35.2 C
Hyderabad
April 27, 2024 13: 57 PM
Slider గుంటూరు

తక్షణమే ముఖ్యమంత్రి పదవిని వికేంద్రీకరించాలి

#jagan

అధికార వికేంద్రీకరణ అంశాన్ని పదే పదే చెబుతున్న అధికార వైసీపీ పార్టీ వారు ముఖ్యమంత్రి పదవిని కూడా వికేంద్రీకరించాలని అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి జగన్ కు ఒక లేఖ రాశారు. అధికార వికేంద్రీకరణ మంచిదని భావిస్తున్న వైసీపీ వారు ముఖ్యమంత్రి పదవిని ఉత్తరాంధ్రకు చెందిన వారికి ఇవ్వాలని ఆయన తన లేఖలో కోరారు.

ఆయన ముఖ్యమంత్రి జగన్ కు రాసిన లేఖ పూర్తి పాఠం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ .జగన్మోహన్ రెడ్డికి,

అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య వ్రాస్తున్న లేఖ

ముఖ్యమంత్రి గారూ...

ప్రజా రాజధాని అమరావతిని కూకటి వేళ్ళతో పేకలించేందుకు, దానిని అడవిని చేసేందుకు మీరు మూడు రాజధానుల వికేంద్రీకరణ  ఫార్ములాను చేపట్టారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు  వెయ్యి నలభై రోజులు పైబడి న్యాయపూరిత ఉద్యమం చేస్తున్నా, అత్యున్నత న్యాయస్థానం రాజధాని మార్పు శాసనసభకు లేదని చెప్పినా మీరు వినేందుకు, ఆ దిక్కుగా చూసేందుకు ఇష్టపడటం లేదు. ఒక ప్రక్క మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకొని, సిఆర్డిఏ చట్టాన్ని అమలు చేస్తానని కోర్టులో  అఫిడవిట్ దాఖలు చేసి దొడ్డిదారి గుండా మూడు ప్రాంతాలలో విభజన విత్తనాలను నాటేందుకు సిద్ధపడ్డారు.

మరో అడుగు ముందుకేసి విశాఖలో ‘ఉత్తరాంధ్ర గర్జన’, తిరుపతిలో ‘రాయలసీమ ఆత్మగౌరవ సభ’ల పేరిట ప్రభుత్వ ప్రోత్సాహక సభలు పెట్టి, ఉత్తరాంధ్ర,రాయలసీమ ప్రాంతాల వైకాపా నాయకులను, మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను అమరావతి రైతులపై, మధ్యాంధ్ర ప్రాంతంపై ఉసిగొలుపుతున్నారు. నానా దుర్భషలతో రెచ్చ గొడుతున్నారు. మూడు రాజధానులతో అభివృద్ధి వికేంద్రీకరణ పచ్చి మోసపూరితమని, అబద్ధమన్న సంగతి తమ మనస్సుకు బాగా తెలుసు అన్న సంగతి నాకు బాగా తెలుసు.

వికేంద్రీకరణపై తమకు అంత మమకారం ఉంటే,మీ ముఖ్యమంత్రి పదవిని ముందుగా వికేంద్రీకరించండి. సీఎం పదవిని ఉత్తరాంధ్రలోని వైకాపా నాయకులకు ఇవ్వండి. తద్వారా మీ నిజాయితీని,చిత్తశుద్ధిని చాటుకోండి. ఎందుకంటే,మద్రాసు నుండి భాషా ప్రయుక్త రాష్ట్రంగా 1953లో  ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుండి మీ రాయలసీమకు చెందిన నీలం సంజీవరెడ్డి (అనంతపురం) దామోదర సంజీవయ్య( కర్నూలు) కోట్ల విజయభాస్కర్ రెడ్డి (కర్నూలు) చంద్రబాబు నాయుడు (చిత్తూరు) నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి (చిత్తూరు) వైయస్ రాజశేఖర్ రెడ్డి (కడప )వైఎస్ జగన్మోహన్ రెడ్డిగా మీరు (కడప) ముఖ్యమంత్రులు అయ్యారు.

నెల్లూరుకు చెందిన బెజవాడ గోపాల్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, ప్రకాశం జిల్లాకు చెందిన టంగుటూరి ప్రకాశం పంతులు, గుంటూరుకు చెందిన కాసు బ్రహ్మానందరెడ్డి, కొణిజేటి రోశయ్య, భవనం వెంకట్రామిరెడ్డి, నాదెండ్ల భాస్కరరావు,కృష్ణా జిల్లాకు చెందిన నందమూరి తారక రామారావులు కూడా ముఖ్యమంత్రులుగా పని చేశారు. ఉమ్మడి ఏపీలో బూర్గుల రామకృష్ణారావు,టంగుటూరి అంజయ్య, మర్రి చెన్నారెడ్డి, జలగం వెంగళరావు, పీవీ నరసింహారావులు ముఖ్యమంత్రులుగా పనిచేశారు.

ఆనాటి నుండి ఈనాటి వరకు అంటే 69ఏళ్ళు ఏపీలోని తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఐదు జిల్లాలకు సీఎం పదవిలో పనిచేసే అవకాశం దక్కలేదు. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేసి ఉత్తరాంధ్ర అభివృద్ధికి పాటుపడతాను అనేకంటే, ఉత్తరాంధ్ర ప్రజలకు మీ సీఎం పదవిని త్యాగం చేసి పాటుపడటం మంచిది.

రాజధాని లేని రాష్ట్రానికి 29వేల మంది రైతులు 34 వేల ఎకరాలు ఇవ్వటం మీకు త్యాగంగా కనిపించడం లేదు, కాబట్టి ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసి త్యాగానికి అర్థం,పరమార్థం అంటే ఏమిటో రాష్ట్ర ప్రజలకు చెప్పండి. ఉత్తరాంధ్ర నాయకులు కూడా విశాఖ రాజధానిని చేస్తామనే మాయమాటలకు మోసపోకుండా, ముఖ్యమంత్రి పదవిపై దృష్టి కేంద్రీకరించండి. వత్తిడి తీసుకురండి. మీ పరిపాలనా దక్షతను నిరూపించుకోండి. తద్వారా ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకోండి.

గమనిక: లేఖను ఈ మెయిల్ ద్వారా సిఎంకు పంపటమైనది.

Related posts

జాతీయ జెండాపై మంత్రి వ్యాఖ్యలతో రణరంగంగా కర్నాటక అసెంబ్లీ

Satyam NEWS

తృణమూల్ కాంగ్రెస్ లో చేరిన సీనియర్ బిజెపి నేత

Satyam NEWS

ఎంపీపీ ఎస్ పాఠశాలల ఆధ్వర్యంలో విజ్ఞాన విహార యాత్ర

Satyam NEWS

Leave a Comment