33.7 C
Hyderabad
April 28, 2024 23: 25 PM
Slider ప్రత్యేకం

విశాఖను రాజధానిగా ఎవరూ కోరుకోవడం లేదు

#nadendlamanohar

విశాఖలో రాజధాని ఏర్పాటు చేయాలని ఎవ్వరూ కోరుకోవడం లేదని ముఖ్యమంత్రికి దమ్ముంటే రాజధాని అంశం మీద ఎన్నికలకు వెళ్దాం రమ్మని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సవాలు విసిరారు. నిజాయతీ, చిత్తశుద్ధి ఉంటే ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేశారు. విశాఖలో రాజధాని పెట్టి.. కార్యాలయాలు ఏర్పాటు చేస్తే తమ జీవితాలు మారిపోతాయని ఉత్తరాంధ్ర ప్రజలు భావించడం లేదన్నారు.

రాజధాని అంశంలో మంత్రుల్లోనే సఖ్యత లేదని తెలిపారు. తెనాలి పర్యటనలో భాగంగా మంగళవారం 11వ వార్డు రామలింగేశ్వరపేట, మారీచుపేటల్లో ఏర్పాటు చేసిన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పలువురు కార్యకర్తలకు స్వయంగా పార్టీ క్రియాశీలక సభ్యత్వం అందచేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ”రోడ్డు కూడా వేయలేని ముఖ్యమంత్రి రాజధానుల గురించి మాట్లాడుతున్నారు.

ఉన్న రాజధానిని ఉద్దరించలేకపోయారు. రైతుల త్యాగాలను పక్కనపెట్టి ఈ ప్రాంతంలో అభివృద్ధి లేకుండా చేశారు. ఒక తరానికి భవిష్యత్తు లేకుండా చేసిన ఘనత ఈ ముఖ్యమంత్రిది. ఉత్తరాంధ్ర వాసులు కూడా విశాఖ రాజధాని కావాలని కోరుకోవడం లేదు. పెట్టుబడులు తీసుకువచ్చి నిజాయితీగా ఉపాధి అవకాశాలు కల్పించాలిగాని రోజుకో ప్రకటన చేస్తే పెట్టుబడిదారులు ఎలా ముందుకు వస్తారు.

ప్రాంతాల మధ్య చిచ్చు రాజేస్తున్నారు

మీ మంత్రులే రోజుకో మాట మాట్లాడుతారు. ఒకరు విశాఖ ఎగ్జికూటివ్ క్యాపిటల్ అంటారు. ఇంకొకరు అదే అసలు రాజధాని అంటారు. ముఖ్యమంత్రి నేను కూడా విశాఖ వెళ్లిపోతున్నానని చెబుతారు. ఉత్తరాంధ్రకు చెందిన మంత్రి ఏకంగా మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరతారు. రాష్ట్రాన్ని ఇంకెన్ని సార్లు విభజిస్తారు. ఎన్నిసార్లు అవమానిస్తారు. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి మీ రాజకీయ లబ్ధి కోసం పదే పదే మాట్లాడుతున్నారు.

రాష్ట్ర అభివృద్ధి పట్ల చిత్తశుద్ది లేదు. మీలో నిజాయతీ ఉంటే అమరావతితో పాటు విశాఖ, కర్నూలులను ఒకే విధంగా అభివృద్ధి చేయండి. చేతకాని దద్దమ్మలు, ప్రభుత్వం నడపలేని వ్యక్తులు. రాష్ట్రం విడిపోయి పది సంవత్సరాలు పూర్తయ్యింది. ఇప్పటి వరకు ఏం సాధించగలిగాం. రాజకీయ లబ్ది కోసం పబ్బం గడుపుకుంటున్నారు. జనసేన పార్టీ అప్పడు, ఇప్పుడు ఒకటే డిమాండ్ చేస్తోంది. అది అమరావతే రాష్ట్ర రాజధాని. గత ఎన్నికల్లో ప్రజలు ఓడిపోయారు. రాబోయే ఎన్నికల్లో ఆ ఓటమి నుంచి బయటపడి మార్పు తీసుకురావాలి.

వితంతు ఫించను కోసం ఏడాది ఎదురు చూడాలా?

