26.7 C
Hyderabad
April 27, 2024 08: 06 AM
Slider సంపాదకీయం

Atrocious: రాజకీయానికి పట్టిన దరిద్రం ఇది

#Sachin Piolet

స్వార్ధం రాజకీయ నాయకులు ఈ దేశానికి పట్టిన దరిద్రం. కరోనా సమయంలో ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలియని అనిశ్చిత స్థితిలో కూడా దరిద్రపు రాజకీయాలు చేస్తున్నారంటే వారెంత స్వార్ధపరులు? కరోనా కష్టాల్లో ఉన్న ప్రజల్ని గాలికి వదిలేసి రాజకీయాలు చేస్తున్నారంటే వారెంత పనికిమాలిన వాళ్లు?

ముఖ్యమంత్రి పీఠం కోసం రాజస్థాన్ లో జరుగుతున్న రాజకీయం చూస్తుంటే రాజకీయాలంటేనే జుగుప్స కలుగుతున్నది. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ కు 114 బిజెపికి 107 మంది ఎమ్మెల్యేలు ఉండటంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అలవోకగా పడగొట్టిన బిజెపి రాజస్థాన్ లో అంత సులభంగా గేమ్ ఆడలేకపోయింది.

రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీకి 125 మంది బలం (ఇండిపెండెంట్లు మిత్రులతో కలిపి) ఉండగా బిజెపికి 75 మంది (ముగ్గురు స్వతంత్రులతో కలిపి)  బలం మాత్రమే ఉంది. రాజస్థాన్ లో సచిన్ పైలెట్ చేసిన తిరుగుబాటుకు మాకు ఏమిటి సంబంధం అని బిజెపి నాయకులు ప్రశ్నిస్తున్నారు.

బిజెపి వెన్నుదన్ను లేకుండా సచిన్ పైలెట్ ఇంత సాహసం చేస్తారని అనుకోవడం అమాయకత్వమే అవుతుంది. ముఖ్యమంత్రి గెహ్లాట్ విచారణ నోటీసులు ఇప్పించడం వల్లే సచిన్ పైలెట్ తిరుగుబాటు చేశారని ఇందులో తమకు ప్రమేయం ఏమి ఉంటుందని బిజెపి నాయకులు ప్రశ్నిస్తున్నారు.

ముఖ్యమంత్రి పదవి కాకుండా ఉప ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షపదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చినందుకు సచిన్ పైలట్ గత కొద్ది కాలంగా అసంతృప్తితో ఉన్నారు. మధ్య ప్రదేశ్ లో జ్యోతిరాదిత్య సింధియా చూపిన బాటలో నడవాలని ఆయన బిజెపితో సన్నిహితంగా ఉంటున్న విషయం దాచినా దాగని నిజం. ఈ కారణంతోనే ఆయన, ఆయన వర్గం ఎమ్మెల్యేలు బిజెపితో మంతనాలు జరుపుతున్నట్లు ముఖ్యమంత్రి గెహ్లాట్ అనుమానించారు.

ఆ అనుమానంతోనే ఆయన సచిన్ పైలట్ కు రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మధ్య ప్రదేశ్ లో బిజెపి సక్సెస్ అయినట్లే రాజస్థాన్ లో కూడా అవుతామని అనుకున్నారు కానీ కుదరలేదు. కరోనా సమయంలో అసలు ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన, ప్రభుత్వాన్ని కాపాడుకునే చర్యలు చేయడమే దౌర్భాగ్యం.

 ఈ దౌర్భాగ్యంలో పాలుపంచుకున్న పార్టీలు కాంగ్రెస్, బిజెపి. ఈ రెండు పార్టీల దరిద్రపు రాజకీయాలు రాజస్థాన్ కు శాపంగా మారాయి. బిజెపి అధిష్టానంతో బాటు ముఖ్యమంత్రి గెహ్లాట్, ఉప ముఖ్యమంత్రి పైలట్ ఈ దరిద్రపు రాజకీయంలో పాలుపంచుకోవడం విషాదం. కరోనా పూర్తి అయ్యే వరకూ కూడా వేచి చూడలేని ఈ నాయకులు రాజకీయాలలో పట్టిన చీడపురుగులు.

సత్యమూర్తి పులిపాక, చీఫ్ ఎడిటర్, సత్యంన్యూస్.నెట్  

Related posts

కరోనా వైరస్ వ్యాప్తికి ఏ శిక్ష వేస్తారో తెలుసా?

Satyam NEWS

కాథలిక్ చర్చి నన్ మర్డర్ కేసులో ఫాదర్, సిస్టర్ దోషులు

Satyam NEWS

పూర్తి స్థాయిలో సర్వే చేసి పేదలకు న్యాయం చేయాలి

Satyam NEWS

Leave a Comment