28.6 C
Hyderabad
September 20, 2020 12: 23 PM
Slider ఆదిలాబాద్

కొమురంభీం జిల్లాలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా

#SandMafia

ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను లారీల్లో నింపుకొని పట్టణాలకు తీసుకెళ్తారా? నో ప్రాబ్లం. ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకెళ్లచ్చు. ఇక్కడి అధికారులు లారీల్లో తీసుకెళ్తే కళ్లు మూసుకుంటారు.

అదే మీరు ఎద్దుల బండిపై తీసుకెళ్లారా… మీపై కేసులే కేసులు. ఇసుక స్మగ్లింగ్ చేస్తున్నారంటూ మీ భరతం పట్టేస్తారు. ఇదంతా ఎక్కడ జరుగుతుందా అనుకుంటున్నారా కొమురంభీం జిల్లా పెంచికల్ పేట్ మండలంలో ప్రతి రోజూ జరిగే తంతు ఇది.

థర్డ్ పార్టీ మామూళ్లు ఇక్కడి ప్రత్యేకత

ఇలాంటి ప్రాంతాలు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఉన్నాయి కానీ పెంచికల్ పేట్ మండలంలో ఒక ప్రత్యేకత ఉంది. నెలవారీ ముడుపులు మాత్రం కచ్చితంగా ఇచ్చేస్తే చాలు.

ఇలా ముడుపులు వసూలు చేయడానికి ధర్డ్ పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. గత సంవత్సరం పెంచికల్ పెట్ మీదుగా హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ తదితర ఇసుక  డిమాండ్ ఉన్న పట్టణాలకు చేరవేస్తూ అక్రమార్కులు కోట్ల రూపాయలు కూడగట్టుకున్నారు.

మళ్ళీ ఈ లక్డౌన్ నుంచి ఈ తతంగం మొదలు పెట్టగా మండల అధికారులకు ఏమి తెలియనట్లు వ్యవహరించారని,  పై అధికారుల ఆదేశాలతో తప్పని పరిస్థితుల్లో వెళ్లి మొక్కుబడిగా దాడులు నిర్వహిస్తున్నారని నియోజకవర్గ స్థాయిలోను గుసగుసలు వినిపిస్తున్నాయి.

బొక్కి వాగు ఇసుకను బొక్కేస్తున్నారు

వివరాలకు వెళ్తే పెంచికల్ పెట్ మండలంలోని లోడ్పల్లి గ్రామ శివారులోని బొక్కివాగు లో ఇసుకను తోడేసి, సమీప గ్రామాల్లో నిల్వ చేస్తున్నారు.

ఇసుకకు బాగా గిరాకీ ఏర్పడిన సమయంలో ఖమ్మం, హైదరాబాద్‌లకు లారీల్లో తరలించి అక్రమంగా కోట్లాది రూపాయలు దండుకుంటూ ప్రభుత్వాదాయానికి గండి కొడుతున్నారు.

మండలంలో ఇసుక ర్యాంపులకు అనుమతి ఉందా?అంటే అదీ లేదని స్పష్టంగా కనిపిస్తున్నాయని అక్కడి ప్రజలు అంటున్నారు. 

అర్ధరాత్రి వేళల్లో పెంచికల్ పెట్ మండల కేంద్రం మీదుగా పోలీస్ స్టేషన్ ముందు నుంచే లారీలు హైదరాబాద్‌కు లారీల్లో వెళుతుంటాయి. అక్రమ దందాపై ఎవరైనా ప్రశ్నిస్తే బేరసారాలు, లేకుంటే బెదిరింపులకు దిగుతున్నారనేది బహిరంగ రహస్యంగా ఉంది.

లారీలు, డ్రైవర్లను పట్టుకుంటే లాభమేమిటి?

శనివారం అర్ధరాత్రి నమ్మదగిన సమాచారం మేరకు లోడ్పల్లి గ్రామ శివారు నుంచి  అక్రమంగా లారీల్లో ఇసుక తరలిస్తున్న క్రమంలో పోలీసులు వెళ్లి పట్టుకున్నట్లు స్థానిక ఎస్సై తెలిపారు.

లారీ డ్రైవర్లు గూడూరు నరేందర్ రెడ్డి, కోర్ని భిక్షపతి, చంద్రకాంత్ రెడ్డి, జవాజి సునీల్ లను అదుపులో తీసుకొని వారిపై కేసులు నమోదు చేశామని దర్యాప్తులో పూర్తి వివరాలు వెల్లడిస్తామని  అన్నారు.

పెంచికల్ పెట్ మండలంలో శనివారం అర్ధరాత్రి సమయంలో మాటువేసి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న నాలుగు లారీలు పట్టుకున్న విషయం బాగుంది కాని ఆ లారీల్లో నింపినటువంటి యంత్రం ఏమైందని స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు.

ఒక్కొక్క లారీలో పదుల టన్నుల ఇసుక నింపుతారు. అలాంటి లారీలు నాలుగు ఉన్నాయని అవి లేబర్లతో నింపలేరని, తప్పకుండా యంత్ర సహాయం తోనే నింపుతారని, పోలీసులు కావాలని ఆ యంత్రాన్ని వదిలివేసినట్టు తెలుస్తుందని మండలవాసులు విమర్శలు వినవస్తున్నాయి.

