23.5 C
Hyderabad
November 29, 2021 17: 59 PM
Slider సంపాదకీయం

ఫిలిం ఇండస్ట్రీ: తెలివైన పాలకుడు చేయాల్సిన పని ఇది

#telugufilmindustry

ఏదో ఒక కులాన్ని అణిచివేయాలని, ఆర్ధికంగా దెబ్బ తీయాలని చూసే పాలకులకు ఏమీ చెప్పలేం కానీ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే వారికైతే మాత్రం తెలుగు సినీ పరిశ్రమ పాడిఆవులా ఉంటుంది. రాష్ట్ర అభివృద్ధికి కావాల్సిన పలురకాల అంశాలు సినీ పరిశ్రమలో ఇమిడి ఉంటాయి. తెలుగు సినీ పరిశ్రమ దేశంలో హిందీ చిత్ర పరిశ్రమ తర్వాతి స్థానంలో ఉంది. ఎక్కువ ఖర్చు, అతి ఎక్కువ కలెక్షన్లు వచ్చేది తెలుగు సినీ పరిశ్రమ. ఇలాంటి పరిశ్రమను పెంచేందుకు ప్రభుత్వాలు సహకరిస్తే వారికి పన్నుల రూపంలో విశేషంగా ధనలాభం ఉంటుంది.

అలా కాకుండా సినీ పరిశ్రమలో బలంగా వేళ్లూనుకుని ఉన్న కమ్మ కులాన్ని, ధియేటర్లు ఎక్కువ ఉండి ఎగ్జిబిటర్ల వ్యవస్థను గుప్పిటిలో పెట్టుకున్న కాపు కులాన్ని ఆర్ధికంగా దెబ్బ తీసేందుకు ఎత్తుగడలు వేస్తే తెలుగు సినీ పరిశ్రమ భోజ్ పురి చిత్ర పరిశ్రమలా తయారవుతుంది. తెలుగు సినీ పరిశ్రమలో చిన్న సినిమాకు కనీసం 3 నుంచి 5 కోట్లు, పెద్ద సినిమాకు కనీసం 30 నుంచి 60 కోట్లు ఖర్చు చేస్తారు.

మెగా కుటుంబంలోని కొందరు హీరోల చిత్రాలకు అయితే 100 నుంచి 120 కోట్లు ఖర్చు చేస్తారు. అదే భోజ్ పురిలో అయితే ఒక్కో సినిమాకు 10 నుంచి 20 లక్షలు మాత్రమే ఖర్చు చేస్తారు. తెలుగు సినీ పరిశ్రమను చిదిమేస్తే ఇది కూడా భోజ్ పురి చిత్ర సీమ స్థాయిచి వచ్చేస్తుంది. సినీ పరిశ్రమ నుంచి ప్రభుత్వానికి వచ్చే లాభం ఏమిటి అనే అంశం పరిశీలిస్తే ముందుగా ప్రభుత్వానికి అతి పెద్ద ఆదాయం సినీ తారల రెమ్యూనరేషన్ నుంచి టాక్సు రూపంలో వస్తుంది.

కోట్లాది రూపాయల ఆదాయపు పన్ను

కోట్లాది రూపాయలు ఆదాయపు పన్ను చెల్లించే హీరోలు తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నంత మంది మరే ఇతర ప్రాంతీయ భాషా చిత్రాలకు లేరు. గతంలో లాగా కాకుండా ఇప్పుడు చాలా వరకూ వైట్ ఎమౌంట్ నే హీరోలకు, హీరోయిన్లకు ఇస్తున్నారు. బ్లాక్ ఎమౌంట్ ఉండటం వల్ల హీరోలకు కూడా సమస్యలు వస్తాయి కాబట్టి సాధ్యమైనంత వరకూ వైట్ ఎమౌంట్ నే ఇచ్చి పుచ్చుకోవడాలు జరుగుతున్నాయి.

హీరో, హీరోయిన్లకే కాకుండా మిగిలిన ఆర్టిస్టులకు, టెక్నీషియన్లకు ఇచ్చే పారితోషికంపై ‘‘ఎట్ సోర్సు’’ 18 శాతం జీఎస్ టి కట్ చేసి ఇస్తారు. మాట్లాడుకున్న మొత్తంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఇది. ఇందులో సగం కేంద్ర ప్రభుత్వానికి వెళ్లినా సగం రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. ఇవన్నీ చెక్ పేమెంట్ లేదా బ్యాంకు ట్రాన్స్ ఫర్ లే చేస్తుంటారు.

నిత్యావసరాలు పెంచేస్తూ… సినిమా టిక్కెట్ తగ్గిస్తారా?

సినిమా టిక్కెట్ రేటు పై 18 శాతం జీఎస్ టి వసూలు చేస్తున్నారు. సినిమా టిక్కెట్ ఇప్పుడు సాధారణ పట్టణాలలో కూడా సగటున 100 రూపాయల వరకూ ఉన్నది. సినీ ప్రేమికులకు ఇది పెద్ద భారం కాదు. దాన్ని తగ్గిస్తే ప్రభుత్వానికే ఆదాయం తగ్గుతుంది. పెట్రోలు, డీజిల్ నుంచి నిత్యావసరాలు వరకూ రేట్లు విపరీతంగా పెంచేస్తున్న ప్రభుత్వం, సినిమా టిక్కెట్ల ధరలను తగ్గించాలనుకోవడం అవివేకమే అవుతుంది. గతంలో మాదిరిగా సినిమా ధియేటర్లలో టిక్కెట్లను యజమానులే బ్లాక్ లో అమ్ముకునే పరిస్థితి ఇప్పుడు లేదు. కొత్త సినిమా విడుదలైనప్పుడు 10 నుంచి 20 శాతం టిక్కెట్లను కొందరు ప్రయివేటు వ్యక్తులు బ్లాక్ లో అమ్మినా అది మొదటి రెండు రోజులకే పరిమితం.

