33.7 C
Hyderabad
February 13, 2025 21: 18 PM
Slider ముఖ్యంశాలు

మేము చచ్చిపోవాలనుకుంటున్నాం అనుమతివ్వండి

letter to president

గౌరవనీయులు, భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గారికి నమస్కారములు

మేము ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో మేమంతా ఉన్నపళంగా రోడ్డున పడ్డాం. రాష్ట్ర విభజనతో రాజధాని కూడా లేని ఆంధ్రప్రదేశ్ కు రాజధాని నిర్మాణం కోసం మేమంతా ముందుకొచ్చి 33 వేల ఎకరాల భూమిని నాటి తెలుగుదేశం ప్రభుత్వానికి అప్పగించాం.

ఆంధ్రప్రదేశ్ శాసనసభ లో సెప్టెంబర్ 2014 న అమరావతిని రాజధానిగా చేస్తూ అన్ని పార్టీలు ఏకగ్రీవ తీర్మానం చేసాయి.ఈ నేపథ్యంలో ఎలాంటి లాభాపేక్ష లేకుండా అమరావతి నిర్మాణానికి మా పొలాలను ప్రభుత్వానికి ఆనందంగా అందించాం. 2019 ఎన్నికల ప్రచారంలో నాటి ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి గారు రాజధానికి భూములిచ్చిన మమ్మల్ని అభినందించారు. అమరావతే రాజధాని అని మాటిచ్చారు.

తీరా అధికారంలోకి వచ్చాక మాట మార్చారు. కేవలం ముఖ్యమంత్రి , పలువురు వ్యక్తుల స్వలాభం కోసం రాజధానిని విశాఖకు తరలించే కుట్ర చేస్తున్నారు. రాజధాని మార్చవద్దంటూ మా కుటుంబాలతో కలిసి 14 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా మమ్మల్ని పట్టించుకున్నవారు లేరు. మా గోడు వినిపించుకున్న వారు లేరు. పైగా అధికార పార్టీ నేతలు మా త్యాగాన్ని హేళన చేస్తున్నారు.

కులం, మతం, ప్రాంతం అంటగడుతున్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న శాసన సభాపతి, మంత్రులు, ఎమ్మెల్యేలు రాజధాని స్మశానం అని ఒకరు, ఎడారి అని ఇంకొకరు, ఆందోళన చేస్తున్న  రైతులు పెయిడ్ ఆర్టిస్టులు అని మరొకరు ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే మాపై దాడులకు దిగుతున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అర్ధరాత్రి మా ఇళ్లపైకి పోలీసులను పంపి మమ్మల్ని జైళ్లలో పెడుతున్నారు.

అక్రమంగా హత్యాయత్నం కేసులు నమోదు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయంతో మా బతుకులు రోడ్డున పడ్డాయి. మా పిల్లల భవిష్యత్ ప్రశ్నార్థకమైంది. అండగా నిలవాల్సిన ప్రభుత్వమే మాపై కక్ష కట్టింది.. ఒక మంచి కార్యం కోసం మేం చేసిన త్యాగాలకు దక్కిన ఫలితమిది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న అవివేక నిర్ణయంతో భవిష్యత్ లో  ప్రభుత్వాలకు భూములిచ్చేందుకు ఎవరైనా ముందుకొస్తారా. రాజధాని తరలిపోతే మేము జీవచ్ఛవాలుగా మిగిలిపోతాం. ఈ బతుకులు మాకొద్దు. ఇక మాకు మరణమే శరణ్యం. మాయందు దయ ఉంచి కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి సారూ….

Related posts

రైతులను దగా చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

Satyam NEWS

నాగర్ కర్నూల్ జిల్లాలో కరోనా కల్లోలం

Satyam NEWS

వి.ఎస్.యూ లో ఘనంగా యువజనోత్సవాలు

mamatha

Leave a Comment