28.7 C
Hyderabad
April 27, 2024 04: 57 AM
Slider సంపాదకీయం

స్పందన లేని ప్రత్యామ్నాయం: నిరుత్సాహంలో కేసీఆర్

#Telangana CM KCR

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల ప్రమేయం లేకుండా మరో కూటమి ఏర్పాటు చేయబోతున్నట్లు గత కొద్ది కాలంగా హడావుడి చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎక్కడ నుంచి కూడా ఆశించిన స్పందన రావడం లేదు. కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కలవబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

ఇప్పటికే కేసీఆర్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకారే, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, జార్ఖండ్ ముఖ్యమంత్రి శిబూ సొరేన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలను కలిశారు. ఢిల్లీ పర్యటనలో కేజ్రీవాల్ ను కలుస్తారని ప్రచారం జరిగినా ఇద్దరూ కలవలేదు. పైగా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సోమ్నాథ్ భారతి కేసీఆర్ పై తీవ్రమైన విమర్శలు చేశారు.

తెలంగాణ ఉద్యమకారులను, యువతను కేసీఆర్ మోసం చేశారని అంటూ సంచలన వాఖ్యలు చేశారు. ‘‘దళితుల ఓట్లతో కేసీఆర్ సీఎం అయ్యారు. దళిత సీఎం, మూడెకరాల భూమి ఇస్తామని కేసీఆర్‌ మోసం చేశారు” అంటూ ధ్వజమెత్తారు. ” కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రతి పథకంలో అవినీతి ఉంది. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఓటమి ఖాయం. దేశంలోని ప్రతి పార్టీ ఒక వ్యక్తిగత ఎజెండాతో ఉన్నాయి. ప్రధాని మోదీకి వ్యతిరేకమైన ఫ్రంట్ దేశంలో అవసరం లేదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ ప్రజలకు మంచి చేసే ఫ్రంట్ కావాలి. కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచిపోయారు’’ అని సోమ్నాథ్‌ ఆరోపించారు.

తొలి సారి భారీ ప్రతిఘటన

ఈ స్థాయిలో కేసీఆర్ కు ప్రతిఘటన ఎదురుకావడం బహుశ ఇదే తొలి సంఘటన. దీంతో ఆయనకు తీవ్ర ఆశాభంగం కలిగినట్లు కనిపిస్తున్నది. ఢిల్లీలో మూడు రోజుల పాటు మకాం వేసిన ఆయన మూడో కూటమి గురించి వివిధ పార్టీల నాయకులతో సంప్రదింపులు జరుపబోతున్నట్లు ఆయన పార్టీకి చెందిన వారు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అయితే చెప్పుకోదగిన ఒక నాయకుడిని కూడా కలవలేక పోయారు.

కేవలం భార్యతో కలసి ఆసుపత్రుల సందర్శనకు పరిమితమయ్యారు. ఢిల్లీలో ఆయనను ఇద్దరు మాత్రమే కలిశారు. వారిలో ఒక్కరు  బిజెపి ఎంపీ సుబ్రమణ్యస్వామి కాగా, మరొకరు రైతు నాయకుడు రాకేష్ తికావత్. స్వామికి రాజ్యసభ సీట్ కొద్దీ రోజులలో పూర్తి కాబోతున్నది. ఆయనను తిరిగి రాజ్యసభకు పంపే ఆలోచనలు బీజేపీలో కనిపించడం లేదు. మరోవంక, గత ఏడాది బిజెపి జాతీయ కార్యవర్గంలో ఆయనకు  స్థానం ఇవ్వలేదు. అప్పటి నుండి బిజెపియేతర సీఎంలను కలుస్తున్నారు.

వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి, మమతా బెనర్జీ ను కూడా ఆయన ఇటీవల కాలంలో కలిశారు. వారిలో ఎవరైనా రాజ్యసభకు పంపవచ్చనే ఆలోచన కావచ్చు. జగన్ నుంచి కానీ మమత నుంచి కానీ ఆయన ఆశించిన స్పందన రాలేదు. దాంతో ఇప్పుడు కేసీఆర్ ను కలిశారని అంటున్నారు. కేసీఆర్ కూడా సుబ్రహ్మణ్యస్వామిని రాజ్యసభకు పంపే సుముఖత చూపించారో లేదో తెలియదు.

