37.2 C
Hyderabad
April 30, 2024 11: 41 AM
Slider సంపాదకీయం

Triangle love story: బిజెపి… కేసీఆర్…. జగన్ పార్టీ

#trianglelovestory

జాతీయ రాజకీయాలవైపు చూస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన సాటి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాజకీయం పై ఎందుకు దృష్టి పెట్టడం లేదు? ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం బలమైన మూడు రాజకీయ శక్తులు ఉన్నాయి. అధికారం లో ఉన్న వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం కాగా మూడోది బిజెపితో కలిసి ఉన్న జనసేన.

బిజెపితో కలిసి ఉన్న జనసేనను పక్కకు లాగడం ఇప్పటిలో సాధ్యం కాదని అనుకున్నా వైసీపీ లేదా తెలుగుదేశం పార్టీలలో ఒక దాన్ని కేసీఆర్ తన వైపునకు లాక్కునే ప్రయత్నం చేయాలి. అయితే ఆయన ఆ విధంగా చేయడం లేదు. ఏపిలో అధికారంలో ఉన్న వైసీపీకి బిజెపి నుంచి బలమైన స్నేహ హస్తం అందుతున్నది. రాష్ట్రంలో ఏం జరుగుతున్నా కేంద్రంలోని బిజెపి తన వంతు సాయంగా వైసీపీకి అండగా నిలుస్తున్నది.

అయితే టీఆర్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య ఎంతో అనుబంధం ఉంది. జగన్ ఎన్నికలలో కొట్లాడేందుకు సీఎం కేసీఆర్ అప్పటిలో తన వంతు సాయం అందించారు. తెలుగుదేశం పార్టీ ని ఓడించేందుకు మంత్రాంగం నడిపారు. హైదరాబాద్ లో ఆస్తులు ఉన్న వారిని బెదిరించి మరీ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పని చేయించారు. కేంద్రంలోని బిజెపి కూడా వైసీపీకి మద్దతు పలకడంతో తెలుగుదేశం పార్టీ ఒంటరి అయిపోయింది. దాంతో తెలుగుదేశం పార్టీని ఓడించడం జగన్ కు సులభం అయిపోయింది.

మారిన రాజకీయ పరిస్థితుల్లో కేసీఆర్ బిజెపిపై వంటికాలితో లేస్తున్నారు. బిజెపికి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ఉండకుండా చేయాలని కూడా ఆయన ఉద్దేశ్యం. అందుకోసమే మూడో ప్రత్యామ్నాయాన్ని ఆయన నిర్మిస్తున్నారు. దీన్ని టెంటు ఫ్రంటు అని పిలవద్దని, ఇది ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ అయిన ఆయన అంటున్నారు.

కాంగ్రెస్ బలహీనతల వల్లే తలెత్తున్న మూడో శక్తి

దేశంలో అతి పెద్ద శక్తిగా ఉన్న బిజెపితో కాంగ్రెస్ పార్టీ తలపడలేకపోతున్నదనేది వాస్తవం. ఈ వాస్తవాన్ని గ్రహించిన కాంగ్రెస్ పార్టీ తనంతట తానుగా బలపడేందుకు ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభించింది. అక్టోబర్ 2 నుంచి భారత్ జోడో యాత్రను ప్రారంభిస్తున్నది. వివిధ రాష్ట్రాలలో ఉన్న ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ కు మద్దతు ఇస్తే బిజెపికి ప్రత్యామ్నాయం రూపు దిద్దు కోవడం పెద్ద కష్టమైన పనేం కాదు.

అయితే తెలంగాణ సీఎం కేసీఆర్, దేశంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే పార్టీలను ఒక్కొక్కటిగా చీలుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఏదోక విధంగా మద్దతు ఇవ్వాల్సిన, ఇచ్చే పార్టీలను కేసీఆర్ చీలుస్తుండటం (ఇప్పటి వరకూ ఈ విషయం ఎక్కడా స్పష్టం కాలేదు) బిజెపికి బలం చేకూర్చేదిగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ దేశంలో 20 నుంచి 25 శాతం ఓటింగ్ తో స్థిరమైన ప్రత్యామ్నాయంగా ఉంది. అయితే ఎక్కడా గెలిచేందుకు అవసరమైన మద్దతు రావడం లేదు.

