28.7 C
Hyderabad
April 27, 2024 03: 54 AM
Slider ముఖ్యంశాలు

తెలంగాణ లో తగ్గుతున్న కరోనా వైరస్ వ్యాప్తి

#CMKCR

రాబోయే కొద్ది రోజుల్లోనే కరోనా పాజిటివ్ కేసులు లేని రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ఏప్రిల్ 28 నాటికి రాష్ట్రంలోని 21 జిల్లాలు ఒక్క కరోనా ఆక్టివ్ కేసు కూడా లేని జిల్లాలుగా మారుతున్నాయని ఆయన వెల్లడించారు.

ప్రధానమంత్రితో ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. నేడు 159 మందికి పరీక్షలు నిర్వహించగా, కేవలం ఇద్దరికి మాత్రమే పాజిటివ్ వచ్చిందని అధికారులు వెల్లడించారు.

పోలీసులు చురుకుగా పని చేయడం వల్ల మంచి ఫలితాలు

అదే విధంగా మరో 16 మంది నేడు డిశ్చార్జి అయినట్లు సిఎంకు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయడం వల్ల వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా అరికట్టగలుగుతున్నామని వారు వివరించారు. మొదట విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా, తర్వాత మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారి ద్వారా వైరస్ రాష్ట్రంలో ఎక్కువ ప్రాంతాలకు పాకింది. పోలీసులు, వైద్య ఆరోగ్యశాఖ వారి లింకులన్నింటినీ దొరకబట్టి పరీక్షలు నిర్వహించి, చికిత్స అందించడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయి.

మొత్తం పది జిల్లాల్లో (ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నారాయణపేట, వరంగల్ రూరల్, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మంచిర్యాల) ప్రస్తుతం ఒక్క పాజిటివ్ కేసు కూడా లేదు. మరో 11 జిల్లాలు(జగిత్యాల, జనగామ, పెద్దపల్లి, సంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, నల్గొండ) మంగళవారం (ఏప్రిల్ 28) నాటికి ఒక్క పాజిటివ్ కేసు కూడా లేని జిల్లాలుగా మారనున్నాయి.

మూడు ప్రాంతాల్లోనే కరోనా కేసులు

హైదరాబాద్, సూర్యాపేట, గద్వాల, వికారాబాద్ లాంటి ప్రాంతాల్లోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లో చాలా తక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులున్నాయి. జిహెచ్ఎంసి పరిధిలో 30 సర్కిళ్లు ఉంటే, చాలా సర్కిళ్లలో పాజిటివ్ కేసులు లేవు. కొన్ని సర్కిళ్లకే వైరస్ పరిమితమైంది. దీంతో చాలా కంటైన్మెంట్లు ఫ్రీ అవుతున్నాయి.

యాక్టివ్ కేసులు తగ్గుతున్న కొద్దీ కంటైన్మెంట్ల సంఖ్యను కూడా ప్రభుత్వం తగ్గిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా  వైరస్ సోకిన వారిలో అత్యధిక శాతం మంది క్వారంటైన్ పీరియడ్ మే 8 నాటికి ముగుస్తున్నది. కొద్ది రోజులుగా పరిస్థితి గమనిస్తుంటే రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి బాగా తగ్గుముఖం పట్టింది.

రాబోయే రోజుల్లో ఒక్క పాజిటీవ్ కేసు కూడా రాదు

రాబోయే కొద్ది రోజుల్లోనే ఒక్క పాజిటివ్ కూడా రాని పరిస్థితి వస్తుందనే నమ్మకం ఏర్పడుతున్నది. రాష్ట్రంలో ముందు ప్రకటించినట్లు మే 7 వరకు లాక్ డౌన్ కొనసాగుతుంది. ప్రజలు నిబంధనలు పాటించి సహకరించాలి. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు. అన్ని మతాల వారు తమ ప్రార్థనా కార్యక్రమాలను, పండుగలను ఇండ్లలోనే చేసుకోవాలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.

Related posts

కాంగ్రెస్ పార్టీలో చేరిన మేఘారెడ్డి

Satyam NEWS

వర్ల సన్మాన సభ వాల్ పోస్టర్ ఆవిష్కరణ

Satyam NEWS

రైతుల్ని మోసం చేసే ప్రయత్నాలు మానుకోవాలి

Satyam NEWS

Leave a Comment