అంతకు ముందు సుబ్రహ్మణ్యం స్వామి క్రమం తప్పకుండా జగన్ ను పొగిడేవారు. జగన్ కు అనుకూలంగా చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆయన ఎన్నో ట్విట్లు పెట్టారు. అయితే జగన్ వాటిని పరిగణనలోకి తీసుకోకపోవడంతో ఇప్పుడు ఆయన కేసీఆర్ ను కలిశారని చెబుతున్నారు. అయితే సుబ్రహ్మణ్య స్వామి వల్ల జాతీయ స్థాయిలో పావులు కదిలే రోజులు లేవు.

అందువల్ల కేసీఆర్ ఆయనతో కలిసినా ఎవరూ పెద్దగా స్పందించడం లేదు. కేసీఆర్ ఢిల్లీ నుండి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నియోజకవర్గం వారణాసికి వెళ్లి అఖిలేష్ యాదవ్ కు మద్దతుగా జరిగే ప్రచారంలో పాల్గొంటారని కూడా టి ఆర్ ఎస్ వర్గాలు ప్రచారం చేశాయి. పైగా, మమతా బెనర్జీతో కలసి ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు. అయితే ఆమె వారణాసి ప్రచారంపై  వెళ్లినా, కేసీఆర్ వెళ్ళలేదు.

ఎన్నికల ప్రచారానికి వారణాసి ఎందుకు వెళ్లలేదో….

కేసీఆర్ వస్తారని ఆయన ఫోటోటోలతో టి ఆర్ ఎస్ కట్ అవుట్ లను కూడా అక్కడ ఏర్పాటు చేసింది. ఆయనకు ఆహ్వానం రాక వెళ్లలేదా? లేక మరే కారణంతోనైనా ఆయన వెళ్లలేదా అనే విషయంపై స్పష్టత లేదు. ఈ విషయమై ఆయన సన్నిహితులు మౌనం దాలుస్తున్నారు.

శుక్రవారం రాంచి వెళ్లిన, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి శిబూ సొరేన్ ను కలసిన ఆయన ఆ తర్వాత ఇప్పట్లో మరో కూటమి ఆలోచన లేదని చెప్పడం గమనార్హం. బిజెపి, కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా ఇప్పటి వరకు ఎలాంటి రాజకీయ కూటమి(ఫ్రంట్) ఏర్పాటు కాలేదని స్పష్టం చేశారు.

పైగా, బిజెపికి, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు జరగడం లేదని కూడా చెప్పారు. ఆ విషయమై త్వరలో చెబుతానని అంటూ దాటవేశారు. ఈ సందర్భంగా త్వరలోనే మరికొందరు నేతలను కలుస్తామని చెబుతూ  దేశంలో మరింత మెరుగైన అభివృద్ధి జరగాలని కేసీఆర్‌ ఆకాంక్షించారు. దేశానికి కొత్త దిశా నిర్దేశం కావాలని పేర్కొంటూ తాము ఎవరికీ వ్యతిరేకం కాదు.. అనుకూలం కాదని తేల్చిచెప్పడం గమనార్హం.

దేశ హితం కోసమే తమ ప్రణాళిక అని తెలిపారు. తనకు పార్టీలతో, నాయకులతో పని లేదని బిజెపికి వ్యతిరేకంగా ప్రజలను సమాయత్త పరుస్తానని ఆయన తరచూ చెబుతుంటారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కేసీఆర్ వాదనకు వేదికగా ఎంతో ఉపయోగపడేవి. ప్రజలను బిజెపికి వ్యతిరేకంగా సమాయత్త పరిచేందుకు ఈ ఉప ఎన్నికల ప్రచారాన్ని ఉపయోగించుకుంటే బాగుండేది కానీ ఆయన ఏ ఒక్క సభలో కూడా పాల్గొనలేదు.

నాయకులతో, పార్టీలతో పని లేదని చెబుతూనే కేసీఆర్ మాత్రం నాయకుల చుట్టూనే తిరుగుతున్నారు తప్ప ప్రజల వద్దకు నేరుగా వెళ్లడం లేదు. తాను జాతీయ స్థాయి నాయకుడిగా ఎదగాలనుకుంటే కనీసం ఢిల్లీలోనైనా బహిరంగ సభ ఏర్పాటు చేసి ఉండాలి…. అదీ చేయలేదు… బహుశ బిజెపికి వ్యతిరేకంగా ప్రజలను సమాయత్త పరిచే సమయం ఇంకా రాలేదేమో…..

Related posts

Good Bye: ముద్రగడ పద్మనాభం లేఖ పూర్తి పాఠం

Satyam NEWS

హనీ ట్రాప్ ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు

Bhavani

ఏపిలో అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ అమలుకు జీవో జారీ

Satyam NEWS

Leave a Comment