28.7 C
Hyderabad
April 26, 2024 09: 24 AM
Slider ప్రపంచం

Analysis: లెక్కలు తప్పి ఉప్పెనలా వస్తున్న కరోనా

#Corona positive world

ప్రపంచ స్థాయిలో కరోనా బాధిత దేశంగా భారతదేశం 3వ స్థానానికి ఎగబాకింది. ప్రతి రోజు వేలాదిగా కొత్త కేసులు నమోదు కావడం వైరస్ వ్యాప్తి తీవ్రతను తెలుపుతోంది. దేశంలో ఇప్పటి వరకు మొత్తం పాజిటివ్ కేసులు 9 లక్షల మార్కు దాటి వేగంగా పెరుగుతున్నాయి.

పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న కొద్ది వారాలలో 10 లక్షల మార్కును దాటే ప్రమాదం ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అంచనా వేస్తోంది. దేశంలో 86 శాతం పాజిటివ్ కేసులు కేవలం 10 రాష్ట్రాలలో గుర్తించినవని, వాటిల్లో 50 శాతం కేసులు మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలలో ఉన్నట్లు కేంద్రం తెలిపింది.

లాక్ డౌన్ తర్వాత మారిపోయిన ముఖచిత్రం

అయితే మరణాల రేటు జాతీయ స్థాయిలో కేవలం 2.7 శాతంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా నేపథ్యంలో వివిధ దేశాలలో కోవిడ్-19 వ్యాప్తి, కొలుకునేవారి వివరాలు, మరణాల రేటుపై తాజా పరిస్థితి ని ప్రముఖ అంతర్జాతీయ మెడి కల్ జర్నల్ లాన్సెట్ తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది.

భారతదేశంలో  లాక్డవున్ సడలింపుల తరువాత వైరస్ బాధిత కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిందని నివేదిక స్పష్టం చేసింది. కరోనా దెబ్బకు మహారాష్ట్ర, గుజరాత్, దిల్లీ రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయినట్లు తేల్చిచెప్పింది. రానున్న రోజుల్లో దేశంలోని మిగతా ప్రాంతాలలో కూడా వైరస్ ఉద్ధృతమయ్యే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరించింది.

ఇంతగా వైరస్ విజృంభణకు ప్రభుత్వాల అలసత్వమే కారణమని విమర్శించింది..కీలకమైన లాక్డవున్ దశలో ఆరోగ్యవ్యవస్థను ఆశించిన స్థాయిలో బలోపేతం చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని లాన్సెట్ వ్యాఖ్యానించింది. 

పెను ముప్పునకు సంకేతాలు

మౌలిక సదుపాయాల కల్పన, పునర్మిర్మాణం ,ఆరోగ్య వైద్యశాఖలలో అవసరం మేరకు  వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని నియమించడంలో కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు చొరవ చూపకపోవడం ప్రస్తుత సమస్యకు ప్రధాన కారణాలుగా జర్నల్ గుర్తించింది.

అమెరికా, బ్రెజిల్ తో పాటు భారత దేశంలో నానాటికి కేసులు పెరగడాన్ని రానున్న పెనుముప్పుకు సంకేతంగా గుర్తించాలని మెడికల్ జర్నల్ హెచ్చరించింది. దీనిపై ఇప్పటి కైనా దృష్టి సారించాలని సూచించింది. అంతర్జాతీయ స్థాయిలో భారత దేశంలో కరోనావ్యాప్తి, కొలుకునేవారు,మరణాల రేటుపై ఇటీవల ఆసక్తికర చర్చ చోటు చేసుకుంటోంది.

 మంగళవారం రాత్రి 11 గంటల లెక్కల ప్రకారం 33 కోట్ల జనాభా ఉన్న అమెరికాలో నమోదైన 35 లక్షల కేసులలో 1లక్ష 38వేల మరణాలు సంభవించాయి. 21 కోట్ల 2 లక్షల జనాభా కలిగిన బ్రెజిల్ లో 19 లక్షల కేసులు ఉండగా 73 వేల మరణాలు నమోదయ్యాయి. 14 కోట్ల జనాభా ఉన్న రష్యాలో 7 లక్షల 40 వేల కేసులు ఉండగా 12 వేల మరణాలు చోటు చేసుకున్నాయి.

