నేటి సాయంత్రం శబరిమల గిరులకు సమీపంలోని పొన్నాంబళ మేడుపై మకర జ్యోతి దర్శనం ఇవ్వబోతున్నది. ఈ అద్భుతమైన కాంతిని దర్శించుకోవడానికి కోట్లాది మంది భక్తులు అక్కడకు చేరుకున్నారు. అయ్యప్ప స్వామి కోసం పందళ రాజ వంశీకులు తీసుకుని వచ్చే ప్రత్యేక ఆభరణాలను సాయంత్రం 5 గంటల తరువాత స్వామికి అలంకరిస్తామని, ఆపై స్వామికి తొలి హారతిని ఇచ్చే సమయంలో మకర జ్యోతి, మకర విళక్కు దర్శనమిస్తాయని దేవస్థానం అధికారులు వెల్లడించారు.
తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన దాదాపు 5 లక్షల మందికి పైగా భక్తులు ప్రస్తుతం పంబ నుంచి సన్నిధానం వరకూ క్యూ లైన్లలో, జ్యోతి దర్శనం నిమిత్తం టీబీడీ బోర్డు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో వేచి చూస్తున్నారు. ఇంకా వేల సంఖ్యలో భక్తులు సన్నిధానానికి వస్తుండగా, ప్రధాన పార్కింగ్ ప్రాంతమైన నీలక్కర్ వాహనాలతో కిక్కిరిసిపోయింది. ఈ సంవత్సరం ఇప్పటికే సుమారు 80 లక్షల మందికి పైగా భక్తులు స్వామి దర్శనం చేసుకోగా, మరో వారం రోజుల పాటు గర్భాలయం తలుపులు చెరచే ఉంటాయి. 21వ తేదీన ప్రత్యేక పడిపూజ అనంతరం ఆలయ ద్వారాలను మూసివేస్తామని ప్రధాన తంత్రి వెల్లడించారు.