పోలీసు యంత్రాంగాన్ని ప్రశ్నిస్తున్న ప్రజలు

పైసలుంటే ఏదైనా చేయచ్చు అన్నట్లు గా కావాలని పోలీసులు ముడుపులు తీసుకొని యంత్రాన్ని విడిచిపెట్టారని మండలవాసులు అంటున్నారు.

దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పిన పోలీసులు ఎన్ని రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి అసలు మాఫియాను పట్టుకుంటారో చెప్పాలని పలు రాజకీయా పార్టీల ప్రముఖులు విమర్శించారు. 

అక్రమాలకు చెక్ పెట్టె అధికారులు తమ నిజాయితీని ఇప్పుడు ఈ దర్యాప్తులో వెల్లడవుతుందని కొంతమంది ప్రతిపక్ష నేతలు ఆరోపించారు.

ఈ విషయంలో ఇసుక మాఫియాలతో అధికారుల అండ లేకపోతే సంవత్సరాలుగా దర్జాగా ఎలా కొనసాగుతుందని కూడా పలు పార్టీల నేతలు అన్నారు.

హైదరాబాద్ లో ఇసుకకు భారీ డిమాండ్

ఈ ఇసుకను హైదరాబాద్ లో రూ.60 వేలు నుంచి రూ.లక్షకు విక్రయిస్తున్నట్లు సమాచారం. వరదలు తగ్గుముఖం పట్టాక దాదాపు ముప్పై కి పైనే లారీల ఇసుకను తరలించినట్లు తెలుస్తోంది.

ఇపుడు ఇసుక అవసరం వున్న వారెవరైనా తమ పేరు, స్టాక్‌ యార్డ్‌ పేరు, ఏ ప్రదేశానికి, ఏ రోజు ఇసుక తీసుకునిపోవాలో ఆ ప్రదేశం, ఇసుకను తీసుకోనిపోయే లారీ నంబర్‌, ఛాసిస్‌ నంబర్‌ తో సహా, ఆ లారీ ఏ ఏ మార్గాల ద్వారా వెళ్తుందో అనే వివరాలు పేర్కొంటూ ముందుగా రిజిస్టర్‌ చేసుకోవాలి.

ఇలా నమోదు చేసుకున్న తరువాత, స్టాక్‌ యార్డ్‌ దగ్గరి నుండి ఇసుక తీసుకుని బయలుదేరిన లారీ, ఇసుకను అన్‌ లోడ్‌ చేసేవరకు అంతా రెవిన్యూ, అర్‌.టి.వో, పోలీస్‌, చెక్‌ పోస్ట్‌, గనులశాఖ విజిలెన్స్‌ ల పర్యవేక్షణలో సాగుతుంది.

 ఒకవేళ ఏదైనా వాహనం లోపాయికారిగా వ్యవహరించినా, అది కచ్చితంగా బయట పడుతుంది. కారణం,లారీ వెళ్ళే ప్రతి మజిలీ దగ్గర ఆన్‌ లైన్‌ లో వివరాలు నమోదవుతాయి.

తప్పుడు పనిచేసి పట్టుబడిన లారీ యజమానికి యాభై నుండి లక్ష రూపాయల దాకా జరిమానా విధిస్తారు. ఆ వ్యవహారం కూడా ఒకటి రెండు సార్ల కంటే మించితే లారీని శాశ్వతంగా సీజ్‌ చేస్తారు.

అమాయకులపై కేసులతో ఇసుక మాఫియా ఆగుతుందా?

అక్రమ ఇసుక రవాణాను పూర్తిగా బంద్ చేయించాలని టిడిపి నాయకుడు గుళ్ళపల్లి ఆనంద్ డిమాండ్ చేశారు. లోడ్పల్లి ఇసుక రవాణాలో అమాయకులను, రోజువారీ కూలికి వచ్చే డ్రైవర్లపై కేసు బనాయించి అసలు మాఫియాను గుర్తించలేకపోవడం బాధాకరమని ఆయన అన్నారు.

విచారణలో మాఫియాను పట్టుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారుల ఆదేశాలు వస్తేనే స్పందించే అధికారులు ఈ మాఫియా వెనుక ఎవరి హస్తముందో విచారణలో బయటపెట్టాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు డా.పాల్వాయి హరీష్ అన్నారు.

లారీలల్లో నింపిన ఇసుకను సీజ్ చేయడం హర్షించదగ్గ విషయమే కానీ అక్కడున్న మరికొన్ని వాహనాలు, జేసిబి ని వదిలివేయడంలో ఆంతర్యం ఏమిటో చెప్పాలని ఆయన అన్నారు. అధికారులు పూర్తిగా టీఆరెస్ లీడర్లకోసమే పనిచేస్తున్నట్లు,ఇసుక మాఫియాలో అసలు సూత్రదారులేవరో పట్టుకోవాలని ఆయన కోరారు.

ఇప్పటికే ఉన్నత స్థాయి రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశామని,త్వరలోనే ఈ విషయంలో చట్టబద్ధంగా ముందడుగు వేసి నిందులను పట్టుకునే వరకు వదిలే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు.

Related posts

టెంపరరీ:కూలిన స్టేడియం గ్యాలరీ 50 మందికి గాయాలు

Satyam NEWS

కొల్లాపూర్ లో నాటు సారా స్థావరాలపై ఎక్సైజ్ దాడులు

Satyam NEWS

అద్వితీయుడు, క్రికెట్ ధీరుడు ధోనీ

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!