30.2 C
Hyderabad
September 14, 2024 17: 26 PM
Slider తెలంగాణ సంపాదకీయం

కారూ కమలమూ ఒక బ్యాలెట్ పేపరూ

186059-bjptrs

హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక లో ఎవరు గెలుస్తారు? ఇది అంత తేలికగా సమాధానం చెప్పే ప్రశ్న కాదని అందరికి తెలుసు. పరిస్థితి చూస్తుంటే కాంగ్రెస్ గెలుస్తుందండీ అంటూ కొందరు చెప్పవచ్చు. కేసీఆర్ పై ప్రజలకు అభిమానం చెక్కు చెదరలేదండీ కారుకు తిరుగు ఉండదు అని మరి కొందరు చెప్పవచ్చు. ఎవరు గెలిచినా 5 నుంచి 10 వేల మెజారిటీనే అని చెప్పి మరి కొందరు తప్పించుకోవచ్చు. ప్రజల మనసులో ఏముందో ఇప్పుడే చెప్పడం కష్టమే కానీ కమలనాథులను చూస్తుంటే కారు ఓనర్లకు మాత్రం గుబులు పుడుతున్నది.

హుజూర్ నగర్ లో బిజెపికి పెద్దగా బలం లేదు. మరి అలాంటి బిజెపిని చూసి టిఆర్ ఎస్ భయపడటం ఏమిటి అనే సందేహం రావచ్చు. నిజంగానే టిఆర్ ఎస్ కు బిజెపి భయం కలిగిస్తున్నది. అసెంబ్లీ కి ముందస్తు ఎన్నికలు జరిగినపుడు బిజెపిని చూసి టిఆర్ఎస్ కు ఎలాంటి భయం పుట్టలేదు. దాదాపు ఐదు రాష్ట్రాల బిజెపి ముఖ్యమంత్రులు, ఆ పార్టీ అధ్యక్షుడు, సాక్ష్యాత్తూ ప్రధాని వచ్చి ప్రచారం చేసినా కూడా ఐదు సీట్ల బీజేపీ ఒక్క సీటుకు పడిపోయింది. అప్పటిలో బిజెపి టిఆర్ఎస్ లది మ్యాచ్ ఫిక్సింగ్ అని కాంగ్రెస్ పార్టీ నెత్తీనోరూ బాదుకుంది.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో బిజెపి తన శక్తియుక్తులన్నీఒడ్డి పోరాడింది కానీ మనసులో ఎక్కడో కాంగ్రెస్ మాత్రం గెలవకూడదు అని అనుకున్నది. అందుకే పైకి కేసీఆర్ తో యుద్ధం చేస్తున్నా లోలోన కేసీఆర్ కే అనుకూలమైన నిర్ణయాలను తీసుకున్నారు బిజెపి నాయకులు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి దాదాపుగా అన్ని వ్యవస్థలూ కేసీఆర్ కు పరోక్షంగా సహకరించాయి. దాంతో ముందు కష్టం అనుకున్న ఎన్నికను కేసీఆర్ సులభంగా గెలిచేశారు.

కాంగ్రెస్ పార్టీ చతికిల పడింది. రెండో సారి టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడింది. ఉన్న కాంగ్రెస్ పార్టీ ఊడ్చి పెట్టుకుపోవడంతో బిజెపి లో ఆశలు చెలరేగాయి. అయితే బిజెపి ఏం చేయలేకపోయింది. లోక్ సభ సార్వత్రిక ఎన్నికలలో గెలుపు పై దృష్టి కేంద్రీకరించిన బిజెపి తెలంగాణ రాష్ట్రం గురించి పెద్దగా పట్టించుకోలేదు.

లోక్ సభ ఎన్నికలలో కేసీఆర్ ఎన్ని సీట్లు గెలిచినా కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వరు కాబట్టి తమకే లాభిస్తుందని లెక్కవేసుకుని బిజెపి కేంద్ర నాయకత్వం న్యూట్రల్ గానే మిగిలిపోయింది. అసెంబ్లీ ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయి ఉన్న కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఎన్నికల నాటికి ఆ షాక్ నుంచి తేరుకోలేదు. ఎటూ కేసీఆరే గెలుస్తాడు లే అని పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్ధులు చాలా వరకూ ప్రచారం చేయలేదు. రాజకీయ పరిస్థితులతో సంబంధం లేకుండా క్షేత్ర స్థాయిలో చాలా కాలం నుంచి పని చేసుకుంటున్న బిజెపి అభ్యర్ధులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు.

నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి లోక్ సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు పోటీ నుంచి తప్పుకున్నాడు. దాంతో అక్కడ బిజెపి విజయఢంకా మోగించింది. అదే విధంగా ఆదిలాబాద్ లో కూడా బిజెపికి కలిసి వచ్చింది. కరీంనగర్ లో కూడా కింది స్థాయి కాంగ్రెస్ కార్యకర్తలు బిజెపి గెలిచే అవకాశం ఉందని బలంగా నమ్మి అటువైపు తిరిగిపోయారు. టిఆర్ ఎస్ కు వ్యతిరేకంగా బిజెపి కాంగ్రెస్ కలిసి పని చేసినందువల్లే నాలుగు స్థానాలలో బిజెపి, మూడు స్థానాలలో కాంగ్రెస్ గెలిచాయి.

జరిగిన పరిణామాలతో టిఆర్ ఎస్ ఒక్క సారిగా కంగుతిన్నది. ఈ సూత్రం బాగానే ఉన్నట్లు బిజెపి, కాంగ్రెస్ పార్టీలు భావించాయి. అదే సూత్రం ఇప్పుడు హుజూర్ నగర్ ఉప ఎన్నికలో కూడా అమలు చేస్తే? ఇదే టిఆర్ ఎస్ భయం. పైగా ఇప్పుడు కేంద్రంలో బిజెపి తిరుగులేని మెజారిటీతో అధికారంలో ఉంది. గతంలో సాయం చేసినట్లు కేసీఆర్ కు బిజెపి సాయం చేసే స్థితిలో లేదు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నందున ఆ స్థానంలోకి తాము రావాలని బిజెపి నాయకులు అనుకుంటున్నారు.

ఈ ఉప ఎన్నికలో మళ్లీ కేసీఆర్ గెలిస్తే ఆయన మరింత బలపడతారు. అందుకని ఆయన బలహీన పడాలంటే కాంగ్రెస్ గెలవాలి అనే లెక్క బిజెపి వేసుకుంటే హుజూర్ నగర్ లో పరిణామం వేరుగా ఉంటుంది. కాంగ్రెస్ గెలవడం వల్ల బిజెపికి వచ్చే నష్టం లేదు. కేసీఆర్ ఓడిపోతే వచ్చే లాభమే ఎక్కువ. అందుకే హుజూర్ నగర్ లో ఎన్నికల సంఘం ముందు నుంచి టిఆర్ఎస్ కు నామమాత్రపు మద్దతు కూడా ఇవ్వడం లేదు సరికదా, టిఆర్ ఎస్ కు రుచించని నిర్ణయాలనే తీసుకుంటున్నది. ఈ పరిణామాలే టిఆర్ఎస్ కు బిజెపి అంటే భయం పుట్టిస్తున్నాయి.

ఆఖరు నిమిషంలో బిజెపి అభ్యర్ధి కాంగ్రెస్ కు అనుకూలంగా మారితే ఇక టిఆర్ ఎస్ పరిస్థితి గల్లంతే అవుతుంది. ఐదు వేల ఓట్లు మారిపోతే చాలు. ఇప్పటికే సిపిఐ మద్దతును టిఆర్ఎస్ కోల్పోయింది. అది ఎంత కాదన్నా 15 వేల ఓట్లతో సమానం. ఇక ఆర్టీసీ కార్మికులు, రెవెన్యూ ఉద్యోగులు, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కలిసికట్టుగా హస్తం మా నేస్తం అంటే ఇక పీకల్లోతు కష్టాలలోకి టిఆర్ ఎస్ వెళ్లిపోతుంది.

వీటన్నింటికి అతీతంగా రైతు బంధు అందుకుంటున్న వారంతా కలిసి కట్టుగా జై కేసీఆర్ అంటే కారు సేఫ్ గా జర్నీ చేస్తుంది. సత్యమూర్తి పులిపాక, చీఫ్ ఎడిటర్, సత్యం న్యూస్

Related posts

ఉక్రెయిన్ రష్యా యుద్ధం నిలుపుదలకు చర్చలు జరపాలి

Satyam NEWS

ఈ దృశ్యం మారేదెన్నడు?

Satyam NEWS

విశాఖపట్నం కలెక్టర్ కు సిఎం జగన్ ప్రశంస

Satyam NEWS

Leave a Comment