38.2 C
Hyderabad
April 27, 2024 17: 10 PM
Slider సంపాదకీయం

వైసీపీ కి కష్ట కాలం: టీడీపీలో చేరడానికి క్యూ

#chandrababu

ఏమైందో తెలియదు కానీ వైసీపీ నాయకుల మనసు విరిగిపోయింది. దాంతో చాలా మంది పార్టీ మారేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. వైసీపీలో ఉండటం వల్ల తమకు ఎలాంటి రాజకీయ భవిష్యత్తు ఉండదనేది వారి అభిప్రాయంలా కనిపిస్తున్నది. టిక్కెట్ గొడవలతో బాటు నమ్ముకున్న వారిని నట్టేట ముంచుతున్నారనేది ఇప్పుడు వైసీపీ నాయకులపై ప్రధానమైన ఆరోపణ.

దాంతో వైసీపీలో రివర్స్‌ సునామీ మొదలైంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను మార్చే విషయంలో పార్టీ అధినేత జగన్‌ టైమింగ్‌ మిస్‌ అయి, వ్యూహం బెడిసికొట్టింది. 94 మందికిపైగా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను మార్చబోతున్నారనే న్యూస్‌ వినగానే, వైసీపీ శ్రేణులు అయోమయంలో పడిపోయాయి. ఇన్నాళ్లు అంతా బాగుంది.. వైసీపీకి ఎదురు లేదు.. జగన్‌కు తిరుగులేదు అంటూ తాడేపల్లి ప్యాలెస్‌ పెద్దలు చేసిన ప్రచారం మొత్తం ఉత్త గ్యాస్‌ అని తేలిపోయింది. టికెట్ దక్కదని క్లారిటీ రావడంతో ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరిదారి వారు చూసుకొంటున్నారు.

ఏపీలో రాజకీయాల్లో కీలకమైన ఉమ్మడి తూర్పుగోదావరి నుంచి వైసీపీ వలసల వరద గట్లు తెంచుకొంది. కాకినాడ జిల్లా జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురం నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించారు వైసీపీ బాస్ జగన్‌. పార్టీలో రాజకీయ భవిష్యత్తు లేదని అర్ధం కావడంతో.. పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు టీడీపీ చేరడానికి సిద్దమైపోయారు. టికెట్‌ ఇస్తామని తెలుగుదేశం అధిష్టానం గ్యారెంటీ ఇవ్వకపోయినా సైకిల్‌ ఎక్కడానికి సై అంటున్నారు చంటిబాబు.

పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు జనసేన వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. జగన్‌ హ్యాండ్‌ ఇచ్చిన వెంటనే హైదరబాద్‌ వెళ్లిపోయి పవన్‌ కళ్యాణ్ అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. ఇక ప్రత్తిపాడు వైసీపీ ఎమ్మెల్యే పర్వత ప్రసాద్‌ కూడా ఏ పార్టీలో చోటు దొరుకుతుందా అనే అన్వేషణలో ఉన్నారని సమాచారం. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని సర్వేలన్నీ స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో టికెట్‌ ఇవ్వకపోయినా.. తెలుగుదేశం పార్టీలో చేరడమే సేఫ్‌ అని అత్యధిక వైసీపీ ఎమ్మెల్యేల ఆలోచనగా ఉందని అంటున్నారు పరిశీలకులు.

కొత్త సంవత్సరంలో జగన్‌కు మరిన్ని షాకులు తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 40 మందికి పైగా వైసీపీ ఎమ్మెల్యేలు, టీడీపీ అధినేత చంద్రబాబుతో టచ్‌లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. సంక్రాంతి నాటికి వైసీపీ నుంచి వలసలు ఊపందుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల ప్రకటన వచ్చే సమయానికి పార్టీ సగం ఖాళీ అయినా ఆశ్చర్యం లేదంటున్నారు విశ్లేషకులు. తప్పుడు ప్రచారాలతో ప్రజలను ఎల్లకాలం మోసం చేయలేమని తాడేపల్లి ప్యాలెస్‌ పాలకులకు అర్ధమయ్యేలా చేస్తున్నాయి తాజా పరిణామాలు.

Related posts

ముంబయి నుంచి అదిలాబాద్ వరకు నందిగ్రామ్‌ రైలు..

Sub Editor

జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరిచిన సాయి కిషోర్ కి సన్మానం

Satyam NEWS

అక్రమంగా ఇసుక తరలిస్తుంటే అధికారులు ఏంచేస్తున్నట్లు?

Satyam NEWS

Leave a Comment