మాజీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు తో పాటు పలువురు అమరావతి జేఏసీ నేతలను పోలీసులు అరెస్టు చేయడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండించింది. జనసేన పార్టీ సమావేశం అనంతరం ఆ పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ పోలీసులు అమరావతి పరిరక్షణ సమితి బస్ యాత్రను ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు.
గతంలో జనసేన చేపట్టిన కార్యక్రమాలకు పోలీసులు అనుమతులు ఇవ్వకుండా ఇలాగే ఇబ్బందులు పెట్టారని, రైతులకు న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ తరపున పోరాడుతామని ఆయన అన్నారు. అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీతో పాటు తమ పార్టీ నేతలు కూడా ఇక నుంచి ప్రతి ఆందోళనలో పాల్గొంటారని మనోహర్ వెల్లడించారు.
రాబోయే వారం రోజుల కాలంలో చేపట్టబోయే కార్యక్రమాలపై పార్టీ నేతలతో కలిసి చర్చించామని ఆయన తెలిపారు. ఈరోజు సాయంత్రం విజయవాడకు పవన్ కళ్యాణ్ వస్తున్నారు, ఆయనతో మాట్లాడిన తర్వాత కార్యక్రమాన్ని ఖరారు చేస్తామని అన్నారు.
రైతులకు భరోసా కల్పించాలి. రైతులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకోండి. ప్రజాప్రతినిధులు రాజధాని గ్రామ ప్రాంతాల్లో పర్యటించాలి. వారి వేదనను సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్ళాలి అని మనోహర్ వైసిపి నేతలకు సూచించారు.