37.2 C
Hyderabad
April 26, 2024 19: 32 PM
Slider జాతీయం

ఒపీనియన్: ఆర్ధికం సరే ఆరోగ్యం మాటలేమిటి?

#Narendra Modi with Media

ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగం అందరిలో ఆత్మస్థైర్యం పెంచే దిశగా సాగింది. 20 లక్షల కోట్ల రూపాయల ఆర్ధిక ప్యాకేజిని ప్రకటించి దేశానికి కొత్త ఊపును అందించారని చెప్పవచ్చు. ఈ ప్యాకేజి జి డి పి (దేశ స్థూల జాతీయోత్పత్తి) లో 10 శాతం వరకూ ఉంటుంది.

ఇప్పటికే అమెరికా, జర్మనీ, బ్రిటన్ తమ జి డి పి లో 10 శాతం నిధులు ప్రావిన్సు లకు(రాష్ట్రాలకు) విడుదల చేశాయి. ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన ప్యాకేజి కరోనాపై పోరాటంలో ప్రతి ఒక్కరికీ చేయూతనిస్తుందనే విశ్వాసం కనిపిస్తున్నది. అదే ప్రధాని కూడా చెప్పారు.

జనం నమ్మాలి.. పాలకులు నిజాయితీగా ఉండాలి

ప్రతి పైసా లబ్దిదారులకు చేరినప్పుడే దీని లక్ష్యం నెరవేరుతుంది. ప్రతి కార్మికుడికి ఇది ప్రాణవాయువులా నిలవాలి. అందుకే మరో స్వదేశీ ఉద్యమానికి మోదీ శ్రీకారం చుట్టారు. దేశీయ ఉత్పత్తులను వాడుకోవడం, పెంచుకోవడం లక్ష్యంగా భారతదేశంలో ఆర్ధిక వ్యవస్థ మరింత ప్రగతి పథంలో సాగుతుందని మనం కూడా విశ్వసించాలి.

ఈ 18 నుంచి ప్రారంభమయ్యే 4 వ దశ లాక్ డౌన్ ఇప్పటిదాకా ఉన్న దాని కంటే పూర్తి భిన్నంగా ఉంటుందని ప్రధాని తెలపడంలో ఉద్దేశ్యం మనం గ్రహించాలి. ఇప్పటి వరకు చేసిన సడలింపుల వల్ల వచ్చిన  వ్యతిరేక ఫలితాలు, పరిణామాలు  కొన్ని రాష్ట్రాలు ప్రధానికి తాజాగా జరిగిన సమావేశంలో తెలియజేశాయి.

లాక్ డౌన్ ఎత్తేసినా క్రమశిక్షణ ముఖ్యం

వీటిని దృష్టిలో పెట్టుకొని, కొత్త సడలింపులు ఉంటాయని భావించాలి. ఇక నుంచి అన్ని ప్రదేశాలలో భౌతికదూరం పాటించడానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. అలాగే మాస్కులు ధరించడంలోనూ ఉంటుంది. లాక్ డౌన్ అమలయ్యే ప్రాంతాలలో మరింత కఠినంగా ప్రభుత్వ చర్యలు ఉంటాయని మనం భావించాలి.

మనతో పాటు  ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు లాక్ డౌన్  సడలింపులు  చేపట్టాయి. ఇది అనివార్యం. సర్వ వ్యవస్థలను స్థంభింపజేసుకొని ప్రపంచంలో ఏ దేశం మనుగడ సాగించలేదు. బతుకు, బతుకుదెరువు రెండూ ముఖ్యమే. సడలింపుల వల్ల ఆర్ధికపరమైన ఫలితాలు ఎలా ఉన్నా, వైరస్ వ్యాప్తి వేగం పుంజుకుంటోంది.

అవకాశం కల్పిస్తే కరోనా విజృభణ గ్యారెంటీ

త్వరలో మళ్ళీ కరోనా విజృభించే అవకాశముందనీ, ప్రపంచ దేశాలన్నీ ఎంతో అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యూ హెచ్ ఓ ) చేసిన హెచ్చరికలను మనం కొట్టిపారెయ్యకూడదు. దక్షిణ కొరియా కరోనాను సమర్ధంగా ఎదుర్కొని ప్రపంచ దేశాల ప్రశంసలందుకుంది.

ఈ దేశాన్ని  స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని అందరు  ప్రణాళికలు చేసుకుంటున్నారు. కానీ, ఈ దేశంలో  లాక్ డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత మళ్ళీ వైరస్ వ్యాప్తి ఊపందుకుంటోంది. ఇక్కడ నైట్ క్లబ్బులు కరోనా వ్యాప్తి కేంద్రాలుగా మారుతున్నాయి.

కొన్ని ప్రాంతాలలో వైరస్ తీవ్రత తక్కువగా ఉండి, గుర్తించలేని పరిస్థితిలో ఉంది. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి. ప్రపంచమంతా తీవ్రస్థాయిలో మళ్ళీ కరోనా సవాల్ ను ఎదుర్కోవాల్సి వస్తుందని డబ్ల్యూ హెచ్ ఓ అత్యవసర విభాగం చీఫ్ మైకేల్ ర్యాన్ అప్రమత్తం చేస్తున్నారు.

