30.7 C
Hyderabad
April 29, 2024 06: 40 AM
Slider సంపాదకీయం

కోనసీమ వైసీపీలో ముసలం: తగ్గేదెలే..అంటున్న బోస్

తారాస్థాయికి చేరిన ఎంపీ బోస్ మంత్రి చెల్లుబోయిన మధ్య విభేదాలు

ఎన్నికలు సమీస్తున్న కొద్దీ రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు శర వేగంగా మారుతున్నాయి. ఒక వైపు రాయల సీమలో అధికార వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు పెరిగి పోతుండగా… అదే పరిస్థితి కోనసీమలో నెలకొంది. రాయల సీమలోని అనంతపురం జిల్లా హిందూపూర్ ఎమ్మెఎల్సీ ఇక్బాల్ .. కోనసీమలో ఎంపీ బోస్ వైసీపీని వీడి టీడీపీలో చేరడానికి సమాయత్తం అవుతున్నారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

పూర్వాపరాలు పరిశీలిస్తే రామచంద్రాపురం వైసీపీ లో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. వీరిద్దరిలో పంచాయతీ తాడేపల్లి ప్యాలెస్ వరకు చేరుకుంది. సయోధ్యకు ముఖ్యమంత్రి జగన్ యత్నించినప్పటికీ ఫలితం మాత్రం శూన్యమే అయింది.

స్వయంగా ముఖ్యమంత్రి జగన్ జోక్యం చేసుకున్నప్పటికీ పరిస్థితి ఏ మాత్రం సద్దుమణగలేదు.. వివాదం మరింత ముదిరిపోయింది. మంత్రి వేణు, ఎంపీ బోసు నువ్వా? నేనా? అన్నట్టు ఇరు వర్గాలు తలపడుతున్నాయి. తనకు వ్యతిరేకంగా మంత్రి వేణు వర్గం పనిచేస్తున్నా అధిష్టానం చూసి చూడనట్లు వ్యవహరిస్తోందని ఎంపీ బోసు అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి వేణుకు టికెట్ ఇస్తే వైసీపీకి రాజీనామా చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తాను లేదంటే తన కొడుకు రామచంద్రపురం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తామని అన్నారు. వేణుతో విబేధాల జగన్ తనను పిలిచి మాట్లాడారని, మంత్రి వేణుతో కూర్చుని చర్చిస్తానని జగన్ తనతో చెప్పారన్నారు. అయితే వేణుతో భేటీకి తాను రానని జగన్ కు చెప్పానని పిల్లి సుభాష్ చెప్పారు. ఈ విషయంలో ఇబ్బంది పెట్టొద్దని జగన్‌కు చెప్పానని అన్నారు. వేణు చెప్పు కింద బతికే వాళ్ళు నియోజకవర్గం లో ఎవరూ లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇరువురి మధ్య ఏమాత్రం పొసగని పరిస్థితుల్లో వచ్చే నెలలో ఏ క్షణమైనా వైసీపీకి రాజీనామా చేసేందుకు పిల్లి సుభాస్ సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం బోసు తనయుడు పిల్లి సూర్యప్రకాష్ మంత్రి వేణుకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ తనను ఆశీర్వదించాలని కోరుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అధిష్టానం మంత్రి వేణుకే టిక్కెట్ ఖరారు చేస్తే.. ఇండిపెండెంట్‌గానైనా లేదా టీడీపీ తరఫున బరిలోదిగి వేణును ఓడించాలని నిర్ణయించారు. స్పష్టంగా చెప్పాలంటే ఇక్కడ మంత్రి వర్సెస్ బోసుగా మారింది.

ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి వేణు వర్గం వైసీపీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసింది. మంత్రిగా వేణు బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయనను సన్మానించేందుకు ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంపై తనకు సమాచారం లేదని పిల్లి సుభాష్ చెబుతున్నారు. మరోవైపు గతవారం బోస్ వర్గం నిర్వహించిన సమావేశంలో రాబోయే ఎన్నికల్లో బోస్ కుమారుడు పిల్లి సూర్యప్రకాష్ పోటీ చేస్తారని మంత్రికి వ్యతిరేకంగా తీర్మానం చేశారు. దీంతో మూడేళ్ల బలప్రదర్శన కార్యక్రమం ఇప్పుడు రెండు వర్గాల ఆధిపత్యపోరును మరోసారి బయటపెట్టింది. ఎవరికి వారే నేతలు ఇష్టనుసారం వ్యవహరిస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో మంత్రి వేణుకి రామచంద్రాపురం టికెట్‌ ఇస్తే… తాను లేదా తన కుమారుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తామని… వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ఈ సందర్భంగా తేల్చిచెప్పారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న కేడర్‌ను… మంత్రి వేణు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని బోస్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి వేణుతో కూర్చోబెట్టి సమస్యను పరిష్కరిస్తామని సీఎం చెప్పారన్న బోస్‌… ఆ ప్రతిపాదన ఎట్టి పరిస్థితుల్లో తనకు ఆమోదయోగ్యం కాదని చెప్పానన్నారు.

30 ఏళ్లుగా తనతోనే ఉన్న క్యాడర్ నిత్యం అవమానాలు ఎదుర్కొంటున్నారని, మంత్రి వేణు వారిపై కేసులు పెట్టిస్తున్నారని సుభాష్ చంద్రబోస్ మండిపడ్డారు. మున్సిపల్ వైస్ చైర్మన్ దళితుడనే ఆయనపై చేయి చేసుకున్నారని, మంత్రి సమక్షంలో కొట్టడం సబబేనా, ఇలాంటి పనులు మౌనంగా చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు.

మంత్రి ఎదుటే మున్సిపల్ వైస్ చైర్మన్​పై దాడి.. శివాజీ ఆత్మహత్యాయత్నం అధిష్టానం వద్దకెళితే వారు గుమ్మం తలుపు కూడా తీయరన్న సుభాష్.. రామచంద్రపురంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశానికి తనను, సీనియర్ నేత తోట త్రిమూర్తులుని పిలవొద్దని మంత్రి చెప్పిన నాడే మంత్రి వేణు వైసీపీ అభ్యర్థి అయితే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని చంద్రబోస్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి వేణు వ్యవహార శైలిపై బోస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts

రీసౌండ్ ఆఫ్ రెబెల్స్: అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి

Satyam NEWS

కరోనా పేరుతో అమరావతి రైతుల శిబిరాలు ఖాళీ

Satyam NEWS

విద్యతోనే ఉన్నత లక్ష్యాలు చేరుకోవచ్చు

Bhavani

Leave a Comment