27.7 C
Hyderabad
April 26, 2024 05: 56 AM
Slider కవి ప్రపంచం

వసంతంలో ఉన్నంత సేపూ..

#Sailaja Mitra

ప్రపంచం
వసంతంలో ఉన్నంత సేపూ
తైల వర్ణచిత్రంలా ఉంటుంది..
అల్లిబిల్లిగా అల్లుకునే
ఒక ఆహ్లాద గీతంలా ఉంటుంది
ఉగాది ఒక పండగ కాదు
వసంతం రచించిన ఒక మహాకావ్యం
గ్రీష్మంతో పెనవేసుకున్న సరికొత్త వనం..

ప్రకృతిలోనే
స్వరపేటిక ఉందేమో..
లేకుంటే
కోయిల కంఠం నుండి
ఇన్ని శబ్ధ చిత్రాలు
ఇన్ని భాషా స్వప్నాలు
వీనుల విందై
రాగయుక్తంగా
ఎలా కదిలి వస్తుంటాయి?
ఆమనిని ఆక్రమిస్తుంటాయి..

జీవితపు కుంచెపై అద్దిన అనుభవాలు
ఈ షడ్రుచులు..
మనసు చెట్టుకు వేల్లాడే వెండి కాసులు
ఈ ఆనందాలు..
మామిడి తోరణాలు, వేప చిగుళ్ళు,
పసుపు పచ్చని గుమ్మాలు
ముత్యాల ముగ్గులు అన్నీ
ఇల్లాలి నుదుటి అద్దమ్మీద నుంచి జాలువారే
బంగారు వర్ణపు చెమట చుక్కలు..

ఎన్నో భయాలు తర్వాత
హృద్యమైన సంవత్సరాది గీతం వినిపిస్తోంది..
ఎన్నెన్నో సంశయాలు తరలిపోయి  
ఈ సంతోష సమయాన్ని అందించింది..
జీవన రాగంలో
విజయమో, వీరస్వర్గమో
తెలియని ఈ ప్రాణాలకు
ఉగాది ఉత్సాహం ఉరకలేస్తోంది.
బంధుమిత్రుల సమాగమాన్ని అందుకుంటోంది…
భయాలన్నీ నిర్భయాలుగా మారుతున్నాయి.

పండుగ ఏదయితేనేమి?
అందరూ సంతోషంగా ఉండటమే కదా అంతరార్థం
ఉగాది అంటే యుగయుగాల సాంప్రదాయం
ఉగాది అంటే ఊయలంటి స్వచ్ఛమైన ప్రయాణం.

ఈ ప్రయాణంలో
రుతువులన్నీ నావికులు..
అక్షరాలన్నీ ప్రయాణీకులు
జీవితాన్ని నిరంతరం మోసే ఈ నావ
పండుగలానే సాగాలనేదే నా కోరిక..

శైలజామిత్ర, హైదరాబాద్‌

Related posts

ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో వివేకానంద జయంతి

Satyam NEWS

లక్ష పత్రి పూజా కార్యక్రమంలో ఎమ్మెల్సీ తోట

Bhavani

22 న దేశ వ్యాప్తంగా ఒక్క రోజు బ్యాంక్ ల సమ్మె

Satyam NEWS

Leave a Comment