27.7 C
Hyderabad
April 26, 2024 06: 22 AM
Slider సంపాదకీయం

వ్యతిరేకత కొనితెచ్చుకుంటున్న ఏపి ప్రభుత్వం

#CM Jagan

ఏదో ఒక కారణంతో తెలుగుదేశం పార్టీ నాయకులకు అరెస్టు చేయడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాటిగా మారింది. అందులోనూ సీబీసీఐడి పోలీసులు తెల్లవారు జామున దాడి చేయడం అరెస్టులు చేయడం అనేది రెగ్యులర్ గా జరుగుతుండటం పోలీసుల ప్రతిష్టను దిగజారుస్తున్నది. ఒకరా ఇద్దరా… తెలుగుదేశం పార్టీలో చురుకుగా ఉండే నాయకులందరిని వరుస పెట్టి అరెస్టులు చేస్తుండటం ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి తీవ్ర వ్యతిరేకత కొనితెచ్చిపెడుతున్నది.

ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నా దాన్ని గమనించే పరిస్థితిలో పాలకులు లేకపోవడం దురదృష్టకరం. తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక్కో నాయకుడిని అరెస్టు చేస్తూ పోవడంతో ఆ పార్టీ క్షేత్ర స్థాయిలో కూడా బలపడుతున్నది. తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయిలో సానుభూతి వ్యక్తం అవుతున్నది. గత మూడున్నర సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో ఇదే తంతు జరుగుతున్నది.

స్వయంగా అధికార వైసీపీకి చెందిన పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజును అరెస్టు చేయడం, ఆయనను లాకప్ లో చిత్రహింసలకు గురిచేశారని సుప్రీంకోర్టు వరకూ కేసు వెళ్లడం నాటి నుంచి ప్రభుత్వ ప్రతిష్ట దిగజారిపోతున్నది. మరీ ముఖ్యంగా పోలీసు వ్యవస్థకు తీరని చెడ్డపేరు వస్తున్నది. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏ కేసు పెడుతున్నా కోర్టుల్లో నిలవడం లేదు.

ఎన్నో కేసులు ప్రాధమిక స్థాయిలోనే కోర్టులు కొట్టేస్తున్నా పోలీసుల వైఖరిలో మార్పు రావడం లేదు. అధికారంలో ఉన్నవారు ఆదేశాలు ఇవ్వడం, వాటిని పాటించడం అనే రెండు చర్యలు ప్రస్పుటంగా కనిపిస్తున్నాయి. పోలీసులపై నమ్మకం సన్నగిల్లడానికి ఇది ప్రధాన కారణం. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ఏదో కక్ష సాధిస్తున్నట్లు ప్రవర్తించడం వల్ల పోలీసుల పట్ల సాధారణ ప్రజానీకానికి గౌరవం తగ్గుతున్నది.

పోలీసులే చట్టాన్ని పాటించకపోతే ఎలా?

ఇది ప్రభుత్వానికి, పోలీసులకు మంచిది కాదు. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే పోలీసులే చట్టాన్ని పాటించకపోతే ఎలా? ఇదే ప్రశ్న పలు సందర్భాలలో వ్యక్తం అవుతున్నది. కరోనా సమయంలో మాస్క్ అడిగిన డాక్టర్ సుధాకర్ ను సస్పెండ్ చేసి, ఆ తర్వాత అరెస్టు చేసి, పిచ్చివాడిగా ముద్రవేసి పిచ్చి ఆసుపత్రిలో చేర్చినప్పుడు రాష్ట్రంలో చాలా ప్రాంతాల నుంచి నిరసన వ్యక్తం కాలేదు.

అప్పటికి పోలీసులు అలా చేస్తారంటే నమ్మేవారు తక్కువగా ఉండే వారు. రానురాను అలాంటి సంఘటనలు పెరిగిపోవడంతో ఇప్పుడు ఏ చిన్న సంఘటన జరిగానా కూడా పోలీసులు అధికార పార్టీ నేతల ఆదేశాలను మాత్రమే పాటిస్తున్నారు అనే అభిప్రాయం ప్రజల్లో ఖరారు అయిపోయింది. తాజాగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడిని అరెస్టు చేయడం ఏదో కక్ష సాధిస్తున్నట్లుగా జరిగింది.

గత కొద్ది నెలలుగా అయ్యన్న పాత్రుడి కుటుంబాన్ని పోలీసులు వెంటాడుతున్నారు. ఏ కేసులో చిక్కుతారా అని ఎదురుచూస్తూ ఉండి ఇలా కక్ష తీర్చుకుంటున్నారు… అనే అభిప్రాయం సాధారణ ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. అయ్యన్న పాత్రుడి కుమారుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు చింతకాయల విజయ్ హైదరాబాద్ ఇంటిపై ఏపీ సీఐడీ పోలీసులు దాడి చేయడం, అక్కడున్న పనిమనిషిపై చెయ్యి చేసుకోవడం తెలిసిందే.

పిల్లలను కూడా వదలకుండా పోలీసులు బెదిరించారని ఆరోపణలు వచ్చాయి. సాధారణంగా అయితే పోలీసులు ఇంతలా చేయాల్సిన అవసరం లేదు. పాలక పెద్దలు కచ్చితమైన ఆదేశాలు ఇవ్వడమే కాకుండా ఇలా చేయాల్సిందే అని వత్తిడి తెస్తే తప్ప పోలీసులు ఈ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు అరెస్టులు చేస్తూపోరు. ప్రభుత్వం ఇంత వ్యతిరేకతను ఎందుకు కొనితెచ్చుకుంటున్నదో అర్ధం కావడం లేదు.

తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో నిర్మూలించాలి అనుకుంటూ ఇలా పోలీసుల ద్వారా చేయిస్తుంటే మాత్రం తమ విధానాన్ని పాలకులు సరిదిద్దుకోక తప్పదు. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో అది సాధ్యం కాదు. ఎంత ఎక్కువ వత్తిడి ఉంటే అంత పైకి వెళ్లడం భౌతికశాస్త్రం మూల సిద్ధాంతం.

Related posts

శ్రీశైలం బ్రహ్మోత్సవాల్లో రాజకీయం తగదు

Satyam NEWS

కేంద్ర బడ్జెట్లో ఏపీకి మళ్ళీ మొండి చెయ్యి

Bhavani

తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై జగన్ మనుషుల దాడులు

Satyam NEWS

Leave a Comment