38.2 C
Hyderabad
May 1, 2024 21: 29 PM
Slider సంపాదకీయం

డైవర్షన్ పాలిటిక్స్ ఎంతకాలం???

#CM Jagan

కొత్త జిల్లాల ఏర్పాటుపై కొన్ని చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి అందరికి తెలిసిన విషయం ఏమిటంటే అందులో ఎవరూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడరు. ఒక వేళ మాట్లాడాల్సి వచ్చినా ‘‘జగనన్నా నువ్వే కాపాడాలి’’ అంటూ ముక్తాయిస్తారు.

జగనన్న మాటను జవదాటి వెళ్లరు. అది భక్తి వల్లో భయం వల్లో తెలియదు కానీ చాలా కాలంగా అలానే జరుగుతున్నది. అలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిరసన గళాలు వినిపించడమా? అది సాధారణ పరిస్థితుల్లో సాధ్యమా? స్థానిక సంస్థల ఎన్నికలలో ఎవరిని అభ్యర్ధిగా పెట్టినా ఎవరిని జిల్లా పరిషత్ చైర్మన్ చేసినా ఎవరిని మేయర్ చేసినా ఏ మాత్రం నిరసనలు వ్యక్తం కాలేదు.

కొందరి ఎంపిక పార్టీకి భారమైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కింది స్థాయి నేతలు మాత్రం నోరు మెదలేదు. ఇలాంటి పరిస్థితులలో పార్టీలో ఉంటూ పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నిరసనలు వ్యక్తం చేయడం సాధ్యమా? ఈ ప్రశ్నలన్నింటికి ఒక అనుమానం ఏమిటంటే కొత్త జిల్లాల ఏర్పాటుపై నిరసనలు వ్యక్తం చేయాలని పార్టీ ముఖ్యులే ఆదేశిస్తున్నారా…..? ఈ అనుమానం చాలా మందికి ఉంది.

రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళన, రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె లాంటి విషయాలపైనా, ఆర్ధికంగా రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులపైనా ప్రభుత్వ ఇతర వైఫల్యాలపైనా ప్రజలు చర్చించుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానవర్గమే ఆందోళనలు చేయిస్తున్నదనే వాదనలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఒకటి రెండు జిల్లాలకు పరిమితం అయిన ఈ ‘‘అధికారిక ఆందోళన’’ రాబోయే రోజుల్లో ఎన్జీవోల సమ్మె ఉధృతం అయిన కొద్దీ మోతాదు పెంచుకోవచ్చు. ఎన్జీవోల సమ్మె రాష్ట్రాన్ని ప్రతిష్టంభించేంతగా పెరిగిపోతే కొత్త జిల్లాలపై ఆందోళనలు కూడా అంతే స్థాయికి పెరగవచ్చు.

ఈ అనుమానం… ఈ సమాచారం నిజంగా నిజం అయితే మాత్రం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ‘‘పులి మీద స్వారీ’’ చేస్తున్నట్లే అనుకోవాలి. స్వారీ చేస్తున్నంత కాలమే పులి ఏమీ చేయదు…

దిగితే ఆ పులి స్వారీ చేసిన వాడినే తినేస్తుంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ‘‘డైవర్షన్ పాలిటిక్స్’’ ఎన్నో చేసింది. ఒక సమస్యను మరుగున పెట్టేందుకు మరో పెద్ద సమస్యను తెరపైకి తెచ్చింది.

గతంలో ఇలా ఇందిరాగాంధీ చేసేవారు. ఆమె కొత్త సమస్యలను పైకి తెచ్చి పాత సమస్యలను కప్పి పెట్టేవారు. అలా చేసీ చేసీ పార్టీ చీలిపోయింది. అందువల్ల సమస్యలు పరిష్కరించడాన్ని నేర్చుకోవాలి తప్ప కొత్త సమస్యలను సృష్టించడం కాదు. సృష్టించే ప్రతి సమస్య కూడా మన అదుపులోనే ఉండదు.

అది ఎల్లలు దాటిన రోజున భారీ ముప్పు వాటిల్లుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక సమస్య దారుణ పరిస్థితుల్లో ఉంది. పెంచుతున్న పన్నులు ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పై విముఖతను పెంచుతున్నాయి.

ఓటిఎస్ లాంటి ఏ స్కీం ప్రవేశ పెట్టినా ప్రజల నుంచి ఎలాంటి స్పందనా రావడం లేదు. ఉన్న సమస్యలు పక్కన పెట్టి భూముల కొలతలు తీయడం లాంటి చర్యలు ప్రభుత్వ పెద్దలపై అనుమానాలను మరింతగా పెంచుతున్నాయి. ప్రభుత్వ ప్రాధామ్యాలు ఏమిటో అధికారులకే అర్ధం కావడం లేదు…… అంతటా అసందిగ్ధత…. అపోహలు… అనుమానాలు…

Related posts

ఎలక్షన్ ఫీవర్: అధినాయకుడికి ఇంత ఆందోళన ఎందుకో?

Satyam NEWS

పాలన చేతగాని అసమర్థ సీఎం వై ఎస్ జగన్: చదలవాడ విమర్శ

Satyam NEWS

చిత్తూరు జిల్లాలో ఒక్కరోజే ఐదుగురు యువతుల అదృశ్యం

Bhavani

Leave a Comment