37.2 C
Hyderabad
April 26, 2024 20: 49 PM
Slider అనంతపురం

పార్టీ పటిష్టతే లక్ష్యంగా కన్వీనర్లు, గృహసారథుల నియామకం

#MLA Ananta Venkatarami Reddy

రానున్న ఎన్నికల్లో సచివాలయ కన్వీనర్లు, గృహసారథులే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయసారథులని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులతో కలిసి అందరూ ఐకమత్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పటిష్టత, ప్రజలతో మమేకం కావాలన్న లక్ష్యంతోనే పార్టీ తరఫున సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రూపకల్పన చేశారని స్పష్టం చేశారు. నగరంలోని గుత్తి రోడ్డులో ఉన్న కేటీఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో బుధవారం అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి క్లస్టర్‌–1,

క్లస్టర్‌–4 సచివాలయాల కన్వీనర్లు, గృహసారథులు, వాలంటీర్లతో సామూహిక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా నియోజకవర్గ వైసీపీ పరిశీలకులు వెంకట్‌రెడ్డి యాదవ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు.

సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. వైఎస్‌ జగన్‌ను ఓడించడానికి అందరూ ఏకం కావాలని అంటున్నారని, ఇంతకంటే సిగ్గుచేటు మరొకటి ఉంటుందా? అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 98 శాతం అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదని చెప్పారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట ఇస్తే నెరవేరుస్తాడన్న నమ్మకం జనంలో ఉందని, ‘మా నమ్మకం నువ్వే జగన్‌’ అని ప్రజలంతా భావిస్తున్నారని తెలిపారు. ఇదే నినాదంతో అందరూ ముందుకెళ్దామని పిలుపునిచ్చారు.

క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేద్దాం

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేద్దామని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే సచివాలయ కన్వీనర్లు, గృహ సారథుల నియామకాలు చేపట్టినట్లు చెప్పారు. అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఐదు క్లస్టర్లుగా విభజించామన్నారు. కస్లర్‌–1 ఇన్‌చార్జ్‌గా వైసీపీ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖరరెడ్డి, క్లస్టర్‌–2 ఇన్‌చార్జ్‌గా చింతకుంట మధు, క్లస్టర్‌–3 ఇన్‌చార్జ్‌గా కొండ్రెడ్డి ప్రకాష్‌రెడ్డి, క్లస్టర్‌–4

ఇన్‌చార్జ్‌గా లక్ష్మన్న, క్లస్టర్‌–5 ఇన్‌చార్జ్‌గా ఆలమూరు శ్రీనివాసరెడ్డిలను పార్టీ నియమించిందని తెలిపారు. వారిని కన్వీనర్లు, గృహసారథులకు ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పరిచయం చేశారు. నియోజకవర్గంలో 1480 మంది వాలంటీర్లు ఉన్నారని, క్లస్టర్‌కు ఇద్దరు చొప్పున గృహసారథులుగా 3 వేల మందిని నియమించామన్నారు. ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లతో కలిసి వీరంతా సమన్వయంతో ఐకమత్యంగా ముందుకు సాగాలని సూచించారు.

ఈనెల 20 నుంచి డోర్‌ టు డోర్‌ క్యాంపెయిన్‌

కొత్తగా నియమించిన గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లతో పాటు కార్పొరేటర్లు, వాలంటీర్లందరితో ఈనెల 20వ తేదీ నుంచి 27వ తేదీ వరకు డోర్‌ టు డోర్‌ క్యాంపెయిన్‌ జరుగుతుందని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. ఇందుకోసం గృహసారథులకు ప్రత్యేక కిట్లు అందించనున్నట్లు చెప్పారు. ఈ కిట్‌లో గృహ సారథులు ధరించడానికి ప్రత్యేక బ్యాడ్జ్‌లు, ప్రజామద్దతు పుస్తకాలు, కరపత్రాలు, మొబైల్‌ స్టిక్కర్లు, డోర్‌ స్టిక్కర్లు ఉంటాయన్నారు.

ప్రతి ఇంటికి వెళ్లి ప్రజామద్దతు కోరాలని సూచించారు. గత ప్రభుత్వ పాలనకు, ఈ ప్రభుత్వ పాలనకు తేడాను ప్రజలకు వివరించాలని తెలియజేశారు. డోర్‌ టు డోర్‌ క్యాంపెయిన్‌లో ప్రజల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ కీలకమని ఎమ్మెల్యే అనంత స్పష్టం చేశారు. ప్రజా మద్దతు పుస్తకంలో ఐదు ప్రశ్నలు ఉంటాయని, వీటిని ప్రజలకు వివరించి వారి అభిప్రాయాలు ఎలా తీసుకోవాలని విపులంగా విశదీకరించారు. ఇంటి యజమాని అనుమతి తీసుకుని డోర్‌ స్టిక్కర్లు అతికించాలని, ఎక్కడా ఘర్షణ వాతావరణం లేకుండా చూసుకోవాలన్నారు. వారం రోజుల్లోనే డోర్‌ టు డోర్‌ క్యాంపెయిన్‌ పూర్తి చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

