ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సినీ పరిశ్రమకు శరాఘాతంలాంటి నిర్ణయాలు తీసుకోవడం పట్ల మెగాస్టార్ చిరంజీవి తొలి సారిగా స్పందించారు. ఇప్పటి వరకూ స్పందించని చిరంజీవి ఒక్క సారిగా తన ఆవేదన వ్యక్తం చేశారు. అక్కినేని నాగచైతన్య నటించిన లవ్ స్టోరీ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ కు వచ్చిన చిరంజీవి చలనచిత్ర పరిశ్రమ అనుభవిస్తున్న బాధలను ఏకరవుపెట్టారు.
రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సినీ పరిశ్రమ సమస్యలను అర్ధం చేసుకుని తదనుగుణంగా స్పందించాలని ఆయన కోరారు. సినీ పరిశ్రమలో ఉన్న ఒకరిద్దరు హీరోలను చూసి, వారి ఆర్ధిక పరిస్థితి చూసి సినీ పరిశ్రమ మొత్తం బాగుందని అనుకోవద్దని, సినీ పరిశ్రమ అంతా పచ్చగా ఉన్నట్లు భావించరాదని చిరంజీవి అన్నారు.
ప్రత్యక్షంగా వేలాది మంది ఉపాధి పొందుతున్న చలన చిత్ర పరిశ్రమపై ఆధారపడి పరోక్షంగా లక్షలాది మంది జీవనోపాధి పొందుతున్నారని ఆయన అన్నారు. రెక్కడితే గానీ డొక్కాడని వారు సినీ పరిశ్రమలో ఎంతో మంది ఉన్నారని చిరంజీవి అన్నారు. ఎంతో ఖర్చు పెట్టి ఎంతో కష్టపడి సినిమా తీస్తే అది సక్సెస్ అవుతుందో లేదో కూడా చెప్పలేమని ఆయన అన్నారు.
సినీ పరిశ్రమలో కేవలం 15 నుంచి 20 శాతం మాత్రమే సక్సెస్ రేట్ ఉంటుందని ఆయన అన్నారు. మిగిలిన చాలా సినిమాలు నష్టాలలోనే ఉండిపోతాయని చిరంజీవి తెలిపారు. అందువల్ల సినీ పరిశ్రమ అంటే కాసులు కురిపించేది అనుకోవద్దని ఆయన పరోక్షంగా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెప్పారు.
అసలు సినిమాలు తీయాలో వద్దో కూడా తేల్చుకోలేని స్థితిలోకి వెళ్లిపోతున్నామని ఆయన అన్నారు. కలెక్షన్ డబ్బులు అన్నీ ప్రభుత్వమే తీసుకుని నెల రోజుల తర్వాత నిర్మాతలకు ఇచ్చే విధంగా ఏపిలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. దీన్ని చిరంజీవి పరోక్షంగా ప్రస్తావించారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని ఆయన ముఖ్యమంత్రికి సూచించారు.