42.2 C
Hyderabad
April 26, 2024 18: 16 PM
Slider సంపాదకీయం

ప్రశ్నించగల ధైర్యం ఎవరికైనా ఉందా?

#CM Jagan

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని అభినందించి తీరాల్సిందే. అధికారంలోకి వచ్చి కొద్ది కాలమే అయినా ఐఏఎస్ లకు బాస్ అయిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీసులకు బాస్ అయిన డిజిపి లను ఎంతో బాగా ఆకట్టుకున్నారు.

ఈ రెండు వ్యవస్థలు చేతులో ఉంటే ఇక ఏ ముఖ్యమంత్రి అయినా చేయలేనిది ఏముంటుంది? ఈ ఇద్దరు బాస్ లపై తిరుగులేని పట్టు సాధించడం గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. సమైక్య ఆంధ్రప్రదేశ్ నుంచి చూసినా కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపిలు ముఖ్యమంత్రి ఏ పని చెబితే ఆ పని చేయడానికి వెనుకాడేవారు.

కొన్ని పనులు చేసేందుకు నిరాకరించేవారు. నిబంధనలు అంగీకరించవు సార్ అని కుండబద్దలు కొట్టే వారు. ఆనాటి ముఖ్యమంత్రులు కూడా వారిని ఏం చేయలేకపోయేవారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి వేరుగా కనిపిస్తున్నది.

చూడటానికి ముచ్చటేస్తున్న చిత్రం

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలను తూచా తప్పకుండా పాటించడమే కాకుండా ఆయన మనసులో ఏమనుకుంటున్నారో తెలుసుకుని దానికి అనుగుణంగా ఉన్నతాధికారులు పని చేస్తున్నారు. ముఖ్యమంత్రి తర్వాతి స్థానంలో ఉండే సలహాదారులు, వ్యక్తిగత సిబ్బంది కూడా ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చిమరీ పని చేయిస్తుంటారు.

 ఇది చూడటానికి ముచ్చటేస్తున్నది. ముఖ్యమంత్రి ఆదేశాలు కాకపోతే ఉన్నతాధికారులు మరెవరి మాట వింటారు? వినే వీలు కూడా లేదు. పాలనలో చేయి తిరిగినట్లు చెప్పుకునే నాయకులు కూడా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నుంచి పాలనలో పాఠాలు నేర్చుకోవాల్సిందే.

ఈ ఇద్దరు ఉన్నతాధికారులే కాదు. ఉద్యోగ సంఘాల నాయకులు కూడా ముఖ్యమంత్రి అభీష్టానికి అనుకూలంగానే పని చేస్తున్న దృశ్యం ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తున్నది. ముఖ్యమంత్రి మనసులో ఏమనుకుంటారో తెలుసుకుని మరీ వారు ప్రవర్తిస్తున్నారు.

ఎక్కడా అసంతృప్తి కనిపించడం లేదు

ఉద్యోగులలో కూడా ఎక్కడా అసంతృప్తి కనిపించడం లేదు. అందరూ కూడా ఉద్యోగ సంఘాల నాయకులు ఇచ్చే ప్రకటనలతో ఏకీభవిస్తున్నారు. ఇక ఎమ్మెల్యేలు ఎంపిలు సరే సరి. పార్టీలో ఎక్కడా ఎలాంటి అసమ్మతి లేకుండా అంతా సజావుగా నడుస్తున్నది.

పైగా ముఖ్యమంత్రి పట్ల విధేయత ప్రకటించడానికి నాయకులు పోటీలు పడుతున్నారు. పార్టీ నిర్ణయాలకు ఇప్పటి వరకూ ఎదురుతిరిగిన వారే లేరు. నర్సాపురం ఎంపి రఘు రామకృష్ణంరాజు తప్ప. ముఖ్యమంత్రి కి ఎదురుతిరిగిన అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రహ్మణ్యం ఉత్తర క్షణంలో పదవి కోల్పోయారు.

ఈ రెండు తిరుగుబాట్లు తప్ప ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన నల్లేరుపై నడకలానే సాగుతున్నది. గ్రామ స్థాయి నుంచి ముఖ్యమంత్రి కార్యాలయం వరకూ ఏకతాటిపై నడుస్తున్నారు. ఇది చూడడానికి విచిత్రంగా కనిపిస్తుంది.

