40.2 C
Hyderabad
April 28, 2024 19: 02 PM
Slider కృష్ణ

Save Amaravati: మేకవన్నె పులుల నిజస్వరూపం బయటపడింది

#Potula Balakotayya

మూడు రాజధానుల ముసుగు తొలగిపోయింది. మేక తోలు కప్పుకున్న పులుల నిజ స్వరూపం బయట పడింది అని వ్యాఖ్యానించారు అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య. బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి గాలి తీసేశారని వ్యాఖ్యానించారు.

మూడు ముక్కలాట లాగా ఇంత కాలం మూడు రాజధానుల జపం చేసిన ముఖ్యమంత్రి, సలహాదారుల జంటనాటకానికి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెరదించారని బాలకోటయ్య అన్నారు. విశాఖే రాజధాని అని బుగ్గన రెడ్డి వ్యాఖ్యానించడంపై  అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ధ్వజమెత్తారు. సీతమ్మను అపహరించేందుకు రావణాసురుడు మారీచుడు అనే ఒకే ఒక మాయలేడిని మాత్రమే పంపాడు. రాజధాని అమరావతిని హత్య చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తన మంత్రివర్గంలోని 25 మంది  మారీచులకూ పని పురమాయించారు. మారువేషాలలో వారిని జనాల్లోకి పంపించారు. మూడు రాజధానులతో మూడు ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని నమ్మ బలికిన మాటలు మాయ మాటలు అని తేలిపోయాయి అని బాలకోటయ్య వ్యాఖ్యానించారు.

మధ్యాంధ్ర  ప్రాంతంపై కులముద్రలు, నిందలు వేసి మరో రెండు ప్రాంతాలను మూడేళ్ళుగా రెచ్చగొట్టారు. ఒకపై మరొకరు ప్రాంతీయ కత్తులు నూరుకుంటుంటే, ఆ కత్తుల కోలాటంలో ఓట్లను దండుకోవాలని ఆశపడ్డారు. మూడుముక్కల కార్డుతో పని కాదని తెలిసి, విశాకే రాజధాని అంటూ కొత్త పల్లవి ఎత్తుకున్నారు. రాష్ట్ర ప్రజలను మోసం చేసినట్లు, పారిశ్రామిక వేతలనూ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు అని ఆయన అన్నారు. న్యాయ రాజధాని అంటూ కర్నూలు ప్రజలను మోసం చేసిన జగన్ రెడ్డి నిజస్వరూపాన్ని కర్నూలు జిల్లాకే చెందిన ఆర్ధిక మంత్రి బట్టబయలు చేశారని, కర్నూలులో న్యాయరాజధాని ఇక లేనట్లేనని బాలకోటయ్య చెప్పారు.

వ్యవస్థలను నిర్వీర్యం చేసి, న్యాయస్థానాలకు వక్రభాష్యాలు   చెప్పిన  ఇలాంటి ప్రభుత్వం చరిత్రలో వెతికినా కనిపించదు. అలాంటి వైకాపా ప్రభుత్వాన్ని ఎందుకు నమ్మాలి ? మూడున్నరేళ్ళుగా  రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి … రాష్ట్రానికి మీరెలా  భవిష్యత్తు  అవుతారు? అన్న ప్రశ్నలను  ప్రజలు గడప గడపకు వచ్చే వారిని, స్టికర్ లు అంటించే వారికి సంధించాలి అని ఆయన పిలుపునిచ్చారు.

Related posts

అలెర్ట్ :రాజాసింగ్ హౌస్అరెస్ట్ఉత్తర తెలంగాణలో నెట్ కట్

Satyam NEWS

6,7,8 తేదీలలో మహిళాబంధు

Sub Editor 2

వెయిటింగ్:భారత్ పర్యటనకై ట్రంప్ ఆసక్తి

Satyam NEWS

Leave a Comment