40.2 C
Hyderabad
April 26, 2024 14: 38 PM
Slider సంపాదకీయం

వై ఎస్ షర్మిల పార్టీ ప్రభావం ఎంత?

#yssharmila

వై ఎస్ షర్మిల… ఆంధ్రాలో పుట్టినా తెలంగాణలో రాజకీయ పార్టీ ప్రారంభించి ఊరూరూ తిరుగుతున్న రాజకీయ నాయకురాలు. దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెల్లెలు…. ఇవన్నీ అందరికి తెలిసిన విషయాలే. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే….. షర్మిల పార్టీ ప్రభావం తెలంగాణ రాజకీయాలలో ఎంత ఉంటుంది అనే ప్రశ్న ఉత్పన్నం అయినప్పుడు ఇలాంటి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుంది.

వై ఎస్ షర్మిల పార్టీకి నిధుల కొరత లేదు. తెలంగాణ లో యథేచ్ఛగా పాలకులను తిడుతూ తిరుగుతున్నా అడిగే వాడు లేడు. తెలంగాణలోకి వచ్చి కేసీఆర్ ను తిడుతున్నా కూడా షర్మిలను కేసీఆర్ పట్టించుకోకపోవడం ఎంత అదృష్టం? సాధారణ నాయకులు కేసీఆర్ ను గానీ, ఆయన కుమారుడు కేటీఆర్ ను గానీ, ఆయన కుమార్తె కవితను గానీ విమర్శిస్తే గల్లీ నుంచి ప్రగతిభవన్ వరకూ ఉన్న నాయకులు అందరూ సదరు వ్యక్తిపై విరుచుకుపడతారు.

ఈ ముగ్గుర్నీ ఎందుకు విమర్శించామురా బాబూ అంటూ ఆ విమర్శకులు నెత్తి బాదుకునేలా చేస్తారు. సోషల్ మీడియాలో కేసీఆర్ సైన్యం అయితే అలాంటి వారిని దునుమాడుతుంది. కేసీఆర్ ను విమర్శించాలంటే ఎంతో గుండె ధైర్యం కావాలని కాంగ్రెస్, బీజేపీ నాయకులే అంటూ ఉంటారు. టీఆర్ఎస్ పై విమర్శల విషయానికి వస్తే కాంగ్రెస్, బీజేపీ నాయకులలో చాలా మంది ‘‘ మాకెందుకులే గొడవ’’ అనే భావనతో ఉంటారు. కొంత మంది అయితే ‘‘మా వాడు అనవసరంగా తిడుతున్నాడు… చూసుకోండి’’ అంటూ టీఆర్ఎస్ నేతలకు ఉప్పందిస్తారు కూడా.

తమ తమ పార్టీల్లో జరిగే అంతర్గత గొడవలను టీఆర్ఎస్ కు కూలంకషంగా చెప్పే నాయకులు కూడా ఉన్నారు. పరిస్థితి ఇంత భయానకంగా ఉంటే షర్మిల తన పాదయాత్రలో కేసీఆర్ ను ఇంత భయంకరంగా ఎలాంటి భయం లేకుండా ఎలా తిట్టగలుగుతున్నది? ఈ ప్రశ్నే ఇప్పుడు రాజకీయ పరిశీలకులను కూడా తొలిచివేస్తున్నది. తెలంగాణ లో ఉంటూ ‘‘కేటీఆరా? కేటీఆర్ ఎవరు….?’’ అంటూ ప్రశ్నించిన షర్మిలను టీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఉపేక్షిస్తున్నది? ఈ ప్రశ్నకు కూడా సమాధానం దొరకడం లేదు.

ఎవడ్రా నన్ను ఆపేది?

‘‘కేసీఆర్ చేయని మోసం లేదు’’ అంటూ సాక్ష్యాత్తూ తమ అధినేతపై పరుష పదజాలం వాడినా కూడా షర్మిలక్క ను గులాబి తమ్ముళ్లు ఏమనడం లేదు. నల్లగొండలో పాదయాత్ర చేసినప్పుడు మంత్రి జగదీశ్వర రెడ్డిని, వరంగల్ లో మంత్రి దయాకర్ రావును, వనపర్తిలో మంత్రి నిరంజన్ రెడ్డిని అత్యంత హేయమైన భాషలో షర్మిల విమర్శించారు. పైగా ‘‘తెలంగాణ లో ఎవడ్రా నన్ను ఆపేది?’’ అంటూ షర్మిలక్క ఘీంకరించినా టీఆర్ఎస్ నాయకులు ఏ మాత్రం స్పందించడం లేదు.

