28.7 C
Hyderabad
April 27, 2024 03: 15 AM
Slider విజయనగరం

జాతీయ‌ చేనేత దినోత్స‌వ వేడుక‌లు: విజయనగరంలో ర్యాలీ

#handloomday

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు విజయనగరంలో 8వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం 8.30 గంటలకు నగరంలో ని గంట స్థంభం నుండి కోట జంక్షన్ వరకు ఆప్కో ఉద్యోగులు, చేనేత జౌళిశాఖ ఉద్యోగులు, పెద్ద సంఖ్య‌లో చేనేత కార్మికులు ర్యాలీ నిర్వ‌హించారు. చేనేత పరిశ్రమకు చేయూతనివ్వాలని, ఈ సంద‌ర్భంగా ప్రజలకు విజ్ఞ‌ప్తి చేశారు.

అనంత‌రం స్థానిక బాబామెట్ట న‌ల్ల‌చెరువు వ‌ద్ద‌నున్న శిల్పారామంలో స్టాల్స్ ఏర్పాటు చేసి,  ఆప్కో వారి వస్త్రప్రదర్శనను జిల్లా అధికారులు ప్రారంభించారు. ప్ర‌త్యేకంగా 30 శాతం డిస్కౌంట్‌తో వ‌స్త్రాల‌ను విక్రయించారు. చేనేత దినోత్స‌వం సంద‌ర్భంగా, నేత కార్మికులు కాలెపు వీరభద్రరావు (కోటగండ్రేడు), నక్కిన బసవరాజు (కుమిలి), పేరిశెట్టి సీతారాం ((కోటక్కి)  దొంతం సీతమ్మ (బొప్పడాం) ను సన్మానించారు.

ఈ సంద‌ర్భంగా ఆప్కో విజ‌య‌న‌గ‌రం డివిజ‌నల్ మార్కెటింగ్ ఆఫీస‌ర్ ప‌తంగి సోమేశ్వ‌ర్రావు మాట్లాడుతూ, చేనేత దినోత్సవ వేడుక‌ల్లో భాగంగా 8వ తేదీ సోమ‌వారం నుండి ఈనెల‌ 18వ తేదీ వ‌ర‌కు వరకు, ప‌ది రోజుల‌పాటు ప్రజల సౌకర్యార్ధం గంట స్థంభం దగ్గ‌ర‌లోని (ఎస్.కె.ఎం.ఎల్ హోటల్ ప్రక్కన)  ఆప్కో హ్యాండ్లూమ్ హౌస్ నెం – 1 (ఫోన్ నెం. 08922 – 272180) లో ప్ర‌ద‌ర్శ‌న‌ను కొన‌సాగిస్తామ‌ని  తెలిపారు. 

ఈ విక్రయశాలల్లో తెలుగు రాష్ట్రాలలోని చేనేత కళాకారులచే చేనేత మగ్గం పై నేసిన పోచంపల్లి, ఇక్కత్ పట్టుచీరలు, ధర్మవరం, ఉప్పాడ, సిల్క్ చీరాల, మాధవరం, చీరాల, వెంకటగిరి జరీ చీరలు, రాజమండ్రి, బందరు, పోచంపల్లి, మంగళగిరి కాటన్ చీరలు, డ్రెస్మెటీరియల్స్, దోవతులు, లుంగీలు, దుప్పట్లు, నవ్వార్లు, రెడీమేడ్ షర్ట్ లు, పొందూరు కాటన్ మరియు పట్టు షర్టింగ్, డోర్ మెట్లు, కార్పెట్లు మొదలగు సరికొత్త వస్త్రరకములు తగ్గింపు ధరలలో లభిస్తాయ‌ని చెప్పారు.

ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి చేనేత పరిశ్రమకు చేయూత అందించాల‌ని ఆయ‌న కోరారు. ఈ కార్యక్రమంలో చేనేత సంఘ ప్రతినిధులు, ఆప్కో సిబ్బంది మరియు చేనేత జౌళిశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

ఘనంగా ఉక్కుమనిషి సర్దార్ పటేల్ జయంతి

Satyam NEWS

మరో యువతిపై ఇంట్లోనే అత్యాచార యత్నం

Satyam NEWS

కార్మిక హక్కులు కాలరాస్తున్న కాంట్రాక్టు ఉద్యోగాలు

Satyam NEWS

Leave a Comment