ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం పెండల్ వాడ గ్రామంలో దారుణం జరిగింది. నిన్న జరిగిన సప్తాహ ముగింపు కార్యక్రమంలో ఫుడ్ పాయిజన్ అయి రెండు వందల మందికి పైగా గ్రామస్థులు అనారోగ్యానికి గురయ్యారు. రాత్రి నుండి వాంతులు, విరేచనాలు కావడంతో ఒక్కసారిగా గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. 43 మందికి ఆరోగ్యం క్షీణించడంతో ఆదిలాబాద్ రిమ్స్ కి తరలించారు.
అందులో ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉండటంతో వారికి ఐసియు లో చికిత్స అందిస్తున్నారు. ఇక గ్రామంలో మరో 150 మంది అస్వస్థతకు గురికావడంతో వైద్య బృందాన్ని పెండల్ వాడ గ్రామానికి తరలించారు. జరిగిన ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.