాపా అనుకున్నది. దాంతో తమకు సునాయాసంగా గెలిచే 6 స్థానాలే కాకుండా ఏడో స్థానంలో కూడా అభ్యర్ధిని పోటీకి దింపింది.

తెలుగుదేశం పార్టీ నుంచి ఫిరాయించిన వారిని తీసేస్తే ఉన్న స్థానాలు 19. కాగా ఇద్దరు వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు టీడీపీకి ఓటు వేస్తారని అనుకుంటే ఆ సంఖ్య 21కి చేరుతుంది. మరో ఎమ్మెల్యే క్రాస్‌ ఓటింగ్‌ కు పాల్పడితే చాలు తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి విజయం సాధిస్తారు. దాంతో అధికార పార్టీలో క్రాస్ ఓటింగ్ భయం పట్టుకున్నది. దాంతో మొత్తం ఎమ్మెల్యేలలో అనుమానితులను ఎంపిక చేసుకుని గూఢచారులను ప్రయోగించారు.

గూఢచారులు రంగంలో దిగడంతో ఏపి రాజకీయాలలో కలకలం చెలరేగుతున్నది. రహస్య ఓటింగ్ కారణంగా క్రాస్ ఓటింగ్ జరుగుతుందని అందువల్ల తమ అభ్యర్థి గెలుపు ఖాయమని తెలుగుదేశం ధీమా వ్యక్తం చేస్తోంది. తమ పార్టీలో ప్రస్తుతం ఉన్న 19 మంది ఎమ్మెల్యేలు ఎలాంటి తప్పు లేకుండా ఓటు వేసుకునేలా కరసత్తు ముమ్మరం చేసింది. అధికార పార్టీ నుంచి ఒకరిద్దరు ఎమ్మెల్యేలు గైర్హాజరైనా లేక చెల్లని ఓటు వేసినా లెక్కలు తారుమారు అయ్యే అవకాశం ఉంది. లెక్కల సంగతి ఎలా ఉన్నా తమపై నిఘా పెట్టడాన్ని అధికార వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.

Related posts

అంబేద్కర్ కు నివాళులు అర్పించిన దళితులు

Satyam NEWS

పారదర్శకంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు

Satyam NEWS

ప్రభుత్వ భూమిని కాజేసిన ప్రజాప్రతినిధులు

Satyam NEWS

Leave a Comment