ఈ స్థితిలో కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు కాంగ్రెస్ అవకాశాలను పూర్తిగా దెబ్బతీస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే వైసీపీగానీ, తెలుగుదేశం పార్టీ గానీ బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడే సాహసం చేసే స్థితిలో లేవు. వైసీపీకి బిజెపితో పూర్తి అవగాహన ఉండగా తెలుగుదేశం పార్టీ గత అనుభవాల దృష్ట్యా బిజెపితో తలపడేందుకు సిద్ధంగా లేదు. ఈ రెండు పార్టీలలో ఒక దాన్ని కేసీఆర్ తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేయకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వైసీపీ, తెలుగుదేశం పార్టీలు కేసీఆర్ ఆధ్వర్యంలో పని చేస్తాయా అనే విషయాన్ని పక్కన పెడితే కేసీఆర్ ఆ మేరకు చర్చలు కూడా జరపకపోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నది.

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో, ఉత్తరప్రదేశ్ ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్ తో చర్చలు జరిపినన్ని సార్లు తెలుగు రాష్ట్రాల అధికార ప్రతిపక్ష పార్టీలలో ఏ ఒక్కదానితో కూడా కేసీఆర్ చర్చలు జరపలేదు. అసలు వైసీపీ, తెలుగుదేశం పార్టీల ఉనికికే గుర్తించనట్లు గా కేసీఆర్ ప్రవర్తిస్తున్నారు. ఇదే ఆశ్చర్యం కలిగిస్తున్నది.

వైసీపీని వీడిరాలేని బంధం అది

కేసీఆర్ చేసే ప్రయత్నాలకు తెలుగుదేశం మద్దతు ఇచ్చే అవకాశం కనిపిస్తున్నది కానీ తన మిత్ర పక్షమైన వైసీపీని కాదని కేసీఆర్ తెలుగుదేశం పార్టీతో కలిసి పని చేసేందుకు ముందుకు రావడం లేదు. తన మిత్రపక్షమైన వైసీపీ బీజేపీని వీడి వచ్చే అవకాశం కూడా కనిపించడం లేదు. అందుకే కేసీఆర్ ఆంధ్రాపై గుంభనంగా వ్యవహరిస్తున్నారు. ఏపిలో అధికారంలో ఉన్న వైసీపీ బిజెపి నుంచి ప్రత్యక్ష మద్దతు పొందుతున్నందున కేసీఆర్ జాతీయ రాజకీయాల విషయాన్ని జగన్ తో ప్రస్తావించడం లేదు.

కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు దేశంలో కాంగ్రెస్ ను బలహీన పరచడానికి మాత్రమే ఉపయోగపడతాయని కాంగ్రెస్ వాదులు అంటున్నారు. బిజెపికి మద్దతు ఇచ్చే వైసీపీ లాంటి తన మిత్రులను కేసీఆర్ ఎందుకు బయటకు తీసుకురాలేకపోతున్నారని కూడా ప్రశ్నిస్తున్నారు. బిజెపికి మద్దతు ఇచ్చే వారిని బయటకు తీసుకువస్తే కదా బిజెపి బలహీన పడేది?

అలా కాకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే వారిని బయటకు తీసుకురావడం వల్ల బిజెపి బలపడుతుంది కదా అనే వాదనలు వినిపిస్తున్నాయి. బిజెపికి మద్దతు ఇచ్చే వైసీపీ, వైసీపీతో స్నేహం నెరపే కేసీఆర్, కేసీఆర్ తో దూరంగా ఉండే బిజెపి, అటూ ఇటూ కాకుండా ఉన్న తెలుగుదేశం, తెలంగాణలో ఉనికి చాటుకుంటున్న కాంగ్రెస్, ఆంధ్రాలో శక్తి చూపలేని కాంగ్రెస్ ఇలా… నడుస్తున్న ట్రయాంగిల్ లవ్ స్టోరీ లో ఎవరు ఎవరిని నిజంగా ప్రేమిస్తున్నారో వచ్చే ఎన్నికల నాటికి కానీ బహిర్గతం కాదు.

Related posts

స్థానిక సంస్థల ఇంచార్జి అదనపు కలెక్టర్ గా నాయక్

Bhavani

గెట్ రడీ : రేపు స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల

Satyam NEWS

విజయనగరం ఎస్పీ ఆధ్వర్యంలో నేర సమీక్ష సమావేశం…!

Satyam NEWS

Leave a Comment