39.2 C
Hyderabad
May 3, 2024 12: 47 PM
Slider ప్రత్యేకం

చంద్రబాబు సెకండ్‌ బౌన్సర్‌.. జగన్‌ హిట్‌ వికెట్‌..?

#chandrababu

అలుపెరగని పోరాటాలతో ఏపీలో జగన్‌ సర్కార్‌ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. వైసీపీ ప్రభుత్వంపై వేసిన తొలి బౌన్సర్‌కి జగన్‌ టీమ్‌ పరుగులు పెట్టింది.. సమాధానం చెప్పుకోలేక పారిపోయింది. తాజాగా రెండో బౌన్సర్‌ సంధించారు టీడీపీ అధినేత. ఈ ఎత్తుతో జగన్‌ కేబినెట్‌ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. చంద్రబాబు మొదటి బౌన్సర్‌తో జగన్‌ సర్కార్‌ అసమర్ధత తెరమీదకి వస్తే, రెండో బౌన్సర్‌తో జగన్‌ అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చిందనే చర్చ నడుస్తోంది.

జగన్‌ సర్కార్‌ వైసీపీపై సంధించిన మొదటి అస్త్రం సాగునీటి పారుదల  ప్రాజెక్టులు. భారీ, మధ్య, చిన్న తరహా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన బాబు.. రాష్ట్ర ప్రభుత్వం తలెత్తుకోలేని పరిస్థితి కల్పించారు. పోలవరం ప్రాజెక్టు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి దగ్గర నుంచి రాయలసీమలోని గాలేరు నగరి ఇతర ప్రాజెక్టుల వరకు ఎలాంటి పురోగతి లేని వైనాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఉత్తర కుమార ప్రగల్భాలే తప్ప క్షేత్ర స్థాయిలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేని ప్రభుత్వం చేతగాని తనాన్ని తూర్పార బట్టారు. ప్రతి విషయంలో అడ్డగోలుగా బుకాయించే వైసీపీ మంత్రులు, నాయకులు… సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై ఏం చెప్పాలో తెలియక మొహం చాటేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై చంద్రబాబు పోరాటం సమయంలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఢిల్లీ వెళ్లడం చూస్తే.. ఈ విషయంలో వైసీపీ నాయకత్వం దగ్గర సమాధానం లేదని అర్ధమవుతోంది.

ఇక రెండో విడతలో రాష్ట్రంలో ఇసుక దోపిడీపై దృష్టి పెట్టారు చంద్రబాబు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఇసుక విధానంపై నానా రాద్ధాంతం చేసిన వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి… వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇసుక మొత్తం తన సొంత ఆస్థి అన్నట్టు వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యమంత్రి అయిన వెంటనే అప్పటి వరకు ప్రజలకు ఉచితంగా ఇసుక అందించే విధానాన్ని పక్కన పెట్టి.. శాండ్ మైనింగ్‌ మొత్తం సొంత కంపెనీలకు కేటాయించుకున్నారని ప్రతిపక్షాలు విమర్శలు సంధించాయి. గతం కంటే మెరుగైన విధానం తెస్తాం… ఇసుకను డోర్‌ డెలివరీ చేస్తామని చెప్పి… 40 లక్షల భవన నిర్మాణ కార్మికులను తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందుల్లోకి నెట్టారని విమర్శిస్తున్నారు టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు. జగన్‌ తీసుకొచ్చిన లోపభూయిష్టమైన ఇసుక విధానం కారణంగా వందల మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని… ఇసుక మాఫియా ఆగడాలతో అన్నమయ్య, గుండ్లకమ్మ ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోయాయనే వాదన ఉంది..

ఇసుకను దోచేసిన వైసీపీ నాయకులు నాలుగేళ్లలోనే 40 వేల కోట్లు మింగేశారని ఆరోపించారు  టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్‌కు ఇసుకే ఆహారమని.. మద్యాన్ని నీరుగా, భూమిని ఫలహారంగా భోంచేసి.. ప్రజలను హింసించడం ద్వారా పైశాచిక ఆనందం పొందుతున్నారని వీడియో ప్రెజెంటేషన్ ఇచ్చి మరీ విమర్శించారు. లక్షల కోట్ల దోపీడియే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వ పెద్దలు పనిచేస్తున్నారని వివరించారాయన.  ఇన్నాళ్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన టర్న్‌కీ కంపెనీకే ఇసుక కాంట్రాక్టులన్నీ కట్టబెట్టిన జగన్‌ సర్కార్‌ .. స్థానిక నేతల్లో వ్యతిరేకతతో ఎమ్మెల్యేలు, ఇతర కిందస్థాయి నాయకులకు ఇసుక తవ్వకాల కాంట్రాక్టులు పంచి పెడుతున్నారని విమర్శించారు. సీఎం జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులు ఇసుకను వాటాలేసుకొని దోచుకుంటున్నారని ఆరోపించారు చంద్రబాబు.

వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక విధానం, ఆ పార్టీ నేతలు వేల కోట్లు వెనకేసుకోవడానికే ఉపయోగపడిందని.. ఆ భారమంతా ప్రజలపైనే పడిందన్నారు ప్రతిపక్ష నేత. మెరుగైన పాత విధానాన్ని రద్దు చేసి, జగన్‌ తీసుకొచ్చిన ఇసుక విధానం భవన నిర్మాణ కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసి.. ప్రజలపై వేల కోట్ల భారం వేయడంతో పాటు పర్యావరణాన్ని కూడా ఘోరంగా దెబ్బతీస్తోందని వివరించారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగిస్తామని.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు చేసే విధానాలు అమలు చేస్తామన్నారు.

మొత్తమ్మీద, చంద్రబాబు సెకండ్‌ బౌన్సర్‌తో జగన్‌ ఉలిక్కి పడుతున్నారు. దీనికి తాడేపల్లి ఎలాంటి  వివరణ ఇస్తుందో చూడాలి.

Related posts

Analysis: గెలిచింది ఎవరైనా ఓడింది మాత్రం ఓటరే

Satyam NEWS

కరోనా వ్యాక్సిన్ వికటించడంతో డాక్టర్ కు తీవ్ర అస్వస్థత

Satyam NEWS

శబరిమల క్షేత్రానికి రికార్డు స్థాయిలో ఆదాయం

Bhavani

Leave a Comment