28.7 C
Hyderabad
April 28, 2024 04: 42 AM
Slider ముఖ్యంశాలు

గవర్నర్ పై హైకోర్టుకు ప్రభుత్వం

#highcourt

రాష్ట్ర  ప్రభుత్వం, గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌కు మధ్య ఉన్న వైరం మరింత పెరుగుతోంది. రాష్ట్ర బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ నుంచి ఇప్పటి వరకు అనుమతి రాకపోవడంతో కోర్టుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. మరో నాలుగు రోజుల్లో శాసనసభ సమావేశాలు ప్రారంభం కానుండగా ఫిబ్రవరి 3న బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు గవర్నర్ అనుమతి తెలపాల్సి ఉండగా.. తమిళిసై నుంచి ఇప్పటి వరకు అనుమతి రాకపోవడంతో నేడు లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఇందుకోసం సుప్రీంకోర్టు  సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవేను ప్రభుత్వం రంగంలోకి దించింది. బడ్జెట్‌కు గవర్నర్ తక్షణం ఆమోదం తెలిపేలా ఆదేశాలివ్వాలని ప్రభుత్వం తన పిటిషన్‌లో కోరనుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 202 ప్రకారం బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ ఆమోదం తప్పనిసరి.  ఇతర విషయాల్లో సరే కానీ, బడ్జెట్ ఆమోదం విషయంలో గవర్నర్ విచక్షణకు తావుండదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. బడ్జెట్‌కు ఆమోదం విషయమై ఈ నెల 21నే రాష్ట్రప్రభుత్వం గవర్నర్‌కు లేఖ పంపింది. అయినప్పటికీ ఆమోదం తెలపకపోవడంతో కోర్టును ఆశ్రయించడానికే ప్రభుత్వం మొగ్గు చూపింది. బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో గవర్నర్ ప్రసంగం ఉండడం అనేది అత్యవసరం కాదని కూడా చెబుతున్నారు.  గతేడాది కూడా గవర్నర్‌ ప్రసంగం లేకుండానే బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే, కోర్టులు గవర్నర్‌ను ఆదేశించలేవన్న విషయం గతంలో పలు సందర్భాల్లో స్పష్టమైన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించనుండడంపై ఆసక్తి నెలకొంది.

Related posts

రానున్ననాలుగైదు రోజులు భారీ వర్షాలు

Satyam NEWS

మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట

Satyam NEWS

జగన్ ప్రభుత్వం పరువు తీసిన విజయసాయిరెడ్డి

Bhavani

Leave a Comment