జగన్‌ సీఎంగా ఉంటేనే సంక్షేమ పథకాలు

రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉంటేనే సంక్షేమ పథకాలు అందుతాయని ఎమ్మెల్యే అనంత తెలిపారు. ఎన్టీఆర్‌ హయాంలో కిలో బియ్యం రూ.2 ఉంటే చంద్రబాబు సీఎం అయ్యాక దాన్ని రూ.5.25 చేశారని గుర్తు చేశారు. ఆ తర్వాత వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక రూ.1కే కిలో బియ్యం అందించారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నేతలు అధికారంలో ఉంటే కేవలం సంపాదనకు మాత్రమే పరిమితం అవుతారని విమర్శించారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే సచివాలయ వ్యవస్థను తెచ్చి ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. జగన్‌ సీఎం అయ్యాక ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రుల రూపురేఖలు మార్చివేశారన్నారు. ఆరోగ్యశాఖలోనే 70 వేల పోస్టులు భర్తీ చేశారన్నారు. ఒకే నోటిఫికేషన్‌తో లక్షా 25 వేల సచివాలయ ఉద్యోగులను భర్తీ చేయలేదా? అని ప్రశ్నించారు. అయినా తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని.. వాటిని ధీటుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.

ఎప్పుడైనా ఇంత అభివృద్ధి జరిగిందా?

అనంతపురం నగరంలో ఇప్పుడు జరుగుతున్నంత అభివృద్ధి ఎప్పుడైనా జరిగిందా? అని ఎమ్మెల్యే అనంత అన్నారు. ఇప్పటికే రూ.800 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, ఇటీవల రూ.25 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. పరిపాలన సౌలభ్యం కోసం త్వరలోనే అనంతపురం అర్బన్‌కు ప్రత్యేక తహశీల్దార్‌ కార్యాలయం రానున్నట్లు చెప్పారు. ప్రభుత్వం, సీఎం జగన్‌ చేస్తున్న మంచిని మనం చెప్పలేకపోతున్నామని.. ఇకపై అలాంటి పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు. మూడున్నరేళ్లుగా మనం చేస్తున్న మంచిని ప్రజలకు వివరిద్దామని పిలుపునిచ్చారు.

మీరు పార్టీకి.. వాళ్లు ప్రభుత్వానికి వారధులు..!

ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వాలంటీర్లు వారధులుగా ఉంటే.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి, ప్రజలకు మధ్య గృహసారథులు, కన్వీనర్లు వారధులుగా ఉంటారని ఎమ్మెల్యే అనంత స్పష్టం చేశారు. మీరంతా స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి అటు ప్రభుత్వం చేస్తున్న మంచిని, ఇటు పార్టీ సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు.

వచ్చే ఎన్నికల్లో అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండా మరోసారి ఎగురేద్దామని పిలుపునిచ్చారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తిరుగులేదని నిరూపిద్దామని, అందరూ కలిసి డోర్‌ టు డోర్‌ క్యాంపెయిన్‌ దిగ్విజయం చేయాలని సూచించారు.

ప్రజలకు మరింత చేరువ అవుదాం

ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రతి ఒక్కరికీ వివరిస్తూ ప్రజలకు మరింత చేరువ అవుదామని నియోజకవర్గ పరిశీలకులు వెంకటరెడ్డి యాదవ్‌ పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్న వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా కొత్తగా నియమితులైన గృహసారథులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో పేదలకు, పెత్తందార్లకు మధ్య యుద్ధం నడుస్తోందని.. మనం పేదల వైపు నిలబడదామని పిలుపునిచ్చారు.

గృహసారథులంతా వైఎస్‌ఆర్‌ కుటుంబ సభ్యులేనని, భవిష్యత్‌లో మంచి నాయకులుగా ఎదిగేందుకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నర్సింహయ్య, మేయర్‌ మహమ్మద్‌ వసీం, ఉర్దూ అకాడమీ చైర్మన్‌ నదీం అహ్మద్, మాజీ మేయర్‌ రాగే

పరశురాం, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్‌రెడ్డి, డైరెక్టర్లు గౌస్‌బేగ్, శ్రీదేవి, వక్ఫ్‌బోర్డు అనంతపురం జిల్లా చైర్మన్‌ కాగజ్‌ఘర్‌ రిజ్వాన్, మార్కెట్‌ యార్డు చైర్మన్‌ ఫయాజ్, బీసీ రమేష్‌గౌడ్, వైసీపీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు కృష్ణవేణి, 1, 4 క్లస్టర్ల పరిధిలోని కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

Related posts

ఏపి అసెంబ్లీ స్పీకర్ కారుకు ప్రమాదం

Satyam NEWS

దుబ్బాక గెలుపు చారిత్రాత్మకం

Sub Editor

శ్రీశైల మహా క్షేత్రంలో ఉగాది మహోత్సవాలు

Satyam NEWS

Leave a Comment