గుడ్డిగా సడలింపులు అమలు మొదటికే మోసం

ఈ పరిణామంతో ఎక్కువ మంది ఈ వైరస్ బారిన పడే ప్రమాదముంది. గుడ్డిగా సడలింపులు చేస్తే మూల్యం చెల్లించాల్సిందే. నెమ్మదిగా, క్రమంగా, దశలవారీగా సడలింపులు చెయ్యడమే సరియైన విధానం. భారతదేశంలో రెండవ విడత సడలింపుల వరకూ అలాగే చేశారు.

మద్యం దుకాణాలు ఎత్తివేయడం, వలస కార్మికులను స్వరాష్ట్రాలకు చేర్చే క్రమంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించకపోవడంతో ఉన్నపళంగా మన దేశంలోనూ కరోనా కేసులు పెరగడం ప్రారంభించాయి. మొన్నటి వరకూ సగటున రోజుకు 3000 గా ఉన్న కేసులు ఇప్పుడు 4,000 దాటాయి.

ముందు ముందు ఈ పరిణామం ఎంత తీవ్రంగా ఉంటుందో అనే భయం ప్రజల్లో వ్యాపిస్తోంది. ఇప్పుడు ప్యాసింజర్ రైళ్లు పాక్షికంగా ప్రారంభించారు. ప్రైవేట్ రవాణా వ్యవస్థ కూడా వేగవంతమయ్యింది .సడలింపులు అనివార్యమే అయినప్పటికీ, నిబంధనలు పాటించకపోవడం దురదృష్టకరం.

వలస కార్మికుల విధానంలో ఘోర వైఫల్యం

ముఖ్యంగా వలస కార్మికులు నిబంధనలు పాటించే పరిస్థితిని కల్పించడంలో ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయి. గ్రామీణ ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి పెరగకుండా చూద్దామని ప్రధాని సందేశం ఇచ్చారు. మంచిదే, ఇప్పుడు చుట్టూ నెలకొన్న  పరిస్థితుల్లో అది ఎంతవరకు సాధ్యమన్నది సందిగ్ధమే.

సడలింపులు పెంచుతున్న ప్రభుత్వాలు వైద్య సౌకర్యాలను కూడా వేగవంతం చెయ్యాల్సిన అవసరం ఉంది. చికిత్సా కేంద్రాలు పెరగాలి. సరిపడా సిబ్బందిని    అందుబాటులో ఉంచాలి. పరీక్షలు పెరిగే కొద్దీ, కరోనా సంఖ్య పెరుగుతూ ఉంటుంది. పెరిగే కేసులకు తగ్గట్టుగా వైద్యపరంగా సిద్ధమవ్వాలి.

పీడించే ప్రయివేటు వైద్యానికి ముకుదాడువేయాలి

ప్రైవేట్ వైద్య రంగాన్నీ ఇందులో భాగస్వామ్యం చెయ్యాలి. అదే క్రమంలో, ప్రాణాంతకమైన ఈ వ్యాధిని చూపించి, భయపెట్టి,  రక్తం పిండినట్లు డబ్బులు పిండే వైద్య వ్యవస్థల నుండి ప్రజలను రక్షించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలపై ఉంది. మామూలుగా జలుబని వెళ్లినా, ఎన్నో రకాల పరీక్షలు చేసి, డబ్బులు గుంజే వ్యవస్థల నడుమ , కరోనా విషయంలో ఎలాంటి సవాళ్లు ప్రజలు ఎదుర్కోవాల్సి వస్తుందో? 

ఇటువంటి వ్యవస్థల పై తీవ్ర నిఘా, నియంత్రణ, దండనలు ఉండాలి. నిరుపేదలు, పేదలు, దిగువ మధ్య తరగతి, మధ్య తరగతి వారికి కరోనా సేవలు ఉచితంగా అందించాలి. ప్రభుత్వ పథకాల్లో కరోనాను కూడా చేర్చాలి. యాంటీ బాడీస్, రోగనిరోధక శక్తి పెంచుకోవడం చాలా అవసరం.

ప్రజలు తమ వ్యక్తిగత ఆరోగ్యం దృష్ట్యా ఇక నుండి వీటిపై శ్రద్ధపెడతారనే విశ్వసించాలి. వ్యక్తిగత ఆరోగ్యానికి , సామాజిక ఆరోగ్యానికి , సంపూర్ణ, సమగ్ర భారతదేశ పునర్వైభవానికీ భారతీయతను పాటించడమే మన ఏకైక మార్గం కావాలి. భారతీయతను సంపూర్ణంగా అర్ధం చేసుకుంటే, అన్ని సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. రాజకీయాలకు అతీతంగా, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కలిసి సాగితేనే సత్వర ప్రగతి సాధిస్తాం.

కరోనా పట్ల అప్రమత్తంగా ఉంటూనే మన ప్రతి కదలిక సాగాలి. ఆర్ధిక ప్యాకేజీ స్వాగతించదగినదే అయినా ఆరోగ్య ప్యాకేజీ లేకపోతే అది వృధా అవుతుందని ప్రధాని తో సహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ ప్రముఖులు గుర్తించాలి.

మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

దేవాలయాలపై దాడులను ఆపాలని ధర్మ పరిరక్షణ జైత్రయాత్ర

Satyam NEWS

పొట్టి శ్రీరాములు చిత్ర ప‌ఠానికి పూల‌మాల‌లు వేసిన విజయనగరం ఓఎస్డీ

Satyam NEWS

రహదారులపై కల్వర్టులు, వాగుల వద్ద జాగ్రత్త గా ఉండాలి

Satyam NEWS

Leave a Comment