భారతదేశం విషయానికి వస్తే 138 కోట్లజనాభాలో ఇప్పటి వరకు 9 లక్షల 6 వేల కోవిడ్ కేసులు నమోదుకాగా 23, 700 మరణాలు సంభవించాయి. మరణాల రేటు కేవలం 2.7 శాతంగా ప్రకటించడం అనేక సంశయాలు తావిస్తోంది. దేశజనాభా లెక్కకు  అనుగుణంగా వైరస్ పరీక్షలు నిర్వహించకపోవడంతో కేసుల సంఖ్య ఖచ్చితంగా తెలియడంలేదనే వాదన వినిపిస్తోంది.

పరీక్షలు సరిగా నిర్వహించని రాష్ట్రాలు

కేవలం లక్షణాలు గుర్తించిన రోగులకు మాత్రమే పరీక్షలు నిర్వహిస్తే చాలదని, సామాజిక బ్లాకులుగా విభజించి, ప్రతి ఒక్కరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తే వాస్తవ కేసుల సంఖ్య తేలగలదని విశ్లేషకులు భావిస్తున్నారు. అతికొద్ది కాష్టాలలో మాత్రమే పరీక్షలు ముమ్మరంగా చేస్తున్నారని, ప్రతిపక్షాలు, పౌరసమాజాల ఒత్తిడి కారణంగా కొన్ని రాష్ట్రాలలో పరీక్షలు మొక్కుబడిగా నిర్వహిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఉదాహరణకు…తెలంగాణ ప్రజల ప్రాణాలు గాలికొదిలి, రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంపై  హైకోర్టు మండిపడింది.

కరోనా వ్యాప్తిని గుర్తించి బాధ్యతగా మెలగాలని హితవుచెప్పింది. గడచిన కొద్దినెలలుగా కరోనా మహమ్మారితో ఇబ్బందులు పడుతున్న ప్రజారోగ్యం విషయంలో రాష్ట్రప్రభుత్వం సీరియస్ గా స్పందించి సత్వరచర్యలకు ఉపక్రమించాలని హైకోర్టు సూచించింది. ప్రపంచ ఆరోగ్యసంస్థ సైతం కొన్ని  బాధిత దేశాలు తమకు ఖచ్చితమైన వివరాలు ఇవ్వడంలేదని అనేక మార్లు ప్రకటించింది.

ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ సంక్షోభం రానున్న రోజులలో ఎలా పరిణమిస్తుందో అంచనావేయడానికి మొత్తం కేసులు, కోలుకున్నవారు, మరణాల వివరాలు బాహాటంగా వెల్లడించాలని డబ్ల్యూ హెచ్ ఓ అర్థిస్తున్నా కొన్ని దేశాలు సానుకూలంగా స్పందించడం లేదని తెలుస్తోంది. వైరస్ నియంత్రణకు చేపట్టాల్సిన ఉమ్మడి వ్యూహానికి సభ్యదేశాల డబ్ల్యూ హెచ్ ఓ స్థాపన లక్ష్యం నెరవేరగలదని ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు సూచించడం గమనార్హం.

ఇప్పటికైనా వైరస్ బాధిత దేశాలు సరైన వివరాలు వెల్లడించి సహకరిస్తే మహమ్మారి నియంత్రణకు సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉందని గుర్తించాలి. లాన్సెట్ జర్నల్ సూచించినట్లు సౌదీ అరేబియాను ఆదర్శంగా తీసుకుని కరోనా నివారణకు కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగితే భారతదేశం లో కరోనా కట్టడిచేయడం అసాధ్యమేమీ కాదని ప్రజా ప్రభుత్వాలు గుర్తించాలి.

పొలమరశెట్టి కృష్ణారావు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మాజీ ఉన్నతాధికారి

Related posts

నెక్ట్స్ టార్గెట్: అయ్యన్న పాత్రుడిపై పావులు కదుపుతున్నారా?

Satyam NEWS

మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి

Satyam NEWS

మరో భారీ బడ్జెట్ తో ప్రభాస్ సినిమా

Satyam NEWS

Leave a Comment