37.2 C
Hyderabad
April 26, 2024 21: 34 PM
Slider సంపాదకీయం

జూనియర్ ఎన్టీఆర్ పేలవమైన ట్వీట్ పెట్టడానికి కారణం ఏమిటి?

#kodalinani

హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీరామారావు పేరు తీసేయడాన్ని అందరూ తీవ్రంగా ఖండిస్తున్న నేపథ్యంలో ఆయన మనవడు, సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఎన్టీఆర్ పేరును తొలగించడాన్ని తీవ్రంగా ఖండించకుండా పేలవమైన కామెంట్ ను మాత్రమే జూనియర్ ఎన్టీఆర్ చేయడానికి కారణం ఎవరు అనే ప్రశ్న కూడా ఇప్పుడు తలెత్తతున్నది.

ఎన్టీరామారావు తనకు స్ఫూర్తి అని, ఆయన తన ప్రాణం అని చెప్పే జూనియర్ ఎన్టీఆర్ ఆయన సినీ వారసత్వాన్ని పుణికిపుచ్కుకున్నారు. అనతి కాలంలోనే జూనియర్ ఎన్టీఆర్ కు స్టార్ డమ్ వచ్చిందంటే అది కేవలం నందమూరి వంశానికి చెందిన వాడనేది మాత్రమే కారణమని అందరికి తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్ లోని వైద్య విశ్వవిద్యాలయానికి డాక్టర్ ఎన్టీరామారావు పేరును రాత్రికి రాత్రి తీసేస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం కార్యరూపం దాల్చడంతో ఒక్క సారిగా కలకలం రేగింది. తెలుగుదేశం పార్టీ వర్గాలే కాకుండా ఎన్టీఆర్ అభిమానులు, తటస్థులు కూడా ఈ నిర్ణయంపై మండిపడ్డారు. ఎన్టీరామారావును రాజకీయాలకు అతీతంగా చూడాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడ్డారు.

కొత్త యూనివర్సిటీ పెట్టుకుని దానికి ఎవరి పేరు పెట్టుకున్నా ఫర్వాలేదు కానీ ఉన్న యూనివర్సిటీ పేరు మార్చడం ఏమిటని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రిగా జగన్ తన మూడేళ్ల పదవి కాలంలో తీసుకున్న అన్ని నిర్ణయాలలోకెల్లా చెత్త నిర్ణయం ఇదేనని కూడా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

జగన్ ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నా కూడా ఎన్టీఆర్ సతీమణి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న లక్ష్మీపార్వతి ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన చేయలేకపోవడం కూడా చర్చనీయాంశం అయింది. తెలుగు సంస్కృత అకాడమీకి అధ్యక్షురాలుగా ఉన్న ఆమె తన పదవికి రాజీనామా చేసి నిరసన వ్యక్తం చేయాలని కూడా పలువురు కోరినా ఆమె స్పందించలేదు.

ఎన్టీఆర్ భార్యగా ఆమె స్పందించకపోవడం ఎన్టీఆర్ అభిమానులను బాధిస్తున్న తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ పుండుమీద కారం చల్లినట్లుగా మారింది. వై ఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల ఎలాంటి భేషజం లేకుండా పేరు మార్పు అంశాన్ని నిర్ద్వందంగా ఖండించారు.

ఇలా పేర్లు మార్చడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ఆమె కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. అయితే ఎన్టీఆర్ మనవడిగా చెప్పుకునే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఆ తెగువను ప్రదర్శించలేకపోయారు. పేలవమైన రియాక్షన్ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ పై అభిమానులు తీవ్రమైన రియాక్షన్ చూపారు.

ఇంతకీ జూనియర్ ఎన్టీఆర్ కు ఇలా పేలవమైన అభిప్రాయం చెప్పమని సలహా ఇచ్చింది ఎవరు? ఈ ప్రశ్న రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. జూనియర్ ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ ప్రాపకం కారణంగా రాజకీయ నాయకుడిగా అవతరించిన ప్రస్తుత మాజీ మంత్రి, గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని ప్రమేయం ఇందులో ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ఎన్టీఆర్ తమకు దేవుడు అని తరచూ అభివర్ణించే కొడాలి నాని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడికి బద్ధ వ్యతిరేకి. చంద్రబాబునాయుడి వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా అత్యంత పరుష పదజాలం వాడటం, తూలనాడటం కొడాలి నానికి సహజంగా వచ్చిన లక్షణం. హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చిన సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ ఏ మాత్రం ఘాటు వ్యాఖ్య చేసినా యూత్ లో అది జగన్ కు పూర్తి వ్యతిరేకంగా మారే అవకాశం ఉంటుంది.

ఈ ప్రమాదాన్ని గమనించిన కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ కు ఈ విధమైన ట్వీట్ పెట్టమని సలహా ఇచ్చారని సూచించినట్లు రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతున్నది. రాజకీయాలకు అతీతంగా ఈ విధమైన ట్వీట్ పెట్టడం ద్వారా మంచి పేరు వస్తుందని కూడా సూచించినట్లు చెబుతున్నారు. రాజకీయంగా చంద్రబాబునాయుడిపై కోపం పెంచుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ కు ఈ సలహా పూర్తిగా నచ్చి ఈ విధమైన ట్వీట్ పెట్టారని అంటున్నారు.

చంద్రబాబునాయుడి సతీమణి, జూనియర్ ఎన్టీఆర్ కు మేనత్త అయిన భువనేశ్వరిపై ఏపి అసెంబ్లీలో వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా ఆయన ఇలాంటి పేలవమైన అభిప్రాయమే వ్యక్తం చేశారు. ఆ నాటి ఆ సంఘటనలలో జూనియర్ ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితులైన కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశి ప్రమేయం ఉన్నందునే జూనియర్ ఎన్టీఆర్ పెద్దగా రియాక్ట్ కాలేదని అప్పుడు కూడా వార్తలు వచ్చాయి.

ఇప్పుడు సాక్ష్యాత్తూ తన తాత పేరు తీసేసినా ఆయన స్పందించకపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పేరు మార్పును తీవ్రంగా ఖండించడం ద్వారా తెలుగుదేశం పార్టీ లాభపడుతుందని, సొంతానికి ఎలాంటి ప్రయోజనం ఉండదని అలాంటప్పుడు కామెంట్ చేయాల్సిన అవసరం ఏమిటని జూనియర్ ఎన్టీఆర్ కు అందరూ నూరిపోసినట్టు చెబుతున్నారు.

అయితే జూనియర్ ఎన్టీఆర్ హార్డ్ కోర్ అభిమానులు మాత్రం కొడాలి నానితో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడడం లేదని అందువల్ల ఆయన సలహాను పాటించే అవకాశం లేదని అంటున్నారు. తెలుగుదేశం పార్టీకి, వైసీపీకి సమానదూరం పాటిస్తున్నానని చెప్పేందుకే హుందాగా ఆయన అలాంటి ట్వీట్ పెట్టారని జూనియర్ ఎన్టీఆర్ హార్డ్ కోర్ అభిమానులు అంటున్నారు.

Related posts

బాసరలో నాగుల పంచమికి నిజంగానే వచ్చిన పాము

Satyam NEWS

క్వశ్చన్ అవర్: బిజెపితో హనీమూన్ పిరియడ్ ముగిసిందా?

Satyam NEWS

వాట్ ఈజ్ దిస్: కరెంటు బిల్లు పట్టుకుంటే షాక్

Satyam NEWS

Leave a Comment