ప్రతి ఇంటికి ప్రతిరోజు మిషన్ భగీరథ ద్వారా పరిశుభ్రమైన మంచి నీరు సరఫరా చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం కలెక్టర్ చాంబర్ లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలో ఏ ఒక్క మనిషి త్రాగు నీటి కోసం బిందె పట్టుకొని బయట కనిపించ వద్దని, కొండలు గుట్టలు అటవీ ప్రాంతాలు మారుమూల ప్రాంతాల అని తేడా లేకుండా జిల్లాలోని అన్ని ఆవాస ప్రాంతాలకు మిషన్ భగీరథ పథకం ద్వారా మంచినీళ్లు అందివ్వాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
నాగర్ కర్నూల్ కొల్లాపూర్ ఇ ఇ లు డీఈలు,ఏఈ లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో డివిజన్ల వారీగా మంచినీటి సరఫరా పురోగతిని, ఏలూరు ప్లాంట్, జిల్లాలోని అన్ని నీటిశుద్ధి కేంద్రాల పాయింట్ల స్థితిగతులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తిలకించి జిల్లాలో నీటి సరఫరా వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అధికారులు డివిజన్ల వారీగా పురోగతిని నీటి సరఫరా అంశాలను కలెక్టర్ కు వివరించారు.నాగర్ కర్నూలు జిల్లాలోని 20 మండలాల్లోని 710 ఆవాస ప్రాంతాలకు ప్రస్తుతం మిషన్ భగీరథ ద్వారా నీరు అందుతున్నదని చెప్పారు. మరో 15 చెంచు పెంటలకు నాబార్డు పథకం ద్వారా బోర్లు వేసి చెంచు పెంటకు మంచినీరు అందిస్తున్నామని, జిల్లాలో దోమలపెంట గ్రామానికి మాత్రమే అందాల్సి ఉందన్నారు.
ఆ గ్రామానికి కూడా పాతాళ గంగ నుండి నీటిని శుద్ధి చేసి మార్చి 2022 నాటికి అందిస్తామని అధికారులు వివరించారు. నాగర్ కర్నూల్ జిల్లా లోని 8,15,148 మంది ప్రజలకు ప్రతిరోజు 815.148 మెట్రిక్ లీటర్ల మంచి నీటిని మిషన్ భగీరథ ద్వారా అందిస్తున్నామన్నారు. జిల్లా కలెక్టర్ అధికారులను ప్రశ్నిస్తూ దళిత వాడలు, ఆదివాసీ గూడేలు, శివారు ప్రాంతాలు, మారుమూల పల్లెలు అన్నింటికీ మిషన్ భగీరథ ద్వారానే శుద్ధి చేసిన మంచినీటిని సరఫరా చేయడం ప్రభుత్వ లక్ష్యమన్నారు.
మారుమూల పల్లెలు, కొండ ప్రాంతాలకు కూడా నీళ్ళివ్వాలి
అచ్చంపేట, నాగర్ కర్నూలు, కొల్లాపూర్, కల్వకుర్తి నియోజకవర్గాల మారుమూలలో ఉన్న చిన్న పల్లెలకు, ఎత్తైన ప్రాంతాల్లో ఉన్న ఆవాస ప్రాంతాలకు కూడా మిషన్ భగీరథ ద్వారా మంచినీరు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. నాగర్ కర్నూలు జిల్లాలోని ఒక లక్షా తొంభై మూడు వేల నీటి కొళాయి లతో మంచినీళ్ల సరఫరా 100% స్వచ్ఛమైన నీటి సరఫరా జరగాలని కలెక్టర్ ఆదేశించారు.
‘‘ప్రతీ ఊరికి నీళ్లు పంపి, ప్రతీ ఇంటికి నల్లా ద్వారా మంచినీళ్లు ఇవ్వడంతోనే బాధ్యత తీరిపోదుని అనంతరం ఎలాంటి ఆటంకం లేకుండా నిరంతరాయంగా మంచినీటి సరఫరా జరగాలన్నారు. ఏ ఒక్క రోజు మంచినీరు అందకున్నా ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతారని ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మిషన్ భగీరథ నీటిని పక్కాగా అందించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
అదేవిధంగా గృహ సముదాయాల తో పాటు ప్రభుత్వ పాఠశాలలు, అంగన్ వాడి కేంద్రాలు, వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలకు మిషన్ భగీరథ నీటిని ప్రతిరోజు అందించాలని పేర్కొన్నారు గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఇంటికి రోజు 100 లీటర్ల, పట్టణ ప్రాంతాల్లో 135 లీటర్ల చొప్పున మంచి నీటిని 100% అందజేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో కల్వకుర్తి ఈఈ పుల్లారెడ్డి, కొల్లాపూర్ ఈఈ సుధాకర్ సింగ్, నాగర్ కర్నూలు మిషన్ భగీరథ ఈఈ శ్రీధరరావు, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.