37.2 C
Hyderabad
April 26, 2024 20: 13 PM
Slider సంపాదకీయం

ట్విట్టర్ ఉంది కదా అని పెట్రేగిపోతే ఎలా…?

#media

జరుగుతున్న పరిణామాలలో మీడియా పాత్ర ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమే… సమాధానం దొరకదు కూడా… అయితే ప్రధాన స్రవంతి మీడియాపై ఈ సోషల్ మీడియా కాలంలో ఎవరైనా అత్యంత నీచమైన కామెట్లు పెట్టవచ్చా?… కచ్చితంగా పెట్టవచ్చు… ఎవరూ ఏమీ అనరు.

మీడియా పైనేంటి? సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై కూడా కామెంట్లు పెట్టవచ్చు. భావ ప్రకటనాస్వేచ్ఛ పేరుతో ట్విట్టర్ లో యథేచ్ఛగా కామెంట్లు వస్తున్నాయి. అధికారంలో ఉన్న పార్టీ లేదా ఆ పార్టీ నాయకులపై ఇలా పెడితే మాత్రం పోలీసులు వచ్చి పట్టుకుపోతారు… వ్యవస్థలపై బురద చల్లినా లేక వ్యక్తులపై విషం కక్కినా ప్రభుత్వాలు మాత్రం ఏమీ మాట్లాడవు. ఇదేం నీతి? అంటారా… అది అంతే.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజుపైనా, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిపైనా, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపైనా అత్యంత దారుణమైన కామెంట్లు పెట్టే పంచ్ ప్రభాకర్ అనే వ్యక్తిపై ఢిల్లీ పోలీసులు కేసు పెట్టారు. ఈ విషయం రఘురామకృష్ణంరాజు మీడియాకు వెల్లడించారు. పోలీసులు కేసు పెట్టారు కదా అని ఆయనేం తగ్గలేదు. మరింత రెచ్చిపోయి బూతులతో కూడిన కామెంట్లు పెడుతూనే ఉన్నాడు.

పంచ్ ప్రభాకర్ అనే వ్యక్తి మా పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉండగా ఏపి సిఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మహిళలపై అత్యాచారాల కేసులపై మాట్లాడుతూ రెండు పత్రికలు, రెండు టీవీ ఛానెళ్లు (ఆయన పేర్లు కూడా చెప్పారు) ప్రభుత్వాన్ని కావాలని అప్రతిష్టపాలు చేస్తున్నాయని కామెంట్ చేశారు.

ప్రభుత్వం యంత్రాంగం అలాంటి వాటిని సహించవద్దని కూడా ఆదేశాలు జారీ చేశారు. మీడియానే తనకు ప్రత్యర్థి అనే ఆయన ఇన్ డైరెక్టు వ్యాఖ్యలతో సోషల్ మీడియా టైగర్లకు కోరలతో బాటు కొమ్ములు కూడా వచ్చేసినట్లయింది. జగన్ మోహన్ రెడ్డి ఫొటో పెట్టుకుని మరీ దారుణమైన వ్యాఖ్యలు చేసేస్తున్నారు. పనిలో పనిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై కూడా పరోక్షంగా ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారో ఈ ఒక్క ట్విట్ చూస్తే అర్ధం అవుతున్నది.

రాజకీయాలు వేరుగా, మీడియా వేరుగా ఉండదు. ఈ రెండింటికి మధ్య దూరం చెరిగిపోయి చాలా కాలం అయింది. ఏ పత్రిక లేదా ఛానెల్ వారికి వచ్చిన సమాచారాన్ని లేదా వారికి నచ్చిన వారితో విశ్లేషణలు చేయించుకుంటుంటాయి. తెలుగు పత్రికారంగంలో మొదటి మూడు స్థానాలలో ఉన్న పత్రికలు చదివితే ఇది అర్ధం అవుతుంది. టీవీ ఛానెళ్లు కూడా అంతే. తమకు వ్యతిరేకంగా ప్రచారం చేసే ఛానెళ్లు తమ రాష్ట్రంలో ప్రసారం కాకుండా ప్రభుత్వాలు అడ్డుకుంటున్నాయి కూడా.

కొనే వీలున్న ఛానెళ్లన్నింటిని తెలంగాణ లో అయితే పెద్ద పెద్ద పెట్టుబడిదారులు కొనేశారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం నుంచి తెలంగాణ, ఏపి ప్రభుత్వాలు మీడియాపై దాష్టీకం చేయడంలో పోటీలు పడిమరీ పని చేస్తున్నాయి. ఇందులో ఎవరూ తక్కువ కాదు.

అలాగని మీడియా సంస్థలు కూడా అంతే… వీలు చూసుకుని ప్రభుత్వ వ్యతిరేకతను రెచ్చగొడుతున్నాయి. మీరు తప్పులు చేస్తే మేం చెప్పవద్దా అంటూ మీడియా సంస్థలు ప్రశ్నిస్తుంటాయి. మేం చేసేవి తప్పులే కాదు.. మీరే వక్రబుద్ధితో చూస్తున్నారని అధికారంలో ఉన్న పార్టీలు పదే పదే చెబుతున్నాయి.

ఎవరూ తగ్గడం లేదు. పనిలో పనిగా ఎవరికి వారు తమ ఆలోచనలను ప్రజల్లో చొప్పించడానికి సోషల్ మీడియా ను ఉపయోగించుకుంటున్నారు. ప్రధాన మీడియా సంస్థల నుంచి ప్రధాన రాజకీయ పార్టీల వరకూ సోషల్ మీడియాపై ఆధారపడి తమ వ్యాపారాలు, తమ రాజకీయాలు చేసుకుంటున్నాయి.

ఎవరి ప్రయోజనం వారు కాపాడుకోవచ్చు కానీ ఇలా వ్యవస్థల్ని, వ్యవస్థలకు బాధ్యత వహించే వారిని బద్నామ్ చేస్తే ఆ వ్యవస్థ సంగతి ఎలా ఉన్నా, సంబంధిత వ్యక్తి పరిస్థితి ఎలా ఉన్నా మొత్తం సమాజం భ్రష్టు పట్టిపోతుంది. సమాజాన్ని భ్రష్టు పట్టించి రాజకీయం చేయాలనుకోవడం అవివేకం.

Related posts

చంద్రబాబు పర్యటనలో పెయిడ్ కూలీల నిరసనలు

Satyam NEWS

అంబేద్కర్ పేరు చెప్పుకునే యోగ్యత కూడా జగన్ రెడ్డికి లేదు

Satyam NEWS

ఎండ ముదురుతున్నా ఆగని సీతక్క ప్రయాణం

Satyam NEWS

Leave a Comment