వివిధ ప్రాంతాలలో సినిమా షూటింగ్ లు చేసుకునే విధంగా ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తే రాష్ట్రానికి మరింత ఆదాయం వస్తుంది. సినిమా షూటింగ్ లు క్రమం తప్పకుండా జరుగుతుంటే పర్యాటక రంగం విశేషంగా పెరుగుతుంది. సినిమా షూటింగ్ లను పెద్ద ఎత్తున ప్రోత్సహించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి గణనీయంగా ఆదాయం వస్తుంది.

సినీ పరిశ్రమ ఎంత పెరిగితే అంత మేరకు హోటల్ పరిశ్రమ, రిసార్ట్స్ పరిశ్రమలు ఊపందుకుంటాయి. వీటన్నింటిపై పెట్టే ఖర్చులో ప్రభుత్వానికి ఆదాయం ఉంటుంది.

సినిమా షూటింగ్ ల కోసం కొనే సామాగ్రిపై టాక్సులు వసూలు అవుతాయి. ఒక్కో సినిమాకు సెట్టింగ్ లు వేయాలంటే భారీగా ఖర్చు చేస్తుంటారు. లొకేషన్ లో అవసరమైన సెట్ ప్రాపర్టీలు ఒక సినిమాకు వాడినవి మరో సినిమాకు పనికి రావు. అందువల్ల సినిమా షూటింగ్ జరిగిన ప్రతిసారీ లక్షల్లోనే కొత్త సామాగ్రి కొనాల్సి వస్తుంది.

సినిమా షూటింగ్ లను ఎక్కువగా ప్రోత్సహిస్తే షూటింగ్ జరిగిన ప్రతి సారీ ప్రతి రోజూ కనీసం 200 నుంచి 300 మందికి టిఫిన్ నుంచి రాత్రి భోజనం వరకూ నిర్మాతలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి వాడే సామాగ్రి అంతా ప్రభుత్వానికి టాక్సుల రూపంలో ఆదాయం తెచ్చేదే.

వాహనాలు, జనరేటర్లు వాడేందుకు పెట్రోలు, డీజిల్ విరివిగా వాడతారు. వాటన్నింటిపైనా ప్రభుత్వానికి టాక్సులు వస్తాయి.

ధియేటర్ల ద్వారా ఎంతో మందికి ఉపాధి

సినిమాలు ఎక్కువ తీసి ఎక్కువ సినిమాలు విడుదల అయితే ధియేటర్లలో ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది.

సినీ పరిశ్రమ వారు ఖర్చు చేసే ప్రతి లక్ష రూపాయలలో ప్రభుత్వానికి కనీసం 25 శాతం మేరకు ఆదాయం లభిస్తుంది. అందుకే దేశంలోని చాలా రాష్ట్రాలు సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాయి. మన దేశంలోనే కాదు. చాలా దేశాలలో సినిమా షూటింగ్ లను ప్రోత్సహిస్తుంటారు. నిర్మాత ఖర్చు చేసే మొత్తంలో 25 నుంచి 40 శాతం మేరకు ఆయా దేశాలు తిరిగి నిర్మాతకే ఇచ్చేస్తుంటాయి. అలా చేసినా ఆయా దేశాలకు గణనీయమైన ఆదాయం వస్తున్నది.

ఏపిలోని చాలా ప్రాంతాల్ని షూటింగ్ స్పాట్ లుగా చేసుకోవచ్చు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్ లో స్థిరపడిన తెలుగు చలన చిత్ర పరిశ్రమను కొంత మేరకైనా ఆంధ్రా ప్రాంతానికి తరలించుకునే ప్రయత్నాలు చేస్తే ఈ మేరకు ఆ రాష్ట్రం కూడా లాభపడవచ్చు. తెలంగాణ భూభాగంలో స్టూడియోలు, రికార్డింగ్ ధియేటర్లు ఉన్నాయి. అందువల్ల ఆంధ్రా ఏరియాలో విశేషంగా ఉన్న సముద్రతీరం, నదీతీరం, అడవులు, ఎత్తిపోతల ఇతర ప్రాంతాలను షూటింగ్ స్పాట్ లా మార్చుకుంటే తెలుగు చిత్ర సీమ పూర్తిగా తరలి రాకపోయినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సినిపరిశ్రమ నుంచి ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం వస్తుంది.

అందుకే ఎక్కువ సినిమాలు వచ్చే విధంగా ప్రభుత్వం సహకరించాలి. ధియేటర్లు మూతపడకుండా కాపాడుకోవాలి. అంతే కానీ సినిమాలను అడ్డుకుంటూ, నిర్మాతలకు లాభం లేకుండా చేస్తూ, హీరోలను అణగదొక్కుతూ పోతే చివరకు మిగిలేది రాజకీయమే తప్ప అభివృద్ధి కాదు.

సత్యమూర్తి పులిపాక, చీఫ్ ఎడిటర్, సత్యంన్యూస్.నెట్

Related posts

తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మేడే ఉత్సవాలు

Satyam NEWS

ఆగస్టు 14 వరకు కోర్టులకు లాక్ డౌన్ పొడిగింపు

Satyam NEWS

మిస్ యూజ్: పబ్లిక్ ఏమైతేనేం, ముందు నా ఇల్లు చల్లగా ఉండాలి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!