28.7 C
Hyderabad
April 27, 2024 06: 28 AM
Slider ప్రత్యేకం

లారీలకు లారీలు తరలిపోతున్న రేషన్ బియ్యం

#kodalinani

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్రమంగా తరలిపోతున్న రేషన్ బియ్యం పెద్ద ఎత్తున పట్టుబడుతుండటం చర్చనీయాంశం అయింది. దీనిపై అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే వ్యాఖ్యానిస్తుండటంతో పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలాగా మారిపోయింది.

రాష్ట్రంలో ఏదో ఒక చోట రోజుకు రెండు నుంచి మూడు లారీల రేషన్ బియ్యం పట్టుపడుతున్నాయి. ప్రభుత్వం నియమించిన రేషన్ బియ్యం సరఫరా కాంట్రాక్టర్లే రేషన్ బియ్యం అక్రమ తరలింపులో పట్టుపడుతుండటం ఆసక్తికరమైన అంశం. రేషన్ బియ్యాన్ని యథేచ్ఛగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న అనంతపురం జిల్లా పౌరసరఫరాల శాఖ కాంట్రాక్టర్ పై ఏపి సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఎండి జీ.వీరపాండ్యన్ వేటు వేశారు.

ఈ మేరకు ఆయన అనంతపురం జాయింట్ కలెక్టర్ కు శుక్రవారంనాడు ఆదేశాలు పంపారు. అనంతపురంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తూ ఇటీవల పెద్ద ఎత్తున స్టాక్ పట్టబడ్డ విషయం తెలిసిందే. ఇలా రేషన్ బియ్యం అక్రమ రవాణాకు ముఖ్య కారణం స్టేజి వన్ కాంట్రాక్టర్ అయిన కంచి పరమేశ్వరరెడ్డి అని నిర్ధారిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. కంచి పరమేశ్వరరెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు అయినందున ఆయనను ఆ బాధ్యత నుంచి తప్పిస్తున్నట్లు సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఎండి తెలిపారు.

ఆయనతో బాటు ఈ కేసుతో సంబంధం ఉన్న స్టేజి 2 ట్రాన్స్ పోర్టు కాంట్రాక్టర్ కె.జోసఫ్ కమలేషన్, ఈ కాంట్రాక్టర్ వద్ద పని చేసే ఎల్లనూరు మాదాసు జాన్సన్, స్టేజ్ వన్ కాంట్రాక్టర్ పరమేశ్వరరెడ్డి ప్రతినిధి ముల్లా సర్వర్ బాషా, తాడిపత్రి ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్ చార్జి కె.నవీన్ కుమార్, డేటాఎంట్రి ఆపరేటర్ ఉయ్యాల ముత్యాల రెడ్డి, సెక్యూరిటీ గార్డు సి ప్రకాష్ కూడా ఇందులో ఉన్నారని నిర్ధారించారు.

వీరందరిపై తక్షణమే చర్య తీసుకుని తమకు చెప్పాలని అనంతపురం జాయింట్ కలెక్టర్ ను సివిల్ సప్లయిస్ ఎండి ఆదేశించారు. అధికార పార్టీ పెద్దలకు సన్నిహితుడైన పరమేశ్వరరెడ్డి పట్టుబడటంతో బాటు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి వ్యాఖ్యలు మంత్రి కొడాలి నానిని ఇరకాటంలో పెడుతున్నాయి. మంగళగిరి పౌర సరఫరాలశాఖాధికారుల అక్రమాలకు అంతులేదని ఆయన ఆరోపించారు.

వారానికి రెండు, మూడు లారీల రేషన్ బియ్యం పట్టుబడుతోందని తెలిపారు. ఒక్క నియోజకవర్గంలోనే ఇంత పట్టుబడితే జిల్లా వ్యాప్తంగా ఎంత బియ్యం అక్రమంగా తరలుతోందని ఆయన ప్రశ్నించారు. అక్రమ రేషన్ పట్టుబడితే నామమాత్రపు కేసులు పెడుతున్నారని ఆయన విమర్శించారు.

మంగళగిరి నియోజకవర్గంలో మధ్యాహ్న భోజన పథకం అధ్వానంగా ఉందని రామక్రిష్ణారెడ్డి మండిపడ్డారు. వీటన్నింటితో బాటు బిజెపి నాయకులు నేరుగా మంత్రి కొడాలి నానిపైనే ఆరోపణలు చేశారు. పౌర సరఫరాల శాఖలో  నాలుగు వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని వారు ఆరోపించారు. వీటన్నింటి దృష్ట్యా మంత్రి కొడాలి నాని ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

Related posts

శాస్త్ర‌, సాంకేతిక రంగాల్లో బ‌హుముఖ ప్ర‌గ‌తి…

Satyam NEWS

బీజేపీ, జేడీస్ మధ్య పొత్తు

Bhavani

రైతులంతా రుణ మాఫీ సౌకర్యాన్ని అందుకోండి

Satyam NEWS

Leave a Comment