30.3 C
Hyderabad
April 16, 2021 13: 02 PM
Slider కవి ప్రపంచం

ఓ మహిళా..!

#Purimalla Sunanda Khammam

సమాజంలో సగ భాగానివి

సహనానికి మరో రూపానివి

సంఘటిత అసంఘటిత రంగంలో

ఉత్పాదకతకు మూలాధారానివి

సమస్యల ఆకాశంలో కమ్మిన

సవాళ్ల మబ్బుల్ని ఛేదిస్తూ

ఉనికిని చాటుకుంటున్న 

నిత్య పోరాట చంద్రికవు!

ధృవతారలుగా నిలిచిన

నీ జాతి  అడుగు జాడల్లో

అస్తిత్వానికి బాటలు పరుచుకుని

ఆశయాల సాధనకై శ్రమిస్తున్న

అలుపెరుగని బాటసారివి!

అడుగడుగునా ఎదురవుతున్న

ఆధిపత్యపు పోరును

మొక్కవోని ధైర్యంతో ఎదుర్కొంటూ

వ్యక్తిత్వ పతాకాన్ని ఎగురవేస్తున్న

సాధికారత నిర్వచనానివి!

ఎత్తుగడల పద్మవ్యూహాలెన్ని పన్నినా

యుక్తుల మేధోమథనం గావిస్తూ

శక్తివంతమైన మహిళా జ్యోతిగా

ప్రకాశిస్తున్న ఆత్మ స్థైర్య కిరణానివి!

నీ జీవన యవనికపై

వెదజల్లిన అమానాల చీకట్లపై

మండే అగ్ని శిఖలాంటి

నీ హృదయాన్ని ఎక్కుపెట్టి

భవిత వెలుగులు చిత్రించుకుంటున్న

అంతఃశ్చేతనా స్ఫూర్తి శిఖరానివి!

నీవే  నీవే  సాటి…

ఓ.మహిళా

నిన్నటి తరానికి వారధివి

రేపటి తరానికి సారధివి..

నీ కోసం నీవు బతుకక పోతే ఎలా

నీ కోసం నీవు ఒక్కసారైనా ఆలోచించకపోతే ఎలా‌‌…

నీ ఉనికికి ఉరితాళ్ళు బిగించే

కుట్ర రచన జరుగుతుంటే

నీ వేలితోనే నీ వారసత్వపు కళ్ళను

కుళ్ళబొడుస్తుంటే ఇంకా

ఎంత కాలమీ ఉపేక్ష…

గాలి వాటుకు నేల రాలిన విత్తనం

టన్నుల కొద్దీ బరువును మోస్తూ

ఉనికిని చాటుకునేందుకు తపిస్తోంది

 బండను సైతం ఆలంబనగా చేసుకొని

మనుగడ కోసం పోరాడుతూ

తన జాతికి ప్రతీకగ లోకాన్నెలా

తలెత్తి చూస్తుందో చూడు!

శిశిరాలు చీదరించినా

ఆవేదనలు ఆవహించినా

తొణకని బెణకని ఆత్మవిశ్వాసం

గుండె నిండుగా ఆవాహన చేసుకొని

తన జాతి మనుగడ కోసమెలా తపిస్తోందో చూడు!

అక్షర మాలలో మొదటి వర్ణానివి

బ్రహ్మకు జన్మనిచ్చిన అమ్మవు

అవనియంత సహనాన్ని

ఔపాసన పట్టిన ఆడ జన్మవు

నీ అస్తిత్వం  ప్రశ్నార్థకంగా మారుతుంటే

మౌనం వహిస్తావెందుకు…

బతుకు పోరాటంలో 

నిత్యం జ్వలించే నీవు

ఒకే ఒక్కసారి భుజ్ భూకంపంలా

నీ నిరసన చూపించు

సునామీవై సమస్యలపై

విరుచుకు పడు

కలకంఠి కన్నీరు పెడితే ఏమవుతుందో..

సహనానికి పరీక్ష పెడితే ఏం జరుగుతుందో..

అవకాశమిస్తే అంతరిక్షాన్ని పాదాక్రాంతం చేసుకున్న నీవు

సహస్ర వృత్తులలో సంలీనమై

జాతి భవితకు రూపమిచ్చిన నీవేంటో

నీ మనుగడ ప్రశ్నార్థకమైతే జరిగే పరిణామమేంటో

తెలిసేలా చెయ్!

-వురిమళ్ల సునంద, ఖమ్మం

Related posts

ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు గ్రీన్ కానుక

Satyam NEWS

ఇన్ వెడ్డింగ్:కల్తీ మద్యం తాగి ఇద్దరి మృతి

Satyam NEWS

చతికిలబడ్డ కాంగ్రెస్ పార్టీకి పాదయాత్రల కిక్కు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!