29.7 C
Hyderabad
May 3, 2024 06: 20 AM
Slider సంపాదకీయం

ఇది రాజకీయ పెగాసెస్

#pegasus

అందరి సెల్ ఫోన్లూ టాప్ చేసి వారి రహస్యాలను తెలుసుకుంటూ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే పెగాసెస్ సాఫ్ట్ వేర్ ను వై ఎస్ జగన్ ప్రభుత్వం వాడుతున్నదా? గత ప్రభుత్వం పెగాసెస్ సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేసినట్లు అధికారికంగా అనధికార ప్రకటన చేసిన జగన్ ప్రభుత్వం వాదన కరెక్టేనని నమ్మితే ఇప్పుడు ఆ పెగాసెస్ సాఫ్ట్ వేర్ ప్రభుత్వం వద్ద ఉన్నదా? అనే ప్రశ్న తలెత్తక మానదు.

అలా కాకుండా ప్రభుత్వం డబ్బుతో ఆ సాఫ్ట్ వేర్ ను గత ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబునాయుడు కొనుగోలు చేసి అధికారంలో నుంచి వెళ్లే సమయంలో దాన్ని కూడా తీసుకుని వెళ్లి ఉంటే తక్షణమే చంద్రబాబునాయుడిపై చోరీ కేసు పెట్టవచ్చు. ఆయనకు చెందిన ప్రాంతాల నుంచి గానీ, ఆయనకు చెందిన వ్యక్తుల నుంచి గానీ పెగాసెస్ సాఫ్ట్ వేర్ ఆనవాలు దొరికితే తక్షణమే చంద్రబాబునాయుడిని అరెస్టు చేయవచ్చు.

చంద్రబాబునాయుడిని అరెస్ట్ చేయడానికి జగన్ ప్రభుత్వానికి ఇంతకన్నా మంచి అవకాశం ఉండదు. అందువల్ల తక్షణమే పెగాసెస్ ఎక్కడ ఉందో ప్రజలకు వెల్లడించాలి. అది ప్రభుత్వం వద్దే ఉంటే దాన్ని మూడేళ్ల నుంచి వాడుతూ ఉంటే జగన్ ప్రభుత్వం కూడా తప్పులో భాగస్వామిగా తేలుతుంది. మాదగ్గర ఉంది కానీ మేం వాడటం లేదు అని అయినా చెప్పాలి. లేదా చంద్రబాబు ఎత్తుకెళ్లాడు అని అయినా చెప్పాలి.

‘‘ఇది కుట్ర’’ అని అర్ధం అయితే మాత్రం కష్టమే

ఏదైనా నేరమే కాబట్టి ఎంతో సులభంగా పరిష్కరించగల ఈ నేరాన్ని వెంటనే బహిరంగ పరచాలి. అలా కాకుండా మమతా బెనర్జీ తన అసెంబ్లీలో చేసిన ప్రకటన ఆధారంగా రాజకీయ లబ్ది పొందాలని జగన్ ప్రభుత్వం భావించి చంద్రబాబునాయుడిపై బురద చల్లాలని ప్రయత్నిస్తే మాత్రం రానున్న రోజుల్లో అంటే ప్రజలకు ‘‘ఇది కుట్ర’’ అని అర్ధం అయిన రోజు జగన్ ప్రభుత్వం దోషిగా నిలబడాల్సి వస్తుంది.

అసలు పెగాసెస్ వ్యవహారంలో జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా అంత గొడవ జరుగుతున్న నేపథ్యంలో మమతా బెనర్జీగానీ, వై ఎస్ జగన్ గానీ పెగాసెస్ సాఫ్ట్ వేర్ ను చంద్రబాబునాయుడు కొనుగోలు చేశాడని ఎందుకు చెప్పలేదు? పోనీ సుప్రీంకోర్టు నియమించిన స్వతంత్ర విచారణ సంస్థకు ఆ ఆధారాలను వీరిద్దరూ ఇవ్వగలరా? ఇప్పటి వరకూ ఇవ్వకపోతే ఇప్పుడు ఇవ్వగలరా?

పెగాసెస్ సాఫ్ట్ వేర్ ను చంద్రబాబునాయుడు కొనుగోలు చేసి ఎవరిపై వాడారో కూడా రికార్డులు ఉంటాయి. అందువల్ల ఆ రికార్డులను బయట పెట్టడం ద్వారా చంద్రబాబునాయుడిని బహిరంగంగా కూడా శిక్షించవచ్చు. ఇలాంటి కార్యక్రమాలన్నింటికి వదిలేసి కేవలం రాజకీయ లబ్ది కోసం మాత్రమే పెగాసెస్ వ్యవహారాన్ని వాడుకోవాలని చూడటం ఎవరికి మంచిది కాదు.

పెగాసెస్ వ్యవహారం పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనధికారికంగా సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం చూస్తూ దీన్ని రాజకీయంగా మాత్రమే వాడుకోవాలని ఆ పార్టీ ప్రయత్నిస్తున్నట్లు స్పష్టం అవుతున్నది. ఇలా ప్రభుత్వ వ్యవస్థలపైనే ప్రజలకు నమ్మకం పోయేలా ప్రవర్తించడం ఎవరికి మంచిది కాదు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కూడా పెగాసెస్ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి తక్షణమే ఆ పని చేయించవచ్చు.  

Related posts

హైదరాబాద్ ట్యాంక్ బండ్ మాదిరిగానే విజయనగరంలో కూడా…!

Satyam NEWS

కోదాడ పట్టణంలో పట్టుబడ్డ చైన్ స్నాచింగ్  దొంగలు

Satyam NEWS

భారత్ బంద్ పిలుపు హాస్యాస్పదం: బీజేపీ విమర్శ

Satyam NEWS

Leave a Comment