దేశం నలుమూలల నుండి శ్రీవారి దర్శనార్థం తిరుమల చేరుకునే యాత్రికులకు టిటిడి సకల సౌకర్యాలు కల్పిస్తోంది. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ పారదర్శకంగా గదుల కేటాయింపు చేస్తోంది. గదులు దొరకని భక్తులకు యాత్రికుల వసతి సముదాయాల్లో ఉచితంగా లాకర్ వసతి కల్పిస్తోంది. మరింత పారదర్శకత పెంచేందుకు అన్ని గదుల కేటాయింపు కౌంటర్లలో స్వైపింగ్ యంత్రాలను అందుబాటులో ఉంచింది. ఈ కారణంగా నగదు రహిత లావాదేవీలు బాగా పెరిగాయి. తిరుమలలో శ్రీ పద్మావతి విచారణ కార్యాలయం, ఎంబిసి, టిబి కౌంటర్(కౌస్తుభం), సిఆర్వో కార్యాలయంలోని సిఆర్వో జనరల్, ఎఆర్‌పి కౌంటర్ల ద్వారా గదుల కేటాయింపు జరుగుతుంది. సిఆర్వో జనరల్ వద్ద ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన సామాన్య యాత్రికులకు గదులు కేటాయిస్తారు. ఇక్కడ ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. గది కేటాయింపు సమాచారాన్ని సంబంధిత యాత్రికుల సెల్‌ఫోన్‌కు ఎస్ఎంఎస్ రూపంలో పంపుతారు. ఆ ఎస్ఎంఎస్‌ను చూపి యాత్రికులు గదులు పొందొచ్చు. అదేవిధంగా, ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నవారికి, కాటేజి దాతలకు ఎఆర్‌పి కౌంటర్‌లో గదులు కేటాయిస్తారు. సిఆర్వో వెనుక వైపు గల కౌస్తుభం కౌంటర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలపై గదులిస్తారు. శ్రీ పద్మావతి విచారణ కార్యాలయం, ఎంబిసిలో ప్రముఖులకు గదులు కేటాయిస్తారు. ఆన్‌లైన్‌లో 3 నెలల ముందు నుండి గదులు బుక్ చేసుకోవచ్చు. రూ.100/-, రూ.500/-, రూ.600/-, రూ.1000/-, రూ.1500/- అద్దె గదులు ఉంటాయి. తిరుమలలోని ఆర్‌టిసి బస్టాండులో ఇటీవల అందుబాటులోకి వచ్చిన పద్మనాభ నిలయంతో కలిపి మొత్తం 5 యాత్రికుల వసతి సముదాయాలున్నాయి. ఇక్కడ ఉచితంగా లాకర్లు కేటాయిస్తారు. యాత్రికులు తమ వస్తు సామగ్రిని ఇందులో భద్రపరుచుకుని శ్రీవారి దర్శనానికి వెళ్లి తిరిగి చేరుకోవచ్చు. విశాలమైన హాళ్లలో చక్కగా విశ్రాంతి పొందొచ్చు. ఇక్కడ జలప్రసాదం, తలనీలాల సమర్పణకు మినీ కల్యాణకట్ట, మరుగుదొడ్లు, స్నానపుగదులు, అన్నప్రసాదం తదితర అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అద్దె గదులు దొరకనివారు పిఏసిల్లో సౌకర్యవంతంగా బస చేయవచ్చు.
previous post
next post