ఎందుకంటే ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా జరగలేదు కనుక. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజకీయ వ్యాఖ్యలు చేసినప్పుడు కొందరు చర్చించేందుకు ప్రయత్నించారు కానీ కుదరలేదు. జీవోలో రాజకీయ వ్యాఖ్యలు చేర్చినా ఎవరూ పట్టించుకోలేదు.

దేవాలయాలపై దాడుల అంశం

అదే విధంగా డిజిపి దేవాలయాల అంశాన్ని ప్రతిపక్షాలపైకి నెట్టేసినా కూడా ఎవరూ మాట్లాడలేరు. తెలుగుదేశం, బిజెపిలు తమ కార్యకర్తలపై కేసులు పెట్టారేమిటని అడిగినా పట్టించుకునే అవసరం ఏ అధికారికి లేదు. దేవాలయాలపై దాడుల అంశంతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించడం తప్పు కదా అని ప్రతిపక్షాలనే ప్రశ్నిస్తున్నారు.

 దేవుడి విగ్రహాలను నేనే కాళ్లతో తన్నాను అని ఒక వ్యక్తి చెప్పిన వీడియోలు బయటకు వచ్చాయి. సాధారణంగా అలా చెప్పిన వ్యక్తిపై చర్యలు తీసుకుంటారు కానీ పోలీసులు మాత్రం ఆ వీడియోలను ఎవరు వైరల్ చేశారు అనే అంశంపై దృష్టి సారించారు.

రాయలసీమలో ఒక సంఘటన

గతంలో ముఖ్యమంత్రి పై ఏవో కామెట్లు చేశారని కేసులు పెట్టడం మొదలు పెట్టడం ప్రారంభించగానే అలాంటి వ్యాఖ్యలు ఆగిపోయాయి. అందరిలో క్రమశిక్షణ వచ్చింది. ఇదే రాష్ట్రంలో చాలా చోట్ల జరుగుతున్నది. రాయలసీమలోని ఒక ప్రాంతంలో రోడ్లు బాగా లేవని ఒక ఆటో డ్రైవర్ స్థానిక కేబుల్ టివిలో వ్యాఖ్యానించాడట.

ఆ తర్వాత అతను మూడు రోజులు కనిపించలేదు. ఆ తర్వాత రోడ్లు ఎంతో బాగున్నాయి, మా ఎమ్మెల్యే అద్భుతంగా పని చేస్తున్నాడు అంటూ అదే ఆటో డ్రైవర్ వ్యాఖ్యానించాడట. మూడు రోజులు ఏమైపోయాడని ఎవరూ అడగలేదు… కుటుంబ సభ్యులతో సహా. ఇలా రాష్ట్రంలో ఒక క్రమ శిక్షణ వస్తున్నది.

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి కలిసి వచ్చిన మరో అంశం ఏమిటంటే ఆయన అధ్యక్షుడుగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన సోషల్ మీడియా ఉంది. ప్రతిపక్షాలను ఎండగట్టడానికి ఒక్క క్షణంలో ఏ సమాచారాన్ని అయినా ప్రపంచం మొత్తానికి వ్యాప్తి చేయగల బలమైన సోషల్ మీడియా ఉండటం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి సమాచార వ్యవస్థపై తిరుగులేని ఆధిపత్యం సంపాదించి పెట్టింది.

ఇంతకాలం ప్రధాన స్రవంతి మీడియా గా ఉన్న వాటికి విశ్వసనీయత లేదు అని చెప్పేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించడంతో ఇక ఎవరు ఏం రాసుకున్నా, ఏం చూపించుకున్నా ఎలాంటి ఫలితం ఉండే అవకాశం లేదు. అతి తక్కువ సమయంలో అన్ని వ్యవస్థలను దారిలోకి తెచ్చుకున్న ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని చూసి దేశంలోని మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు నేర్చుకోవాల్సింది చాలా ఉంది.

Related posts

6 నుంచి లాసెట్‌ దరఖాస్తులు

Sub Editor 2

పవన్ కల్యాణ్ పై మాజీ మంత్రి ఘాటు వ్యాఖ్యలు

Satyam NEWS

సీఎం జ‌గ‌న్‌కు సిపిఐ లేఖ

Sub Editor

Leave a Comment