ఎవరైనా కింది స్థాయి టీఆర్ఎస్ కార్యకర్త ‘అదేంటి అలా తిడుతున్నావు’ అని ప్రశ్నిస్తే షర్మిలక్క నానా యాగీ చేస్తారు. దాంతో పోలీసులే వెళ్లి సర్ది చెప్పాల్సిన పరిస్థితి వస్తున్నది. ‘‘అమ్మా మీరు వెళ్లండి మేం చూసుకుంటాం’’ అని పోలీసులే చెబుతున్నారట. ఆంధ్రా పాలకులు దోచుకున్నారు అని తరచూ చెప్పే టీఆర్ఎస్ నాయకులు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి వారసురాలిని తెలంగాణ లో ఎలా తిరగనిస్తున్నారు అనేది పెద్ద ప్రశ్న.

జరుగుతున్న ఈ పరిణామాలు చూస్తుంటే టీఆర్ఎస్ నాయకులే షర్మిలక్కకు పరోక్ష మద్దతుఇస్తున్నారా అనే సందేహం కూడా కలుగుతున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద మద్దతు ‘రెడ్డి’ కులస్తుల నుంచి వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ 15 నుంచి 20 శాతం ఓట్లు ఉన్నాయంటే అది గ్రామ స్థాయిలో ఉన్న రెడ్డి నాయకుల వల్లే సాధ్యం అవుతున్నది. వీరే కాకుండా దళిత వర్గాల్లో కాంగ్రెస్ సానుభూతిపరులు గణనీయంగా ఉన్నారు.

ఓట్లు చీల్చే తురుపు ముక్క

కాంగ్రెస్ పార్టీని పూర్తిగా దెబ్బ తీయాలంటే ఈ రెండు వర్గాలను కాంగ్రెస్ పార్టీ నుంచి వేరేవైపు ఆలోచించే విధంగా చేయాలి. ఆ క్రమంలోనే వై ఎస్ షర్మిల పార్టీ రంగంలోకి వచ్చిందని పార్టీ ప్రారంభంలో అందరూ అనుకున్నారు. షర్మిల పార్టీ పెట్టే సమయానికి బీజేపీ ఇంతగా పుంజుకుని ఉండలేదు. దాంతో ఈ ఓట్లను చీల్చడానికి ఒక తురుపుముక్క అవసరం అయింది.

తెలంగాణ లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన షర్మిలక్కను ఎవరూ ఏమీ అనవద్దు అని స్వయంగా కేసీఆర్ చెప్పడంతో షర్మిలక్కకు తెలంగాణ లో తిరుగులేకుండా పోయింది. ‘‘దేశంలో ఎక్కడైనా ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టుకునే హక్కు ఉంటుంది’’ అనే చెత్త లాజిక్ తో టీఆర్ఎస్ పార్టీ షర్మిల జోలికి వెళ్లడం మానేసింది. అయితే కాలక్రమేణా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి అధ్యక్షుడు కావడంతో ‘రెడ్డి’ కులస్తులు పక్క చూపులు చూడటం ఆగిపోయింది.

అదే విధంగా కాంగ్రెస్ పార్టీపై ఆశలు చిగురించడంతో దళిత వర్గాలలో కూడా వేరే వైపు వెళ్లే అవసరం లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీ ఓట్లకు గండికొట్టే పని చేయడం షర్మిలక్కకు కష్టతరంగా మారింది. అయినా సరే ఆమె తిట్ల దండకాన్ని ఆపడం లేదు. గతంలో రేవంత్ రెడ్డి తిట్టే తిట్లకు ‘అబ్బా ఇదేం భాష’ అనుకున్నారు చాలా మంది. రేవంత్ రెడ్డి తిట్లను షర్మిలక్క తిట్లు డామినేట్ చేశాయి.

బీజేపీ అధ్యక్షుడుగా బండి సంజయ్ వచ్చిన తర్వాత షర్మిల తిట్లను ఆయన డామినేట్ చేశారు. ఈ తిట్ల దండకానికి ఆద్యుడైన కేసీఆర్ కే ఈ ముగ్గురు చుక్కలు చూపిస్తున్నారు (భాష విషయంలో). తెలంగాణ రాజకీయాలలో షర్మిల ఇంత హడావుడి చేస్తున్నా కూడా ఆ పార్టీ ప్రభావం పెద్దగా లేదనేది స్పష్టం.

Related posts

ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు తాత్వికత బోధించాలి

Satyam NEWS

జులై 1 నుంచి సీబీఎస్‌సీ 10వ, 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు

Satyam NEWS

హుజూర్ నగర్ అభివృద్ధికి శాయశక్తులా కృషి

Satyam NEWS

Leave a Comment