32.7 C
Hyderabad
April 27, 2024 00: 19 AM
Slider సంపాదకీయం

మళ్లీ మూడు రాజధానుల బిల్లు…..?

#jagan

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో మూడు రాజధానుల బిల్లు మరొక మారు తీసుకురానున్నారా? దీనికి అవుననే సమాధానం వినిపిస్తున్నది. అమరావతి రాజధాని పై రాష్ట్ర హైకోర్టు తీర్పు రావడం, దానిపై సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్లిన నేపథ్యంలో కూడా తమ విధానం మూడు రాజధానుల విధానమేనని అధికార వైసీపీ నాయకులు ఇప్పటికే విస్పష్టంగా ప్రకటించారు.

మూడు రాజధానులు కాదు విశాఖే రాజధాని అని ముఖ్యమంత్రి జగన్ ఒక సందర్భంలోనూ, రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మరో సందర్భంలోనూ ప్రకటించారు. అయితే తమ ప్రభుత్వం మాత్రం మూడు రాజధానులకే కట్టుబడి ఉందని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి చెప్పినా, ఆర్ధిక మంత్రి చెప్పినా చివరికి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన మాటే చెల్లుబాటు అవుతుందని వైసీపీ నేతలు చాలా మంది భావిస్తుంటారు.

ఈ నేపథ్యంలో కోర్టులో ఉన్న అంశాల జోలికి వెళ్లకుండా మూడు రాజధానుల బిల్లును మళ్లీ తీసుకువస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సారి అసెంబ్లీలో, కౌన్సిల్ లో కూడా ఒక రోజు చర్చతోనే అమోదించుకుని శాసనం చేస్తారని అంటున్నారు. గతంలో మూడు రాజధానుల బిల్లు ఆమోదం విషయంలో జరిగిన పొరబాట్లు ఈ సారి జరగకుండా చూడాలని కూడా వైసీపీ ప్రభుత్వం భావిస్తున్నది.

అసెంబ్లీ, కౌన్సిల్ ఒకే సారి ఆమోదించి గవర్నర్ కు పంపడం, దాన్ని ఆమోదించేలా గవర్నర్ పై వత్తిడి తీసుకురావడం జరిగితే మూడు రాజధానుల బిల్లుకు చట్టబద్ధత వస్తుంది. ఇలా చట్టం చేసుకోవడం ద్వారా సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును సందిగ్ధంలో పడేయవచ్చునని న్యాయ నిపుణులు వైసీపీ పెద్దలకు చెబుతున్నారని వినికిడి. చట్టం తీసుకురావడం వల్ల సుప్రీంకోర్టు కూడా అందుకు విరుద్ధంగా తీర్పు చెప్పే అవకాశం ఉండకపోవచ్చునని కొందరు న్యాయ సలహాదారులు చెబుతున్నట్లు తెలిసింది.

మూడు రాజధానులపై చట్టం చేసుకుని ఎన్నికలకు వెళ్లడం ద్వారా ప్రతిపక్షాలను మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని మూడు ప్రాంతాలలో దెబ్బ తీయవచ్చునని వైసీపీ వ్యూహం పన్నుతున్నట్లు తెలిసింది. అందుకోసం మూడు రాజధానుల అంశాన్ని ఈ సారి తెరపైకి బలంగా తీసుకువెళ్లాలని నిర్ణయించారు. ఒక వేళ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వ పెద్దల అభీష్టానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చినా, తీసుకురాబోతున్న కొత్త చట్టాన్ని కొట్టేసినా కూడా తమకే సానుభూతి ఉంటుందని కూడా అధికార పార్టీ ఆలోచిస్తున్నది.

తాము మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని, ప్రతిపక్షాలు అడ్డుకోవడం వల్లే మూడు రాజధానులు తీసుకురాలేకపోతున్నామని ఎన్నికల ముందు చెప్పుకోవడం ద్వారా అన్ని పాలనా వైఫల్యాలను పక్కన పెట్టి ఎన్నికలలో లబ్ది పొందవచ్చునని వైసీపీ భావిస్తున్నది. మూడు రాజధానుల అంశం కోర్టులో నిలబడకపోయినా ఫర్వాలేదు కానీ తమ ప్రయత్నం మాత్రం ఆగిపోకూడదని వైసీపీ భావిస్తున్నది.

పాలనా లోపాలు, ఆర్ధికంగా రాష్ట్రం అధ:పాతాళానికి వెళ్లిపోవడం, అప్పుల కుప్పగా మారడం, ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టడం తదితర అంశాలన్నీ పక్కకు తోసి కేవలం మూడు రాజధానుల అంశం మాత్రమే తెరపైకి తీసుకువచ్చి ఎన్నికలకు వెళితే తమ పార్టీకి పూర్తి స్థాయిలో ఎడ్వాంటేజి ఉంటుందని వైసీపీ పెద్దలు ఆలోచిస్తున్నారు. అందుకోసం ఈ సమయాన్ని వాడుకోవాలని వారు పథకం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.

Related posts

Hypertensive Medicines

Bhavani

కోట్పా చట్టంపై అవగాహన అవసరం

Sub Editor

ఫెస్టివల్ గిఫ్ట్: జగనన్న రంజాన్ ఖదర్

Satyam NEWS

Leave a Comment