30.7 C
Hyderabad
April 29, 2024 03: 44 AM
Slider చిత్తూరు

GD నెల్లూరు నియోజకవర్గంలో YCPకి వర్గపోరు

#nellore

గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో వర్గపోరు తారా స్థాయికి  చేరుకుంది. చిన్న పదవి విషయంలో ప్రారంభం అయినా విభేదాలు పతాకస్థాయికి చేరుకున్నాయి. రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి కళత్తూరు నారాయణ స్వామి, ప్రభుత్వ విదేశీ వ్యవహారాల సలహాదారు మహాసముద్రం  జ్ఞానేంద్ర రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. పాత మిత్రులు అయిన ఇద్దరు నేతలు నేతలు నియోజక వర్గంలో రెండు వర్గాలను నడుపుతున్నారు. ఒకరంటే ఒకరు రగిలిపోతున్నారు. విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గం నేతలు అంతా తన వద్ద పనులు చేసుకుని తననే విమర్శిస్తున్నారని నారాయణ స్వామి అవేదన వ్యక్తం చేస్తున్నారు. నారాయణ స్వామి వర్గ రాజకీయాలు నడుపుతూ పార్టీకి కష్టపడిన వారిని విస్మరిస్తున్నారని జ్ఞానేంద్ర వర్గం ఆరోపిస్తోంది. ఈ వ్యవహారం అధిష్టానానికి తల నొప్పిగా తయారయ్యింది. కరవ మంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టు వ్యవహారం క్లిష్టంగా తయారయ్యింది.

1981 లో నారాయణ స్వామి కార్వేటినగరం సమితి అధ్యక్షునిగా, జ్ఞానేంద్ర రెడ్డి జి డి నెల్లూరు సమితి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. తరువాత ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. నారాయణ స్వామి  2004 ఎన్నికల్లో  కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి సత్యవేడు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.  2014, 2019 ఎన్నికల్లో జి డి నెల్లూరు నుంచి వైసిపి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జగన్ అధికారంలోకి వచ్చి నప్పటి నుంచి ఉప ముఖ్య మంత్రిగా ఉన్నారు. జ్ఞానేంద్ర రెడ్డి 1989, 1991 ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్టుపై చిత్తూరు లోక్ సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. వైసిపి ఏర్పడిన తరువాత ఆ పార్టీలో చేరి పలమనేరు ఎమ్మెల్యే టిక్కెట్టు ఆశించి విఫలమయ్యారు. తరువాత ఎమ్మెల్సీ పదవి కోసం  ప్రయత్నించి వీలుపడక,  ఏడాది క్రితం ప్రభుత్వ సలహాదారు అయ్యారు. అప్పటి వరకు ఇద్దరు నేతలు సఖ్యత గానే ఉన్నారు.

ఆరు నేతల క్రితం పెనుమూరు మండల పార్టీ కన్వీనర్ మార్పు  విషయంలో ఇద్దరి మధ్య వివాదం ప్రారంభం అయ్యింది. మండల కన్వీనర్ గా ఉన్న జ్ఞానేంద్ర రెడ్డి బంధువు సురేష్ రెడ్డి స్థానంలో కామసాని విజయకుమార్ రెడ్డిని నియమించాలని స్వామి భావించారు. దీనితో జ్ఞానేంద్ర మండి పడ్డారు. పెనుమూరు రాజకీయాలలో వేలు పెడితే సహించేది లేదని హెచ్చరించారు. అయితే జ్ఞానేంద్ర రెడ్డి ప్రభుత్వ సలహాదారు, ఆయన అన్న కుమారుడు దయాసాగర్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి, సురేష్ రెడ్డి భార్య హేమలత ఎంపిపి పదవుల్లో ఉన్నందున పార్టీ పదవి మరొకరికి ఇవ్వాలని పలువురు పట్టుబట్టారు. దీనితో నారాయణ స్వామి విజయకుమార్ రెడ్డికి పదవి ఇచ్చారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో నారయణ స్వామికి టిక్కెట్టు రాకుండా అడ్డుకుంటామని  జ్ఞానేంద్ర వర్గం అంటోంది. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ శివప్రసాద్ చెల్లెలు పద్మజ రెడ్డి, మాజీ మంత్రి కుతూహలమ్మ అక్క కుమారుడు రాజేష్ టిక్కెట్టు రేసులో ఉన్నారు. నారాయణ స్వామి మాత్రం తాను లేదా తన కుమార్తె పోటీ చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్గపోరు కారణంగా రానున్న ఎన్నికలలో పార్టీ ఎక్కడ నష్టపోతుందో అని పార్టీ నేతలు బయపడుతున్నారు. ఇద్దరు నేతలూ రాజకీయంగా బలవంతులు కావడం, ఉన్నత పదవుల్లో ఉండడంతో వారికి సర్దిచెప్పే ప్రయత్నం ఎవరు చేయడం లేదు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఆదిస్థానం ఎలా సర్దుబాటు చేస్తుందో వేచి చూడాలి.

సాటి గంగాధర్, సీనియర్ జర్నలిస్ట్, చిత్తూరు

Related posts

జగన్ మాటలే నిపుణుల కమిటీ నివేదికలు

Satyam NEWS

ఆన్లైన్ విద్యను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి

Satyam NEWS

అమ్మవారి చెంత ఆధిపత్య పోరు

Satyam NEWS

Leave a Comment