40.2 C
Hyderabad
April 26, 2024 14: 44 PM
Slider ప్రత్యేకం

BJP vs TRS T20: బాల్స్ తక్కువ కొట్టాల్సిన రన్స్ ఎక్కువ

#modi

దక్షిణాది రాష్ట్రాలలో పట్టు పెంచుకునే లక్ష్యంతో బీజేపీ రెండు తెలుగు రాష్ట్రాలలో ఒకటైన తెలంగాణ పై పూర్తిగా దృష్టి కేంద్రీకరించింది. తెలంగాణలో భాజపాకు క్రమంగా పెరుగుతున్న ఆదరణ గ్రహించి బీజేపీ అధినాయకత్వం పావులు కదుపుతూ, ప్రజా బాహుళ్యానికి చేరువ కావడానికి అనేక ప్రయత్నాలు చేస్తోంది. అదే సమయంలో…పొరుగున ఉన్న మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ విషయంలో బీజేపీ పూర్తి మెతక వైఖరి అనుసరించడం ఆశ్చర్యకరం.

అవసరమైతే… ఏక్ నాథ్ షిండేలు తెరాస నుంచే వస్తారని బీజేపీ రాష్ట్రనేతలు బహిరంగ ప్రకటనలు చేయడం ఆ పార్టీ ఎత్తుగడను ప్రదర్శిస్తోంది. ఈ తరహా బెదిరింపులకు భయపడేది లేదని కేసీఆర్ ఎదురు దాడి చేస్తున్నారు. బీజేపీ సంధిస్తున్న విమర్శనా స్త్రాలను తిప్పి కొట్టడమే పనిగా కేటీఆర్, హరీష్ రావు వంటి  తెరాస ముఖ్యనేతలు కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోదీని తూర్పార పడుతున్నారు.

రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన నిధులను ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రగతికి ఆటంకం కలిగిస్తోందని తెరాస అంటుండ గా , కేంద్రం ఇస్తున్న నిధులతోనే తెరాస పథకాలు అమలు చేస్తోందని కేంద్ర మంత్రులు గణాంకాలతో సహా ప్రజలకు వివరిస్తున్నారు. కేంద్రం వివిధ పద్దులకింద ఇస్తున్న లక్షలాది రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం తనకు అనుకూలమైన పథకాల పేరుతో ఖర్చు చేస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి దుయ్యబట్టారు.

స్పష్టత లేని తెలంగాణ సమాజం… ఇలా ఎందుకు?

ఎవరు చెప్పేది సత్యం..ఎవరిది అసత్యం అనే అనుమానం తెలంగాణ సమాజంలో మొదలైంది. ఒక్కటి మాత్రం నిజం. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ నుంచి కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తొలి రోజుల్లో తెలంగాణ ధనిక రాష్ట్రంగా పేరు పొందింది. కానీ ఈ ఎనిమిదేళ్ళ ప్రస్థానంలో తెలంగాణ రాష్ట్రం లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో మునిగినట్లు లెక్కలు ఉన్నాయి.

దీనికి కారణం ఏమిటి అనే విషయంపై లోతుగా అధ్యయనం చేస్తే..అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. తెలంగాణ సమాజంలోని సకల వర్గాలవారిని సంతృప్తి పరచాలని భావించి అనేక ఉచితాలు ప్రవేశపెట్టడం ప్రధాన కారణం. వీటికి తోడు కాళేశ్వరం వంటి  ప్రాజెక్టుల నిర్మాణం, రైతు బంధు, దళిత బంధు వంటి పథకాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దెబ్బతీశాయి. ఒక వైపు తలసరి ఆదాయం ఆశించిన స్థాయిలో పెరగక పోయినా తలసరి ఖర్చు అనూహ్యంగా పెరగడం వల్ల ఆర్థికంగా ఒడి దుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

తెలంగాణ రాష్ట్రానికి గణనీయమైన ఆదాయం సమకూర్చే ప్రభుత్వ శాఖలలో అవినీతి, బంధు ప్రీతి పెచ్చరిల్లుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నియమ నిబంధనలు తుంగలో తొక్కి అస్మదీయులను  ఉన్నత అధికార స్థానాల్లో నియమిస్తోం దని విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ కంటే సీనియర్లు ఉండగా వారిని కాదని ఆయనను  నియమించడం విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారికి సమాధానం ఇవ్వలేని పరిస్థితిలో తెరాస ప్రభుత్వం మౌనం వహిస్తోంది.

వడ్డించే వాడు మనవాడైతే చివరిలో కూర్చున్నా ఫరక్ లేదని అంటారు. ఇప్పుడు అది నిజమని తెరాస ప్రభుత్వ నిర్వాకం గమనిస్తే తెలుస్తుంది. తెలంగాణ లో పండిన వడ్లు కొనే విషయంలో తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాల మధ్య రగడ తార స్థాయిలో చోటు చేసుకుంది. ఇప్పటికీ అది చల్లారనే లేదు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విడిపోయిన ఎనిమిదేళ్ళ  తర్వాత కూడా విధాన పరమైన పలు వివాదాస్పద అంశాలు ఇంకా పరిష్కారానికి నోచుకోలేదు.

ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సున్నిత సమస్యలపట్ల  స్పందించి ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపించాల్సిన కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోకుండా ఉదాసీనంగా ఉండడం పరిశీలకులకు ఆశ్చర్యం కలిగిస్తుంది.  ఇదిలా ఉండగా..తెలంగాణకు రావాల్సిన అనేక సంస్థలను, పరిశ్రమలను గుజరాత్ కు కేంద్రం తరలిస్తోందని తెరాస విమర్శిస్తోంది. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తూ విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల పట్ల వివక్ష చూపుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సందర్భాలలో ప్రస్తావిస్తున్నారు.

కేంద్ర మంత్రులు, బీజేపీ అధినాయకత్వం తెరాస ప్రభుత్వంపై, కేసీఆర్ పై చేస్తున్న వ్యక్తిగత విమర్శల పరంపర వల్ల కేసీఆర్ జాతీయ స్థాయి రాజకీయాల వైపు దృష్టి సారించినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ నుంచి వస్తున్న ఒత్తిడిని అధిగమించడానికి జాతీయ స్థాయి నేతల మద్దతు అనివార్యమని గ్రహించి , కేసీఆర్ వివిధ పార్టీల నేతలతో రాజకీయ మంతనాలు సాగిస్తున్నారు.

విపక్షాల ఉమ్మడి వేదిక ఎంతో అవసరం

ఈడీ లకు, సీ ఐ డి లకు బెదిరేది లేదని, కేంద్రంలో మోదీ ప్రభుత్వ దుర్మార్గాన్ని ఎండగట్టడమే తన ఎజెండా అని ప్రకటించడం వెనుక నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్, అఖిలేష్ యాదవ్,శరద్ పవార్, స్టాలిన్, కుమార స్వామి, ఉద్ధవ్ థాకరే, శిబూ సొరేన్,అరవింద్ కేజ్రీవాల్ , మమతా బెనర్జీ వంటి కీలక నేతల మద్దతు ఉందని జాతీయ మీడియాలో ఒక వర్గం ప్రచారం చేస్తోంది. 2024 – పార్లమెంట్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోనే వరుసగా మూడో సారి ప్రభుత్వం ఏర్పరచే అవకాశం స్పష్టంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతూన్న నేపథ్యంలో బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి వేదిక అవసరాన్ని విపక్షాలు గుర్తించాయి. ఇటువంటి పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకోవాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ జాతీయ స్థాయిలో బీ ఆర్ ఎస్ పార్టీ పెడతానని అన్నారు.

ఎన్ డీ యే కూటమి నుంచి బయటకు వచ్చిన నితీష్ కుమార్ ను విపక్షాల తరఫున  ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే బిజెపి దూకుడుకు కళ్ళెం వేయవచ్చని ఒక మాట రాజకీయ వర్గాల అంతర్గత చర్చలలో బలంగా వినిపిస్తోంది. ఇదిలా ఉండగా. బీజేపీ ని ముఖాముఖి ఎదుర్కోవడానికి మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ తో దోస్తీ తప్పదని శివసేన, ఎన్సీపీ వంటి పార్టీలు భావిస్తున్నాయి. ఇటువంటి  అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని కేసీఆర్ ముందుకు వెళ్తారా లేక తన పర్సనల్ అజెండాతో అడుగులు వేస్తారా అనే విషయంలో ప్రస్తుతానికి స్పష్టత లేదు.

తాజాగా..విజయ దశమి నాటికి కేసీఆర్ మనసులో ఉన్న ఆలోచనలకు తుది రూపం రాగలదని సమాచారం. ఒక వైపు బీజేపీ, మరో వైపు తెరాస తెలంగాణలో అధికారం కోసం కత్తులు దూస్తుంటే మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ చాప కింద నీరులా పుంజుకుంటోంది.

విచిత్రం ఏమిటంటే..దేశంలోని దాదాపు అన్ని బిజెపి యేతర పార్టీలను కూడగట్టాలని తీవ్రంగా శ్రమిస్తున్న తెరాస అధినేత కేసీఆర్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వై ఎస్ జగన్మోహన్ రెడ్డిని మాత్రం కలవక పోవడం. ఇందులో దాగి ఉన్న చిదంబర రహస్యం తెలియాలంటే 2024 ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.

పొలమరశెట్టి కృష్ణారావు, సామాజిక రాజకీయ విశ్లేషకుడు

Related posts

43 కేంద్రాల్లో 15 వేల 388 మంది పరీక్ష రాస్తున్నారు…!

Satyam NEWS

ధీరోదాత్తుడు టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి నేడు

Satyam NEWS

అంగరంగ వైభవంగా పైడితల్లి సిరిమాను సంబరం ఆరంభం

Satyam NEWS

Leave a Comment