రాష్ట్రంలో పరిస్థితులు ప్రజలంతా గమనిస్తున్నారు. తెనాలి పర్యటనలో ఎన్నో సమస్యలు మా దృష్టికి వచ్చాయి. ముఖ్యంగా ఎంతో మంది అర్హత కలిగిన లబ్దిదారులకు ఫించన్లు అందడం లేదు. సదరం సర్టిఫికెట్లు కావాలని మెలిక పెడుతున్నారు. ఆ సర్టిఫికెట్ కోసం వెళ్తే రూ. 25 వేలు లంచం అడుగుతున్నారు. అంత లంచం ఇవ్వగలిగే పరిస్థితుల్లో ఉంటే ఫించన్ కోసం ఎందుకు తిరుగుతారు. గతంలో ఎన్నడూ ఇంత దౌర్భాగ్యపు పరిపాలన చూడలేదు.

భర్తను కోల్పోయి కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితుల్లో కూడా వితంతువులు ఏడాది పాటు ఫించన్ కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. ప్రతి నెలా ఖాళీలు గుర్తించి కొత్త సభ్యలుకు ఫించన్లు అందచేయాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. బియ్యం కార్డులు కూడా చాలా మందికి తొలగించారు.

సీఎం స్టిక్కర్ వేస్తేనే సంక్షేమ పథకాలా?

ప్రతిపక్షంగా గళం విప్పుతుంటే మా నాయకుల్ని ఇబ్బంది పెడుతున్నారు. విజయనగరంలో నోటీసులు ఇవ్వకుండా పేదల ఇళ్లు ఎలా తొలగిస్తారు అని ప్రశ్నించినందుకు జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి మీద అట్రాసిటీ కేసు పెట్టారు. భయబ్రాంతులకు గురి చేస్తే ఎవరూ నోరు విప్పరు అనుకుంటే పొరపాటు. జనసేన పార్టీ సామాన్య ప్రజలకు అన్యాయం జరిగిన ప్రతి సారి వారి తరఫున ప్రశ్నించే బాధ్యత తీసుకుంటుంది.

విజయవాడలో ఓ పేద మహిళ ఫించన్ రావడం లేదని మాట్లాడినందుకు కారం చల్లారు. ప్రభుత్వ వేధింపుల వల్ల ఆమె బంధువు నిన్న మరణించారు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హత్యేనని ఆమె కుటుంబ సభ్యులు వాపోతున్నారు. అధికారులు, స్థానిక వైసీపీ నాయకులు వేధింపులకు గురి చేసి చనిపోయేలా చేశారు. వైసీపీని 151 స్థానాల్లో గెలిపించింది దౌర్జన్యాలు, దాష్టికాల కోసమా? ఎన్నికలకు ఏడాది సమయం మాత్రమే ఉంది. ఇప్పటికైనా స్పందించి కొందరికైనా న్యాయం చేయండి. ప్రజల ఓట్లతో ఏర్పడిన ప్రభుత్వాలు ప్రతి ఒక్కరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత ఉంది.

ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేసి ప్రశాంతంగా ఉండే తెనాలి వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నాలు చేయొద్దు. ముఖ్యమంత్రి స్టిక్కర్ అంటించుకుంటేనే సంక్షేమ పథకాలు వస్తాయన్న పిచ్చి ఆలోచనలు మాని అందరికీ న్యాయం చేయాలి. పాలకుల కార్యక్రమాలు ప్రతి ఒక్కరినీ అభివృద్ధి చేసే విధంగా ఉండాలి.

జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం తెనాలిలో ఉత్సాహంగా ముందుకు వెళ్తోంది. మంగళవారం కొల్లిపర మండలంలో 8 గ్రామాల్లో పర్యటించి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎంతో మంది శ్రీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధంతాలు నచ్చి క్రియాశీలక సభ్యత్వం స్వీకరిస్తున్నారు. వీర మహిళలు, వాలంటీర్లు అద్భుతంగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు.

తెనాలి పట్టణంలో ప్రతి వార్డులో పర్యటించాం. మన కుటుంబాల కోసం.. మన అభివృద్ధి కోసం చేస్తున్న కార్యక్రమం ఇది” అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బండారు రవికాంత్, ఇస్మాయిల్  బేగ్, పసుపులేటి మురళీకృష్ణ, తోటకూర వెంకట రమణరావు, జాకీర్ హుస్సేన్, ఎర్రు వెంకయ్యనాయుడు, కొల్లిపర రజని, నాగలక్ష్మి, మల్లిక తదితరులు పాల్గొన్నారు.

Related posts

కేసీఆర్ జగన్ లు కలిసే పోతిరెడ్డిపాడు జీవో

Satyam NEWS

అక్టోబర్ 1న నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేయాలి

Satyam NEWS

మ‌ట్టి గ‌ణ‌ప‌తి విగ్ర‌హాలను పంపిణి చేసిన ఎన్.వై.కే…!

Satyam NEWS

Leave a Comment